సిగ్గుని పొగరనుకుంటున్నారు!


Tue,July 9, 2019 11:58 PM

Oh Baby Movie Hero Naga Shaurya Interview

సినిమా ఎంతఆలస్యంగా విడుదలైనా ఫర్లేదు కానీ ఫలితం మాత్రం బాగుండాలి అని అన్నారు నాగశౌర్య. ఛలో సినిమాతో కెరీర్‌లో పెద్ద విజయాన్ని అందుకున్న ఆయన కథ, పాత్రల ఎంపికలో ప్రస్తుతం కొత్తదనానికి ప్రాముఖ్యతనిస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ చిత్రంలో అతిథి పాత్రలో నటించారు నాగశౌర్య. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో సినిమా విశేషాలతో పాటు తన కెరీర్ గురించి నాగశౌర్య పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..

ఓ బేబీ సినిమాను అంగీకరించడానికి కారణం ఏమిటి?

-కథ విన్నప్పుడు నా పాత్ర నిడివి తక్కువగా ఉందనిపించింది. కానీ చిత్రీకరణ మొదలైన తర్వాత పెద్ద రోల్ అయింది. నందినిరెడ్డిపై ఉన్న నమ్మకంతో అతిథి పాత్ర అయినా సినిమాను అంగీకరించాను. మురారి సినిమాలో నటి లక్ష్మి అభినయం నన్ను ఆకట్టుకుంది. ఆమెతో కలిసి నటించవొచ్చనే అనిపించి సినిమా చేశాను. కానీ లక్ష్మితో నా కాంబినేషన్‌లో ఒక్క సీన్ ఉండదు.

రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి మీరు ఇబ్బంది పడ్డారని సమంత ప్రచార వేడుకల్లో అన్నారు?

-నాకు సిగ్గెక్కువ. దానిని అందరూ పొగరని అనుకుంటారు. నేను నటించే సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉండకుండా జాగ్రత్తపడతాను. కథకు అవసరముంటేనే అలాంటి సీన్స్‌లో నటిస్తాను.

సినిమా విజయాన్ని సాధిస్తుందని ముందే ఊహించారా?

-అన్ని తరాలకు కనెక్ట్ అయ్యే కథ ఇది. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో వాస్తవికతను ప్రతిబింబించే సన్నివేశాలు నేటి సినిమాల్లో అరుదుగా కనిపిస్తుంటాయి. ఈ సినిమాలో అలాంటి హృద్యమైన సీన్స్ చాలా ఉన్నాయి. సినిమా విజయం మీద నా నమ్మకం నిజమవ్వడం ఆనందంగా ఉంది. నా కంటే ఎక్కువగా సమంత ఈ సినిమాను ప్రేమించారు.

అతిథి పాత్ర చేయడం వల కెరీర్‌కు ఇబ్బందులు ఎదురవుతాయని అనుకున్నారా?

-అలాంటి భయాలేవి నాకు లేవు. హిట్ సినిమాలో నేనూ ఓ భాగమవ్వాలని అంగీకరించాను. భవిష్యత్తులో నాకు నచ్చిన నటుల సినిమాల్లో అతిథి పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

ఈ సినిమాకు మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్?

-అతిథి పాత్రను నేను అంగీకరిస్తానో లేదో అనే ఆలోచనతో కథ చెప్పడానికి దర్శకురాలు నందినిరెడ్డి సంశయించారు. మా అమ్మకు ఈ కథ చాలా నచ్చింది. ఇలాంటి మంచి పాత్రల్లో నేను నటిస్తే బాగుంటుందని అమ్మ బలవంతపెట్టడంతో ఎమోషన్స్‌ను పక్కనపెట్టి సినిమాలో నటించాను. అమ్మకు ఈ సినిమా చాలా నచ్చింది. ఇందులో నా లుక్ బాగుందని ప్రశంసించింది.

సమంతతో తొలిసారి పనిచేయడం ఎలా ఉంది?

-పెద్ద హీరోయిన్‌తో పనిచేస్తున్నాననే ఫీలింగ్ ఏ రోజు కలగలేదు. సినిమాలోని ఓ సన్నివేశంలో పొరపాటున విస్కీని సమంతపై ఉమ్మివేసే సందర్భం ఉంటుంది. అందులో నటించడానికి భయపడ్డాను. సమంతపై కాకుండా పక్కన ఉమ్మివేశాను. నటనలో ఇలాంటివన్నీ సహజమేనని సమంత చెప్పారు. తొలి టేక్ నేను సరిగా చేయకపోతే సమంతనే రెండో టేక్ అడిగి మరి ఆ సన్నివేశాన్ని పూర్తిచేసింది.

ప్రస్తుతం నటిస్తున్న సినిమా విశేషాలేమిటి?

-సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌లో అశ్వత్థామ అనే సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుగుతున్నది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి సినిమాలో నటిస్తున్నాను. రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఇందులో 7 భిన్న పాత్రల్లో కనిపిస్తాను. అలాగే దర్శకుడు సంతోష్ జాగర్లపూడితో పార్థు అనే సినిమా చేయబోతున్నాను. త్వరలో చిత్రీకరణ ప్రారంభం కానుంది.

అశ్వత్థామ చిత్రీకరణలో గాయపడ్డారు కదా. ఆ ప్రమాదం ఎలా జరిగింది. డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్ చేయాలని ఎందుకనిపించింది.

-ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలు చూసే తీరు మారిపోయింది. యాక్షన్ సన్నివేశాల్లో హీరోలే నటిస్తున్నారా? డూప్‌తో తెరకెక్కిస్తున్నారా అన్నది సులభంగా గ్రహిస్తున్నారు. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి రిస్క్ తీసుకొని నటించాను. కానీ అనుకోకుండా గాయమైంది.

919

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles