ఆ వాస్తవం కొందరికి నచ్చదు!


Thu,July 4, 2019 12:19 AM

rajendra prasad interview Movie oh baby

కథా, కథనాలు చాలా ఆసక్తికరంగా అనిపించి చేసిన సినిమా ఓ బేబీ. ఇందులో సమంత,లక్ష్మీలకు బాయ్ ఫ్రెండ్‌గా నటించాను. నేను చాలా అదృష్టవంతుడిని. కొంత మందితో నటిస్తున్నప్పుడు కొత్తగా, మరింత ఉత్సాహంగా అనిపిస్తుంటుంది. బామ్మబాట బంగారు బాటలో భానుమతిగారికి మనవడిగా నటిస్తే, బృందావనంలో అంజలిదేవి నాకు అమ్మగా నటించారు. ఈ చిత్రంలో సీనియర్ నటి లక్ష్మికి జోడీగా బాయ్ ఫ్రెండ్‌గా నటించడం సరికొత్త అనుభూతినిచ్చింది అన్నారు రాజేంద్రప్రసాద్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఓ బేబీ. సమంత కీలక పాత్రలో నటించింది. నందినిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నటుడు రాజేంద్ర్రప్రసాద్ బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు.

సీనియర్ నటి లక్ష్మి, నేను ఓ హోటల్‌ని నడుపుతుంటాం. సడన్‌గా లక్ష్మీ మాయమైపోతుంది. ఆ స్థానంలో సమంత వచ్చేస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. నేను ఇప్పటి వరకు చేసిన ఆ నలుగురు,మీ శ్రేయోభిలాషి, ఓనమాలు చిత్రాలకు పూర్తి భిన్నంగా ఇందులో నా పాత్రని దర్శకురాలు నందినిరెడ్డి అద్భుతంగా మలిచారు. ఇలాంటి పాత్ర నా లాంటి నటుడికి లభిస్తే ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి సినిమాల్లో నిలిచే చిత్రమిది. కొరియన్ చిత్రం మిస్ గ్రానీని తీసుకుని తెలుగు నెటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమంత చాలా గౌరవంతో అద్భుతంగా ఈ చిత్రంలో నటించిన తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. ఇంత మంచి చిత్రంలో నటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.

వృత్తిపరమైన సంతృప్తినిచ్చింది..

కొన్ని సినిమాలు జేబు సంతృప్తినిస్తే కొన్ని సినిమాలు మాత్రమే జాబు సంతృప్తినిస్తాయి. అలా ఓ బేబీ వృత్తిపరమైన సంతృప్తిని మిగిల్చిన చిత్రం. ఓ బేబీ పాత్రకు సమంత ది బెస్ట్ ఇచ్చింది. సినిమాలో ప్రతి పాత్ర నటించినట్టుగా కాకుండా అత్యంత సహజంగా వుంటాయి. దానికి కారణం నందినిరెడ్డి తీర్చి దిద్దిన పాత్రలే. అంత బాగా కుదిరాయి. సమంత ఓ సన్నివేశంలో నన్ను జుట్టు పట్టుకు తంతుంది. ఇలాంటి సరదా సన్నివేశాలు, మా పాత్రల అల్లరి సినిమాలో పతాక స్థాయిలో సాగుతుంది. థియేటర్‌లో ప్రేక్షకులు కొత్త రకం తెలుగు సినిమాని చూస్తారు. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో నేర్చుకుంది ఈ సినిమాకు బాగా పనికొచ్చింది. దర్శకురాలు నందిని రెడ్డికి ఈ సినిమా ఓ చక్కని అవకాశం. ఆమెకు ఈ సినిమా బిగ్ బ్రేక్ ఇస్తుంది.

అలా అంటే కొంత మందికి నచ్చదు..

హాస్యనటులైన రాజాబాబు, రేలంగి హీరోలుగా అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. అయితే హీరో చేసే కామెడీకి హాస్యనటుడు చేసే కామెడీకి చాలా తేడా వుంది. భరించగలిగితే నాలా నిలబడతారు లేదంటే పరిస్థితి మరోలా వుంటుంది. నేను అలా అంటే కొంత మందికి నచ్చదు. కానీ వాస్తవం అదే. కానీ సినిమా విషయంలో ఎప్పుడూ ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏమౌతారో చెప్పలేం. ఈ నెలలో నేను నటించిన మూడు చిత్రాలు రీలీజ్ అవుతున్నాయి. ఓ బేబీ, బుర్రకథ, కౌసల్య కృష్ణమూర్తి. ఈ మూడు చిత్రాల్లో నేను పోషించిన పాత్రలు ఒకదానికి మించి ఒకటి పూర్తి భిన్నంగా సాగుతాయి. ఆ తేడా కనిపించకపోతే సినిమా పరిశ్రమనుంచి వెళ్లిపోతాను.

1476

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles