విశాల్‌తో పందెంకోడి-3 తీస్తా


Tue,October 16, 2018 02:03 AM

Pandem Kodi 2 Movie Pre Release Event

సాధారణ నటుడినైనా నన్ను యాక్షన్ హీరోగా అత్యున్నత స్థానంలో పందెంకోడి నిలబెట్టింది. దేవుడి ఆశీర్వాదబలం వల్లే పదమూడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ చేయగలిగాను. ఈ సీక్వెల్‌లో నాతో పాటు ప్రతి పాత్రకు సమప్రాధాన్యత ఉంటుంది అని అన్నారు విశాల్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పందెంకోడి-2. ఎన్.లింగుస్వామి దర్శకుడు. ఠాగూర్‌మధు సమర్పణలో విశాల్, జయంతిలాల్ గడా, అక్షయ్‌జయంతిలాల్‌గడా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీర్తిసురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్ కథానాయికలు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ నెల 18న విడుదలకానుంది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ప్రచార చిత్రాన్ని నటి మంచు లక్ష్మి విడుదల చేశారు. ఆడియో సీడీలను దర్శకుడు క్రిష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ నాన్న, అన్నయ్యల సహకారం వల్లే నటుడిగా ఈ స్థాయికి చేరుకున్నాను. పందెంకోడి-2 నా ఇరవై ఐదవ చిత్రం.

పాతిక సినిమాలు చేస్తానని అనుకోలేదు. లింగుస్వామిని నమ్మి నటించాను. రైతులకు సహాయం చేస్తానని గతంలో ఇచ్చిన హామీని ఈ రోజు నెరవేర్చడం ఆనందంగా ఉంది అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ రాయలసీమ నేపథ్యంలో సాగే చిత్రమిది. యాక్షన్, నాటకీయత, సస్పెన్స్ అంశాల మేళవింపుతో ఆద్యంతం థ్రిల్‌ను కలిగిస్తుంది. ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో వరలక్ష్మి నటన ఆకట్టుకుంటుంది. మహానటి సినిమా చూసి కీర్తిసురేష్ నటనకు అభిమానినయ్యాను. తొలిభాగంలో నటించిన మీరాజాస్మిన్ కంటే అద్భుతంగా కీర్తి తన పాత్రకు న్యాయం చేసింది. విశాల్‌తో పందెంకోడి-3 తప్పకుండా తీస్తాను అని అన్నారు. విశాల్ అంటే నాకు చాలా ఇష్టం. అభిమానులంతా అతడిని విప్లవసేనా నాయకుడు అని పిలుచుకుంటారు.

అలా పిలిపించుకునే అర్హత అతడికి ఉంది. తొలి భాగాని కంటే రెండింతలు పెద్ద విజయాన్ని సాధించాలి అని దర్శకుడు క్రిష్ అన్నారు. భవాని అనే రాయలసీమ యువతిగా తన పాత్ర శక్తివంతంగా సాగుతుందని వరలక్ష్మిశరత్‌కుమార్ చెప్పింది. ఈ సినిమాతో విశాల్ రూపంలో తనకో మంచి స్నేహితుడు లభించాడని కీర్తిసురేష్ పేర్కొంది. ఈ కార్యక్రమంలో ఠాగూర్ మధు, లగడపాటి శ్రీధర్, బి.వి. ఎస్.ఎన్ ప్రసాద్, ఆకులశివ తదితరులు పాల్గొన్నారు.

2857

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles