ప్రభాస్‌కు దూరదృష్టి ఎక్కువ


Mon,August 19, 2019 12:09 AM

prabhas gets emotional when ss rajamouli speaks at saaho pre release event

బాహుబలి దేశ వ్యాప్తంగా సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమా తరువాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. సుజిత్ దర్శకుడు. యువీ క్రియేషన్స్ పతాకంపై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ హీరో ఫ్యాన్స్ అయినా వాళ్ల హీరో సినిమా హిట్ కావాలని కోరుకుంటారు. కానీ ప్రభాస్ సినిమాని అందరి హీరోల ఫ్యాన్స్ హిట్ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ప్రభాస్ ఏ రోజు ఏ హీరో గురించి చెడుగా మాట్లాడడు. తన చుట్టూ ఎప్పుడూ పాజిటివ్ వాతావరణం వుంటుంది. ఆ వాతావరణమే అతనికి ఇంత మంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. ప్రభాస్‌కు దూరదృష్టి చాలా ఎక్కువ. బాహుబలి కథ చెప్పినప్పుడే నా తరువాత చిత్రం ఏంటని ఆలోచించడం మొదలుపెట్టాడు. దీని తరువాత ఎలాంటి సినిమా చేయాలని చాలా తపన పడ్డాడు. ఒక రోజు సుజిత్ కథ చెప్పాడు డార్లింగ్ అద్భుతంగా వుంది అన్నాడు. పెద్ద సినిమా తరువాత పెద్ద దర్శకుడితో వెళ్లకుండా కథని నమ్మి ప్రభాస్ సాహో చేయడం ఆనందాన్ని కలిగించింది. బాహుబలి తరువాత ఇలాంటి సినిమా అయితే ప్రేక్షకులకు, అభిమానులకు నచ్చుతుందని నమ్మి ఈ సినిమా చేశాడు. సుజీత్‌ది చాలా చిన్న వయసు. చేయగలడా? అని చాలా మంది అనుమానించారు. ఫస్ట్ లుక్, టీజర్‌తోనే సుజిత్ సత్తా ఏంటో అందరికి అర్థమైంది. ఇంత పెద్ద చిత్రాన్ని, ఇంత మంది టెక్నీషియన్స్‌ని, భారీ బడ్జెట్‌ని, ప్రభాస్ లాంటి ఆల్ ఇండియా స్టార్‌ని హ్యాండిల్ చేయడం మామూలు విషయం కాదు అన్నారు.

Saaho

డైహార్డ్ ఫ్యాన్స్ డైలాగ్ రాసింది సుజితే..

ప్రభాస్ మాట్లాడుతూ ఫ్యాన్స్ డైహార్డ్ ఫ్యాన్స్ డైలాగ్ రాసింది సుజితే. మాస్ పల్స్ ఏంటో అతనికి బాగా తెలుసు. ఈ సినిమాకు గ్రేట్ టెక్నీషియన్స్ పనిచేశారు. టీజర్, ట్రైలర్‌కి కమల్ కన్నన్ ఇంటర్నేషనల్ లుక్‌ని తీసుకొచ్చారు. జిబ్రాన్ మ్యూజిక్‌కి మంచి స్పందన లభించింది. జాకీష్రాఫ్‌తో కలిసి పనిచేయాలనుకున్నాను. ఈ సినిమాకి కుదిరింది. అనిల్ తడానీ ఈ చిత్రానికి చాలా సహకరించారు. సుజీత్ దగ్గర ఓ కథ వుంది మాకు నచ్చింది విను అని వంశీ, ప్రమోద్ చెప్పారు. దాంతో కథ విన్నాను. సినిమా షూటింగ్ కి ఏడాది ముందే యాక్షన్ డైరెక్టర్‌లని కలిశాం. షూటింగ్ మొదలైన తరువాత సుజిత్ తన కంటే పెద్ద వాళ్లని ఎలా హ్యాండిల్ చేస్తాడా అని ప్రమోద్, వంశీ, నేను కంగారుపడ్డాం. కానీ అతనిలో ఏ రోజూ ఆ కంగారు కనిపించకపోవడంతో సుజిత్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అవుతాడనిపించింది. ఇలాంటి చిత్రాన్ని చేయడం మామూలు విషయం కాదు. ఏడాదికి రెండు చిత్రాలు ఇవ్వాలని గతంలో మాటిచ్చాను. కానీ ఆ మాటని నిలబెట్టుకోలేకపోయాను. జాగ్రత్తగా తీస్తే నిర్మాతలకు వంద కోట్ల లాభం వచ్చేది కానీ అలా ఆలోచించకుండా ఖర్చు చేశారు. వంశీ, ప్రమోద్ లాంటి స్నేహితులు అందరికి వుండాలి అన్నారు.

ప్రభాస్ అభిమానులకు హ్యాట్సాఫ్..

దర్శకుడు సుజిత్ మాట్లాడుతూ ప్రభాస్ అభిమానులకు ఓపిక ఎక్కువ. అందుకే టీజర్‌లో డైహార్డ్ ఫ్యాన్స్ అని రాశాను. బాహుబలి, బాహుబలి-2 వంటి అద్భుతమైన చిత్రాల తరువాత వెంటనే తమ అభిమాన హీరో సినిమా రావాలని కోరుకుంటారు. కానీ తరువాత సినిమా కోసం అభిమానులు రెండేళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది. అలా ఎదురుచూసినందుకు ప్రభాస్ అభిమానులకు హ్యాట్సాఫ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మా అందరికి ఒత్తిడి ఎక్కువగా వుండేది కానీ సుజిత్ ముఖంలో మాత్రం ఎప్పుడు ఎలాంటి టెన్షన్ చూడలేదు అని ప్రభాస్ అన్నారు. నా ఒత్తడిని తల్లిదండ్రులతో, స్నేహితులతో పంచుకునేవాడిని. అలా చేయడం వల్లే ఈ చిత్రాన్ని అనుకున్న స్థాయిలో పూర్తి చేయగలిగాను. నా ప్రయాణం ఓ షార్ట్ ఫిల్మ్‌తో మొదలైంది. నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్‌కు సంబంధించిన ఓ డీవీడీ యూవీ వారి దగ్గరికి వెళ్లడం, దాన్ని ప్రభాస్ చూశారట స్క్రీన్‌ప్లే బాగా రాస్తున్నాడు. ఒకసారి వాడిని పిలవండి అన్నారట. మా నాన్నతో కలిసి మిర్చి సినిమా చూస్తుంటే ప్రభాస్‌గారు రమ్మంటున్నారని యూవీ నుంచి ఫోనొచ్చింది. నేనెక్కడ, ప్రభాస్ ఎక్కడ? నన్ను పిలవడం ఏంటి? అనుకుని వెళ్లలేదు. రాజమౌళి సినిమా తరువాత ప్రభాస్‌తో సినిమా అంటే సముద్రానికి ఎదురువెళ్లినట్టే. అయితే ప్రభాస్ ప్రతి విషయంలోనూ నాలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, ప్రమోద్, విక్కీ, శ్రద్ధాకపూర్, దిల్‌రాజు, వి.వి.వినాయక్, శ్యామ్‌ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- రాజమౌళి

906

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles