బాషా, నరసింహ చిత్రాల స్థాయిలో..


Thu,January 3, 2019 01:42 AM

Peta Movie will present vintage Rajinikanth Vallabhaneni Ashok

కండక్టర్ స్థాయి నుంచి సూపర్‌స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ అంటే నాకు అమితమైన అభిమానం. ఆయనే నాకు స్ఫూర్తి. అలాంటి వ్యక్తి నటించిన చిత్రాన్ని రిలీజ్ చేసే స్థాయికి నేను ఎదగడం ఆనందాన్ని కలిగిస్తోంది అన్నారు అశోక్ వల్లభనేని. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం పేట్ట. ఇదే చిత్రాన్ని తెలుగులో నిర్మాత అశోక్ వల్లభనేని పేట పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత మాట్లాడుతూ ఓ పేట నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో రజనీకాంత్ యువకుడిగానూ, వయసు మళ్లిన వ్యక్తిగానూ రెండు పార్శాల్లో సాగే పాత్రలో కనిపిస్తారు.

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు స్వతహాగా రజనీ అభిమాని కావడంతో ఈ చిత్రంలో రజనీని గత చిత్రాలకు పూర్తి భిన్నంగా సరికొత్త గెటప్‌లో చూపించబోతున్నారు. ఆయనను 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో వుంది. అనిరుధ్ అందించిన సంగీతం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. గతంలో వచ్చిన బాషా, నరసింహ చిత్రాల స్థాయిలో ఆలరించే చిత్రమిది. ఈ నెల 6న ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నాం. దీనికి రజనీకాంత్‌తో పాటు చిత్ర బృందం మొత్తం హాజరవుతారు. ఇదే వేదికపై రజనీ చేతుల మీదుగా కొన్ని అనాథశరణాలయాలకు ఆర్థిక సహాయం అందించబోతున్నాం. యాభై శాతం బిజినెస్ పూర్తయింది. సర్కార్, నవాబ్ చిత్రాల్ని విడుదల చేసిన తీరు నచ్చి సన్ పిక్చర్స్ వారు ఎంత మంది పోటీకి వచ్చినా దాదాపు కోటిన్నర తక్కువకే పేట తెలుగు హక్కులు ఇచ్చారు.

నాపై వారు పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాను. సంక్రాంతి రేసులో పెద్ద చిత్రాలు పోటీపడుతున్నాయి. థియేటర్‌ల కొరత వున్నా తొలుత తక్కువ థియేటర్‌లలో విడుదల చేసి టాక్‌ని బట్టి మరిన్ని పెంచాలనుకుంటున్నాను. ఈ సినిమా తరువాత త్వరలో స్ట్రెయిట్ తెలుగు చిత్రాన్ని నిర్మించబోతున్నాను. ఇప్పటికే కొంత మంది స్టార్స్‌ని కలిశాను. కథకు తగ్గ నటుడు కుదిరితే వెంటనే సినిమా మొదలుపెడతాను. లేదంటే కొత్త వాళ్లతో ప్రయత్నిస్తాను అన్నారు.

2151

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles