విలన్‌గానూ నటిస్తా!


Wed,July 3, 2019 12:12 AM

rajashekar kalki movie director prasanth varma interview

పోలీస్ పాత్రలనగానే తెలుగు చిత్రసీమలో తొలుత హీరో రాజశేఖర్ గుర్తొస్తారు. విలక్షణ అభినయం, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీతో కథాంశాల్లో అలవోకగా ఒదిగిపోతుంటారాయన. కుటుంబ చిత్రాల్లో కూడా తనదైన ముద్రను చాటుకున్నారు. గరుడవేగ సక్సెస్‌తో తిరిగి విజయాల బాట పట్టారాయన. రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చిత్రం కల్కి. ప్రశాంత్‌వర్మ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో రాజశేఖర్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..

-సినిమాలోని యాక్షన్స్ సీక్వెన్స్ చూసి నా కూతుళ్లు మెచ్చుకున్నారు. ఇప్పుడున్న హీరోలతో పోటీపడుతూ పోరాట ఘట్టాలు చేశానంటూ వాళ్ల ఫ్రెండ్స్ మెచ్చుకున్నారని చెప్పారు. ఈ వయసులో యాక్షన్ సన్నివేశాలు చేయడం కష్టమే కానీ అవి చేసే సత్తా నాకుంది.

-జంతువుల్ని చంపడం పాపం అనే ఆలోచనతో రెండేళ్ల నుంచి మాంసాహారం తినడం మానేశాను. నా స్ఫూర్తితో మా పిల్లలు కూడా తినడం మానేశారు. ఇంట్లో అందరం వెజిటేరియన్స్ అయిపోయాం.

కల్కి సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తున్నది?

-నా నటన, మేనరిజమ్స్‌తో పాటు పరిశోధన అధికారిగా కనిపించిన విధానానికి మంచి పేరు లభిస్తున్నది. అయితే వసూళ్ల పరంగా 60 నుంచి 70 శాతం మార్కులే వచ్చాయి. పాస్ అయ్యాం కానీ వందమార్కులు రాలేదు.

అలా జరగడానికి కారణం ఏమిటనుకుంటున్నారు?

-కారణం ఏమిటో తెలియదు. విశ్లేషించిన తర్వాతే ఎక్కడ తప్పులు జరిగాయో తెలుస్తాయి. ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథల్నివేగంగా నడిపించడం చాలా ముఖ్యం. వేగం పెంచి గ్రిప్పింగ్‌గా తెరకెక్కిస్తే సినిమా మరింత పెద్ద విజయాన్ని సాధించేది.

పోలీస్ పాత్రకు సంబంధించిన లుక్, ైస్టెల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

-పోలీస్ యూనిఫామ్ ఒంటిపై ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతాను. భోజనం కూడా గుర్తుకురాదు. పోలీస్ పాత్రలకు తగినట్లుగా వ్యాయామాలు చేస్తాను. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ నటిస్తాను.

గరుడవేగ కల్కి సినిమాలతో కథల విషయంలో మీరు కొత్తగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది?-నవతరం హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేయాలంటే కొత్తగా ఆలోచించక తప్పదు. ప్రేమకథలు, డ్యూయెట్లు పాడే వయసు నాది కాదు. ఆ టైమ్ ముగిసింది. అలాంటి సినిమాల్ని ఎవరూ ఇష్టపడటం లేదు. సహజత్వాన్ని కోరుకుంటున్నారు. అందుకే నా వయసుకు తగ్గ కథల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాను.

ఈ సినిమా దర్శకత్వ వ్యవహారాల్లో జీవిత జోక్యం చేసుకున్నారనే వార్తలు వినిపించాయి?

-ఓ నిర్మాతగా సినిమా బాగా రావడానికి కృషిచేసింది తప్పితే దర్శకత్వంలో తన ఇన్‌వాల్వ్‌మెంట్ లేదు. ఒకవేళ జీవిత దర్శకత్వ బాధ్యతల్లో పాలుపంచుకుంటే టైటిల్స్‌లో తన పేరు వేయకపోతే నేను ఊరుకోను. ఎవడైతే నాకేంటి సినిమాను తొలుత సముద్ర దర్శకత్వంలో ప్రారంభించాం. కానీ అనివార్య కారణాల వల్ల జీవిత సినిమాను పూర్తిచేయాల్సిన అవసరం వచ్చింది. పేరు వేయద్దని తాను చెప్పినా కూడా దర్శకురాలిగా జీవిత పేరు వేశాం.

ఏం సెప్తిరి ఏం సెప్తిరి అనే డైలాగ్ గురించి ప్రశాంత్‌వర్మ చెప్పగానే ఏమనిపించింది?

-సినిమాలో ఆ డైలాగ్ రెండు సార్లు వస్తుంది. తొలుత దాని గురించి చెప్పగానే ప్రశాంత్‌వర్మ అద్భుతంగా రాశాడని అనిపించింది. తొలిసారి ఆ సీన్ చేస్తున్నప్పుడు జీవిత నా పక్కన లేదు. అదే డైలాగ్‌ను రెండోసారి చెప్పే సమయంలో జీవిత సెట్స్‌లో ఉండటంతో తనకు ఈ డైలాగ్ గురించి చెప్పాను. అది నాపై కామెడీ చేయడానికి ఉపయోగించే డైలాగ్ అని జీవిత చెప్పే వరకు నాకు తెలియదు. నా సంభాషణ అని తెలియకుండానే నటించాను.

