అది వాళ్ల మైండ్‌సెట్‌పై ఆధారపడి ఉంటుంది

Tue,January 14, 2020 11:17 PM

‘దర్శకుడు త్రివిక్రమ్‌ కథ చెబుతున్నప్పుడే కామెడీని ఎంజాయ్‌ చేశాను. హీరో ఆలోచనాధోరణిలో మార్పు తీసుకొచ్చే యువతిగా నా పాత్ర శక్తివంతంగా ఉండటంతో సినిమాను అంగీకరించాను’ అని చెప్పింది పూజాహెగ్డే. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకుడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో పూజాహెగ్డే పాత్రికేయులతో ముచ్చటించింది.


విజయాల సంఖ్యను నేనెప్పుడూ లెక్కించుకోలేదు. కథ, నా పాత్రలతో పాటు పనిపై మాత్రమే దృష్టిసారిస్తూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నాను. ‘అరవిందసమేత’ తర్వాత నా పాత్రకు నేనే సొంతంగా డబ్బింగ్‌ చెప్పిన సినిమా ఇది. తెలుగు నా మాతృభాష కాకపోవడంతో పదాల్ని అర్థం చేసుకుంటూ స్పష్టంగా పలకడం కష్టమైంది. సొంత డబ్బింగ్‌ నా పాత్రలో పరిణతిని కనబరచడానికి దోహదపడింది. నేను తెలుగు అమ్మాయిగా మారిపోయిన ఫీలింగ్‌ కలుగుతున్నది. బాలీవుడ్‌ ఇండస్ట్రీ నన్ను హైదరాబాద్‌ అమ్మాయిగానే పరిణగనిస్తున్నది.

-కెమిస్ట్రీ బాగుందంటున్నారు..

సినిమాలో స్టార్స్‌ ఉన్నా కథ బాగా లేకపోతే ఆడటం లేదు. కథ, నా పాత్ర తీరుతెన్నులు నచ్చే ఈ సినిమాను అంగీకరించాను. అల్లు అర్జున్‌ బాస్‌గా నా క్యారెక్టర్‌తో ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అవుతున్నారు. బన్నీకి, నాకు మధ్య ఉన్న కంఫర్ట్‌లెవల్‌ కారణంగా సినిమాలో కెమిస్ట్రీ బాగా పండిందని చెబుతున్నారు. పోరాటాలు చేయడం, ఆధిపత్యం చెలాయించడం కాకుండా నిశ్శబ్దం ద్వారానే నా పాత్రలోని పవర్‌ను చాటిచెప్పారు దర్శకుడు త్రివిక్రమ్‌. నా కాళ్లను అల్లు అర్జున్‌ చూసే సన్నివేశాలకు కథానుగుణంగా త్రివిక్రమ్‌ న్యాయం చేశారు. అసభ్యత లేకుండా తెరకెక్కించారు. అలాంటి సన్నివేశాల్ని ఎలా స్వీకరించాలన్నది చూసేవాళ్ల మైండ్‌సెట్‌పై ఆధారపడి ఉంటుంది. కథలో నాకు నచ్చని అంశాలుంటే మౌనంగా ఉండకుండా దర్శకులతో మాట్లాడి వారిని కన్విన్స్‌ చేసి మార్పులు చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ సినిమాలో నా సూచనలకు అనుగుణంగా త్రివిక్రమ్‌ కొన్ని సీన్స్‌లో మార్పు చేశారు. ఈ సినిమాతో బన్నీ పనితీరుకు, నటనకు అభిమానిగా మారిపోయాను. ఆయనతో మళ్లీ పనిచేయాలని ఉంది.

-త్రివిక్రమ్‌ గురువు

త్రివిక్రమ్‌ను నేనో గురువుగా భావిస్తాను. సెట్స్‌లో ప్రశాంతంగా నవ్వుతూ అందరిలో ఎనర్జీని నింపుతుంటారు. నటీనటుల్లోని ఒత్తిళ్లను మరిపిస్తూ వారి నుంచి చక్కటి నటనను రాబట్టుకుంటారు. పెద్ద దర్శకుడిననే అహాన్ని ఎప్పుడూ ప్రదర్శించరు. ఇతరుల అభిప్రాయాల్ని గౌరవిస్తారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. వైవిధ్యమైన పాత్రల్లో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తున్న సినిమాకు సంబంధించి రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. ఈ నెలాఖరున తిరిగి షూటింగ్‌లో పాల్గొనబోతున్నాను. అలాగే అఖిల్‌ సరసన ఓ సినిమాలో నటిస్తున్నారు. హిందీలో ఓ సినిమా చేయబోతున్నాను.

624

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles