కాలం పెట్టిన పరీక్షని అధిగమిస్తాం!

Thu,February 21, 2019 11:29 PM

తొలి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం కోసం చాలా శ్రమించాం. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాం. ఈ సినిమా చూసి చాలా మంది ప్రశంసలు కురింపించారు. ఆయితే ఆ స్థాయిలో సినిమా వసూళ్లను రాబట్టలేకపోవడం కొంత నిరాశకు గురిచేసింది అన్నారు క్రిష్. ఆయన దర్శకత్వంలో వస్తున్న ఎన్టీఆర్ రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు. బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో క్రిష్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.

ఆ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ..

తొలి భాగం ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ మహానాయకుడు స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. రీ షూట్‌లకూ ప్రయత్నించలేదు. తొలి భాగం విడుదలయ్యే నాటికే ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. మూడు పాటలు, నాలుగు రోజుల ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి వుంది. అలాంటి సమయంలో మార్పులు చేర్పులకు ఆస్కారం వుండదు. తొలి భాగం ఎన్టీఆర్ సినీ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి ఎక్కువ గెటప్‌లు తీసుకున్నాం. అది కొంత మందిని ఆకట్టుకోలేదు అయితే రెండవ భాగంలో మాత్రం తొలి భాగంలో మిస్సయిన భావోద్వేగాలు, రాజకీయ ఎత్తులు, కుట్రలు వంటి ఆసక్తికర అంశాల నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాకి ముందు నేను అనుకున్న పేరు ఎన్టీఆర్ కాదు. బసవతారం వైపు నుంచి కథను నడిపించాలనుకున్నాను కాబట్టి తారకరాముడు ఐతేనే బాగుంటుంది అనుకున్నాను.

ఆ సమయంలో జరిగిందే..

నాదేండ్ల భాస్కర్‌రావుని విలన్‌గా చూపించలేదు. రామారావుగారిని పదవి నుంచి తప్పించిన సమయంలో చాలా పెద్ద కుట్ర జరిగింది. ఆ సంఘటనలోతుల్లోకి వెళ్లకుండా పైపైన మాత్రమే టచ్ చేస్తూ రామారావుగారి రాజకీయ జీవితంలో జరిగిన వాస్తవిక సంఘటనల్ని చూపిచే ప్రయత్నం చేశాం. అంతే కానీ కావాలని ఎవరిని విలన్‌గా చిత్రించే పనిచేయలేదు. 1984లో జరిగిన ఎన్నికల సమయంలో తిరుపతిలో ఒక రోజు వ్యత్యాసంతో రెండు సభలు జరిగాయి. ఒక సభలో రామారావుగారు పాల్గొంటే మరో సభలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పాల్గొన్నారు.

ఆ సభకు వస్తున్న సందర్భంలో కృష్ణుడి రూపంలో వున్న రామారావు కటౌట్‌కు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అప్రయత్నంగా నమస్కరించారట. దాన్నే ఇటీవల విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌లో చూపించాం. అంతే కానీ చరిత్రకు దూరంగా ఎలాంటి సన్నివేశాల్ని సృష్టించలేదు. తొలి భాగంతో పోలిస్తే మలి భాగం కాలం పెట్టిన పరీక్షని అధిగమిస్తుందని నమ్ముతున్నాను. ఎన్టీఆర్‌ని ఇష్టపడే ప్రతీ ఒక్కరిని సంతృప్తి పరిచి తొలి భాగం వల్ల వచ్చిన నష్టాలని అధిగమిస్తుందనే విశ్వాసంతో వున్నాం.

1459

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles