ఎన్టీఆర్ సజీవుడై తిరిగొస్తే..

Fri,January 18, 2019 11:36 PM

రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. దివంగత ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాత చోటుచేసుకున్న ముఖ్యమైన పరిణామాలు, ఎన్టీఆర్ పదవీచ్యుతుడు కావడానికి దారితీసిన పరిస్థితుల్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లక్ష్మీపార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞ శెట్టి నటిస్తున్నది. ఆనాటి ఎన్టీఆర్ సన్నిహితులు, ఆయన ప్రభుత్వంలో పనిచేసిన కొంతమంది అధికారులు, ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తుల ద్వారా సేకరించిన విస్త్రత సమాచారంతో రామ్‌గోపాల్‌వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సినిమాలోని ఎన్టీఆర్ పాత్రధారి ఫస్ట్‌లుక్ టీజర్‌ను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. వెన్నుపోటు ద్వారా చంపబడ్డ ఎన్టీఆర్ తిరిగి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా మీముందుకు సజీవంగా రాబోతున్నాడు అంటూ వర్మ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. ఫస్ట్‌లుక్ టీజర్‌లో కనులు మూసుకొని దీర్ఘాలోచనలో ఉన్న ఎన్టీఆర్ మెల్లగా తలపైకెత్తి విషణ్ణ వదనంతో తదేకంగా చూస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు రామ్‌గోపాల్‌వర్మ సన్నాహాలు చేస్తున్నారు.

3501

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles