కోట్లు సంపాదించాలని నిర్మాతగా మారలేదు


Wed,September 5, 2018 12:26 AM

paperboy movie successful meet in hyderabad

ఓ దర్శకుడు నిర్మాతగా మారి సినిమాలు చేస్తే ప్రొడక్షన్ అవసరమా? అంటూ చాలా మంది రకరకాలుగా మాట్లాడుతారు. నేనూ ఆ మాటలు పడ్డాను. కోట్లు సంపాదించడానికి నిర్మాతగా మారలేదు. నన్ను ఆదరించి దర్శకుడిని చేసిన ఇండస్ట్రీ కోసం నిర్మాతనయ్యాను. మరొకరికి అవకాశం ఇస్తేనే నాకు దర్శకుడిగా సినిమాలు వస్తాయి. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు నిర్మిస్తాను అని అన్నారు సంపత్ నంది. ఆయన కథను అందిస్తూ రాములు, వెంకట్, నరసింహాలతో కలిసి నిర్మించిన చిత్రం పేపర్‌బాయ్. జయశంకర్ దర్శకుడు. సంతోష్‌శోభన్, రియాసుమన్ జంటగా నటించారు. ఈ చిత్ర విజయోత్సవ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ ప్రపంచ పేపర్‌బాయ్ దినోత్సవం సందర్భంగా చిత్ర విజయోత్సవ వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉంది. స్టార్‌హీరో, దర్శకులు లేని చిన్న సినిమా ఇది.

భారీ ఓపెనింగ్స్, ప్రశంసలు రావాలనే కోరికలేవి లేకుండా నిజాయితీగా మంచి సినిమా చేశాం. ఆదివారం నాటికి మరో ఏడు థియేటర్లు పెరిగాయి. సంతోష్ అభినయానికి మంచి పేరు వస్తున్నది. చిన్న సినిమా అందరికి చేరువ కావడం ఆనందంగా ఉంది అని తెలిపారు. బిత్తిరిసత్తి మాట్లాడుతూ కథను నమ్మి సినిమా చేస్తే ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. పరిపూర్ణ నటుడిగా నన్ను ఆవిష్కరించిన సినిమా ఇది అన్నారు. సంపత్‌నంది మనసు పెట్టి చేసిన సినిమా ఇదని సంతోష్‌శోభన్ చెప్పారు. తనతో పాటు చాలా మంది కొత్త వాళ్లను పరిచయం చేస్తూ సంపత్‌నంది ఈ సినిమా చేశారని దర్శకుడు జయశంకర్ అన్నారు. అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ కథే హీరోగా తెరకెక్కిన సినిమా ఇది. కథ, సంభాషణలు, నటీనటులు అభినయం ప్రేక్షక హృదయాల్ని హత్తుకుంటున్నాయి అని చెప్పింది. ఈ కార్యక్రమంలో భీమ్స్ సిసిరోలియో, రియాసుమన్, తమ్మిరాజు తదితరులు పాల్గొన్నారు.

3295

More News

VIRAL NEWS