గరుడవేగ-2 ఎప్పుడూ ప్రారంభం కానుంది?

-ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు కథను సిద్ధంచేస్తున్నారు. పాయింట్ విన్నాను. చాలా బాగుంది. ఈ ఏడాది చివరలో సినిమాను మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాం.

కల్కి-2 సినిమా చేస్తారా?

-కల్కి క్యారెక్టర్ కొనసాగిస్తూ సినిమాలు చేయాలనే ఆలోచన ఉంది. ఆ పాత్రను ఏ కథలోనైనా వాడుకోవచ్చు.

బాలకృష్ణతో కలిసి మీరు ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి?

-అలాంటి వార్తలు చాలా వచ్చాయి. వాటిలో వాస్తవం లేదు. అలాగే విలన్‌గా నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రెగ్యులర్ విలన్ పాత్రలు కాకుండా ధృవ సినిమాలో అరవింద్‌స్వామి మాదిరి ప్రతినాయకుడి పాత్రలు చేయాలని ఉంది. కథ బాగా నచ్చితే అతిథి పాత్రలు, సహాయనటుడిగా కనిపించడానికి అభ్యంతరం లేదు.

దొరసాని ట్రైలర్‌లో శివాత్మిక నటన చూసి ఎలాంటి అనుభూతికి లోనయ్యారు? కూతుళ్లతో కలిసి సినిమా చేస్తారా?

-నా ఇద్దరు కూతుళ్లతో పాటు జీవిత, నేను కలిసి ఓ సినిమా చేయాలనే ఆలోచన ఉంది. కథ కూడా సిద్ధమైంది. అయితే శివాని, శివాత్మిక కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఆ సినిమాను మొదలుపెడతాం. పెద్ద బ్యానర్ ద్వారా శివాత్మిక పరిచయం కావడం ఆనందంగా ఉంది. తను ఎలా నటిస్తుందో అనే అనుమానం ఇదివరకు ఉండేది. కానీ దొరసానిలో అద్భుతంగా నటించిందని, సావిత్రిలా కనిపిస్తుందని చిత్ర బృందం ప్రశంసిస్తుండటంతో అవన్నీ తొలగిపోయాయి.

Giveth
-ప్రశాంత్‌వర్మ లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడు ఉండగా దర్శకత్వంలో నేనెందుకు జోక్యం చేసుకుంటాను. ఆ అవసరం నాకు లేదు. అనుకున్న పనులు సరైన సమయంలో పూర్తికాని పరిస్థితుల్లో దర్శకుడితో చర్చించిన అంశాల్ని జోక్యం అనుకుంటే ఎలా? అది మా సినిమాపై మేము తీసుకున్న జాగ్రత్త మాత్రమే. నేను దర్శకత్వం వహించిన సినిమాలు విజయాలు సాధించాయా? లేదా అన్నది పక్కనపెడితే నా దర్శకత్వంలో మాత్రం లోపాలు లేవు. నాకున్న పరిజ్ఞానంతో సొంత సినిమా బాగా రావడానికి చేస్తున్న కృషిని జోక్యంగా భావించడం సరికాదు. కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తున్నప్పుడు దర్శకత్వం వహించాలనే కోరిక ఉంటే నేను తీస్తాను తప్ప మరొకరికి ఎందుకు అవకాశం ఇస్తాను.

-అవసరమైన చోట రొమాన్స్ పెట్టడం తప్పు కాదు. అంతేకానీ అవసరం లేకుండా మితిమీరిచూపించడం ఇబ్బందిగా ఉంది. మణిరత్నం, బాపు, విశ్వానాథ్.. ఇలా దిగ్గజ దర్శకులందరూ రొమాంటిక్ సినిమాలు చేశారు. కానీ వారి సినిమాల్లో అసభ్యత కనిపించదు. సెన్సార్ బోర్డు సభ్యురాలిగా నా దగ్గరకు వస్తున్న సినిమాలు చూస్తుంటే ఎలా స్పందించాలో తెలియడం లేదు. నేను హీరోయిన్‌గా నటించాను. నా కూతుళ్లు సినిమాలు చేస్తున్నారు. రొమాన్స్ వద్దని చెప్పడం లేదు. కుటుంబంతో కలిసి చూస్తే ఇబ్బందిగా ఫీలయ్యే పరిస్థితి రావొద్దు.

-రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు సఖ్యతగా ఉండటం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రా అనే ఫీలింగ్ లేదని అనిపిస్తున్నది. సీఎంల స్నేహసంబంధాల వల్ల తెలుగు వారందరికి మంచి జరుగుతుంది. పదవులు ఆశించి వైఎస్సార్ పార్టీకి మద్దతు ఇవ్వలేదు.

2445

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles