ప్రేమ పరిచయం

Thu,February 7, 2019 11:47 PM

రజత్ రాఘవ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ప్రేమ పరిచయం. నేచర్ ఆఫ్ లవ్ అని ఉపశీర్షిక. శివ.ఐ దర్శకుడు. సిద్ధికి శర్మ, కరిష్మాకౌల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రేమ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం. పెరమాండ్లు నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. పూజాకార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రామిక వేత్త సుభాష్‌రెడ్డి క్లాప్‌నివ్వగా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ యువతీ యువకులు తెలిసీ తెలియక తప్పులు చేస్తుంటారు. వాటి ప్రభావం భవిష్యత్తుపై వుంటుందని చెప్పే ప్రయత్నమే మా సినిమా. వినోదం, రొమాన్స్‌తో పాటు అన్ని అంశాలున్న చిత్రమిది. ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ దర్శకుడిగా ఇది నా తొలి సినిమా. ప్రేమ నేపథ్యంలో ఎన్నో చిత్రాలొచ్చాయి. అయితే అసలు ప్రేమ ఎలా మొదలవుతుంది? అనే విషయాన్ని లోతుగా చర్చిస్తూ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చిత్రం ద్వారా సరికొత్త సాంకేతికతను పరిచయం చేస్తున్నాం. సినిమా బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే నేచర్‌ని గ్రాఫిక్స్ ద్వారా కొత్తగా చూపించబోతున్నాం అన్నారు. మామిడి హరికృష్ణ మాట్లాడుతూ దర్శకుడు శివ నాకు చాలా కాలంగా తెలుసు. ప్రేమ నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా చిత్రాలొచ్చాయి. కానీ వాటిలో ఇది భిన్నంగా వుంటుందని భావిస్తున్నాను అన్నారు.

2145

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles