అన్నదాత శ్రేయస్సును కోరుతూ..


Mon,December 11, 2017 10:50 PM

r-narayana-murthy
రైతుల సమస్యలను చర్చిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రమిది. అందరికి అన్నం పెట్టే రైతు సుఖంగా ఉండాలని అన్నదాత సుఖీభవ అని వేద పండితులు దీవించారు. అది నేడు అన్నదాత దుఖీఃభవ అయిపోయింది. రైతులు అనేక కష్టాలు పడుతున్నారు అని అన్నారు ఆర్. నారాయణమూర్తి. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ స్నేహచిత్ర పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం అన్నదాత సుఖీభవ. చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఆర్. నారాయణమూర్తి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ప్రపంచానికి తిండి పెట్టి బతికిస్తున్న రైతులు ఆత్మహత్యలు చేసుకోరాదు. దేవుడు ఇచ్చిన ప్రాణం ఎంతో గొప్పది. విలులైన జీవితాన్ని కోల్పోవద్దు. రైతులు బతకాలి. ప్రపంచాన్ని బతికించాలనే సందేశాత్మక కథాంశంతో రూపొందిస్తున్న చిత్రమిది. సర్వసత్తాక గణతంత్ర రాజ్యమైన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి డ్బ్భై ఏళ్లయినా ప్రతిరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమస్యను అత్యవసర, అత్యయిక పరిస్థితిగా ప్రకటించాలి. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వాటిని ఎలా ఆపాలో పార్లమెంట్ ఉభయ సభలు చర్చించాలని చెప్పే చిత్రమిది. తాను పండించిన పంటకు ధరను నిర్ణయించే హక్కు రైతుకు లేకుండా పోయింది.

దళారులు, వ్యాపారస్తులు, మధ్యవర్తులు, అవినీతి అధికారుల మాయాజాలంలో రైతు కుదేలైపోయి ఎలా అధః పాతాళానికి పోతున్నాడో హృద్యంగా చూపించే చిత్రమిది. తెలంగాణ, ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా రైతులకు ఒకే రకమైన రుణమాఫీ అమలుచేయాలి. పారిశ్రామిక వేత్తలు, లక్షలు కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారికి రుణమాఫీలు చేస్తున్నారు. అదే రైతు కొద్దిపాటి రుణం కట్టకపోతే చాటింపు చేసి అతడి పరువును బజారుకీడుస్తారు. ఆత్మాభిమానం గల రైతులు అప్పుల పాలై చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం వల్లే వారి జీవితాలు చీకటిమయం అవుతున్నాయి. 2007లో స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్స్‌లను అమలు చేసినపుడే రైతుల బతుకులు బాగుపడతాయనే అంశాన్ని అర్థవంతంగా సినిమాలో చూపించాం. తూర్పుగోదావరి, విజయనగరం, ఖమ్మం, వరంగల్, ఢిలీలో సినిమా చిత్రీకరణ జరిపాం. వంగపండు ప్రసాద్‌రావు, సుద్దాల అశోక్‌తేజ, గోరటి వెంకన్న, గద్దర్ ఆణిముత్యాల్లాంటి ఎనిమిది పాటలను అందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం. ఫిబ్రవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. వై.ఎస్. కృష్ణేశ్వరరావు, త్రినాథ్, రాధయ్య, వంగపండు ప్రసాద్‌రావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: మోహన్ రామారావు, కెమెరా: సురేష్, శ్రీనివాస్, నాగేశ్వరరావు, కథ, చిత్రానువాదం, మాటలు, దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి.

768

More News

VIRAL NEWS