మీటూను.. అందరూ మర్చిపోయారు!


Mon,February 18, 2019 11:03 PM

Raai Laxmi interview Telugu about Where Is The Venkatalaxmi

ప్రత్యేక గీతాలతో ప్రేక్షకుల హృదయాల్లో గిలిగింతలు పెట్టింది రాయ్‌లక్ష్మి . కథానాయికగా తెలుగు చిత్రసీమలో కెరీర్‌ను ప్రారంభించిన ఈ సొగసరి చిరంజీవి, పవన్‌కల్యాణ్ లాంటి అగ్ర కథానాయకులతో ప్రత్యేక గీతాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి. కిషోర్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా రాయ్‌లక్ష్మి పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..

సుదీర్ఘ విరామం తర్వాత ప్రధాన పాత్రలో తెలుగు సినిమా చేయడం ఎలా ఉంది?

-తెలుగు సినిమాలకు నేనెప్పుడూ దూరం కాలేదు. కథానాయికగా సినిమా చేయలేకపోయినా ప్రత్యేక గీతాల ద్వారా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాను.

వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమాను అంగీకరించడానికి ప్రేరణనిచ్చిన అంశాలేవి?

-పూర్తిస్థాయి వినోదభరిత కథాంశమిది. నవ్విస్తూనే ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచుతుంది.నా కెరీర్‌లో హారర్, థ్రిల్లర్‌లతో పాటు విభిన్నమైన కథాంశాలతో చాలా చేశాను. కానీ ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైన్‌మెంట్ కథాంశంతో ఎప్పుడూ సినిమా చేయలేదు. ఆ లోటును ఈసినిమా భర్తీ చేసింది.

ఇందులో మీ పాత్ర ఎలా ఉండనుంది?

-వెంకటలక్ష్మి అనే స్కూల్ టీచర్‌గా ఈ సినిమాలో నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. పల్లెటూరి నుంచి పట్టణానికి వచ్చిన ఆమె కథేమిటి? వెంకటలక్ష్మి కోసం కొందరు యువతీయువకులు ఎందుకు అన్వేషణ సాగిస్తున్నారన్నది అలరిస్తుంది. మై హూ నా సినిమాలో సుస్మితాసేన్‌ను పోలి నా పాత్ర ఉంటుంది. సినిమా మొత్తం చీరకట్టుతో కనిపిస్తాను. గ్లామర్‌తో పాటు అంతర్లీనంగా నా పాత్ర వినోదాన్ని పంచుతుంది.

కథానాయికగా తెలుగు సినిమాతోనే మీ కెరీర్‌ను ప్రారంభించారు. కానీ టాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కారణమేమిటి?

-సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి ఏ ఇండస్ట్రీలోనైనా సహజం. కాంచనమాల కేబుల్‌టీవీ చేసే సమయంలో నా వయస్సు 15 ఏళ్లే. ఆ చిత్రానికి సరైన ఆదరణ దక్కలేదు. సినిమాలు పరాజయం పాలైన పాత్రలకు ప్రశంసలు దక్కాలి. అలాంటి మంచి పాత్రలు మాత్రమే చేయాలని ఎదురుచూశాను. అంతేకానీ తొందరపడి సినిమాను అంగీకరించి తప్పుచేశానని అనుకోకూడదనే తొలి సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్నా. ఆ తర్వాత ఇతర భాషల్లో బిజీగా మారడంతో ఇక్కడ సినిమాలు చేయడం కుదరలేదు. ప్రస్తుతం తెలుగులో హీరోయిన్, ప్రత్యేకగీతం ఏదైనా స్టార్స్, పెద్ద దర్శకులతో పాటు మంచి సంస్థలు, కథలతో కూడినవి మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను.

హీరోయిన్, ప్రత్యేక గీతాలు అంటూ విభజించి చూసే ధోరణిపై మీ అభిప్రాయమేమిటి?

-ఆ విభజన నాకు నచ్చదు. కథానాయిక కంటే ప్రత్యేక గీతాల్లో నర్తిస్తే ఎక్కువ పారితోషికం ఇస్తే చేయడంలో తప్పేంటి (నవ్వుతూ). తొలుత బలుపు సినిమాలో ప్రత్యేక గీతంలో నటించే అవకాశం వచ్చినప్పుడు చేయనని అన్నాను. లక్కీ లక్కీ రాయ్ అంటూ పాటను నా పేరుతోనే రాశానని దర్శకుడు గోపీచంద్ పదే పదే అడగటంతో ఒప్పుకున్నాను. ఆ తర్వాత ప్రత్యేక గీతాల అవకాశాలు చాలా వచ్చాయి. సర్దార్ గబ్బర్‌సింగ్, ఖైదీ నంబర్ 150 చిత్రాలు పవన్‌కల్యాణ్, చిరంజీవి కోసమే చేశాను.

బాలీవుడ్‌లో సినిమాలు చేస్తారా?

-జూలీ-2 తర్వాత హిందీలో కొన్ని అవకాశాలు వచ్చాయి. మూసధోరణితో కథలు కావడంతో వాటిని తిరస్కరించాను. మంచి కథ వస్తే తప్పకుండా హిందీ సినిమా చేస్తాను.

మీటూ ఉద్యమం తర్వాత మహిళల రక్షణ విషయంలో ఇండస్ట్రీ ధోరణిలో ఏమైనా మార్పులు వచ్చాయని అనుకుంటున్నారా?

-మీటూ ఉద్యమాన్ని ప్రస్తుతం అందరూ మర్చిపోయారు. ఈ ఉద్యమం వల్ల ఇండస్ట్రీలో చాలా మార్పులు వస్తాయని అంతా ఆశించారు. కానీ అలాంటివేమీ జరగలేదు. తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి చాలా మంది ధైర్యంగా ముందుకొచ్చి చెప్పారు. ప్రతీకారం ఆలోచనలతో, పబ్లిసిటీ కోసం కొందరు ఈ ఉద్యమాన్ని వాడుకోవడంతో వారు చెప్పిన దాంట్లో ఏది నిజమో, ఏది అబద్దమో ఎవరికీ అర్థంకాలేదు. కొందరి స్వార్థం వల్ల ఈ ఉద్యమం పక్కదారి పట్టింది.

ఈ మధ్య అమెరికన్ పాప్‌స్టార్ ఏకోన్‌ను కలిశారు? కారణమేమిటి?

-మా ఇద్దరి కామన్‌ఫ్రెండ్స్ ద్వారా అతన్ని కలిశాను. ప్రస్తుతం ఏకోన్ నాకో మంచి స్నేహితుడిగా మారిపోయాడు. భారతీయ సంస్కృతులు, సంప్రదాయాలపై ఏకోన్‌కు ఆసక్తి ఎక్కువ.

1589

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles