నా పంథాను మార్చుకోను!


Tue,July 9, 2019 11:59 PM

R Narayana Murthy WoderFull Speech at Market Lo Prajaswamyam Movie

విప్లవాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు ఆర్. నారాయణమూర్తి. దాదాపు మూడున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సిల్వర్ జూబ్లీ చిత్రాల్ని అందించారు. తను నమ్మిన సిద్ధాంతానికి అనుగుణంగా సామాజిక చైతన్యాన్ని కలిగించే ఇతివృత్తాల్ని ఎంచుకుంటూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారాయన. తాజాగా స్వీయ దర్శకత్వంలో ఆర్. నారాయణమూర్తి నటిస్తూ తెరకెక్కించిన చిత్రం మార్కెట్లో ప్రజాస్వామ్యం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఆయన నమస్తే తెలంగాణతో ముచ్చటించారు.

మార్కెట్లో ప్రజాస్వామ్యం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. అలాంటి భారతదేశంలో ప్రస్తుతం నోటు కోసం ఓటుని అమ్ముకుంటున్నారు. నాయకులు అనే వాళ్లు ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సింది పోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. తమ మనుగడ కోసం ఓటర్లకు తాయిలాలు అలవాటు చేస్తున్నారు. అది చాలా తప్పు. ప్రజలు కూడా నేతలు ఇచ్చే తాయిలాలకు అలవాటుపడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.

ఢిల్లీ నుంచి గల్లీ దాకా..

నేటి రాజకీయ వ్యవస్థతో ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఫిరాయింపులు అధికం అయిపోయాయి. ఓ నియోజక వర్గం గురించి తెలియని వ్యాపారస్థుడు ఎక్కడో వ్యాపారం చేసుకుంటూ ఎన్నికల్లో నిలబడుతున్నాడు. ఓటుకు డబ్బులు పంచుతున్నాడు. అవసరమైతే అధిష్టానానికి కూడా టిక్కెట్టు కోసం డబ్బు మూటలు విసురుతున్నారు. కోట్లు పెట్టి సీట్లు కొంటున్నారు. నేటి సమాకాలీన రాజకీయాల్ని ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే పాయింట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాను. నాయకులు పార్టీల మీద తమకున్న కక్షని మాత్రమే చూస్తున్నారు. ప్రజలు ఇచ్చిన హమీల్ని మరిచి జంపింగ్‌లను, అయా రాం గయారామ్‌లను ప్రోత్సహిస్తున్నారు. ఇది తప్పని చెప్పే ప్రయత్నమే మార్కెట్లో ప్రజాస్వామ్యం.

లీడర్ వర్సెస్ క్యాడర్..

లీడర్ వర్సెస్ క్యాడర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఎన్నికల వేళ ప్రజలు అడిగిన డిమాండ్స్‌ని నెరవేర్చడం కోసం నాయకురాలు తనని నమ్ముకున్న క్యాడర్ కోసం బాండ్ పేపర్లపై సంతకాలు చేస్తుంది. దాంతో ఆ నాయకురాలు అనూహ్య మెజారిటీతో విజయం సాధిస్తుంది. అయితే గెలిచిన తరువాత మాట తప్పుతుంది. ఆ దశలో తను నమ్మిన అనుచరుడు అంజిని ముఖ్యమంత్రిని చేస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? అంజి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు అన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం.

నా పంథాని మార్చాలని..

నటుడిగా, దర్శకుడిగా ఎన్నో విజయాలు చూశాను. ఎన్నో సిల్వర్ జూబ్లీ హిట్‌లు సొంతం చేసుకున్నాను. నా సినిమా చూడాలని ఎడ్ల బండ్లపై జనాలు థియేటర్లకు వచ్చిన రోజులున్నాయి. అలాంటి దశను చూసిన నేను గత కొంత కాలంగా ఎదురీదుతున్నాను. నేను మంచి నటుడినని, నా పంథాని మార్చాలని చాలా మంది ప్రయత్నించారు. పూరీ జగన్నాథ్ టెంపర్ చిత్రంలో నాకోసం మంచి వేషం రాశారు. నన్ను నటించమని కోరితే ఆయన ఇచ్చి ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించాను. ఆ తరువాత దిల్‌రాజు శతమానం భవతి చిత్రంలో మంచి వేషం వుంది మీరే నటించాలన్నారు. ఇలా చాలా మంది ఇచ్చిన అవకాశాల్ని తిరస్కరించాను. అలాంటి పాత్రలు చేస్తే నాకున్న గుర్తింపును కోల్పోతాను. ఆ భయంతోనే నాపై అభిమానంతో నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశాల్ని వదులుకున్నాను. అలా అని నేను సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్‌ని అని చెప్పడం లేదు. ఇన్నేళ్ల ప్రయాణంలో నేనో మార్కుని సృష్టించుకున్నాను. చివరి వరకు దాన్నే అనుసరించాలనుకున్నాను.

718

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles