ఎవరైనా సరే నన్ను ఫాలో కావాల్సిందే!


Sat,January 5, 2019 11:38 PM

Nandamuri Balakrishna NTR Kathanayakudu Movie Team Special Interview

తెలుగు సినీ, రాజకీయ యవనికపై శిఖరసమానుడిగా కీర్తింపబడ్డారు దివంగత ఎన్టీఆర్. తొలి తెలుగు సూపర్‌స్టార్‌గా అశేష అభిమానుల నీరాజనాలందుకున్నారు. ఆయన జీవిత చరిత్రను వెండితెర దృశ్యమానం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ఎన్టీఆర్. ఆయన తనయుడు బాలకృష్ణ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కథానాయకుడు, మహానాయకుడు అనే రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఎన్టీఆర్ కథానాయకుడు ఈ నెల9 న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా సంభాషించారు.బసవతారకం పాత్ర కోసం విద్యాబాలన్ ఎంతో పరిశోధన చేసింది. మా కుటుంబ సభ్యులందరిని కలిసి అమ్మగారి గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంది. అందుకే బసవతారకం పాత్రలో అద్భుతంగా రాణించిందామె.

ఎన్టీఆర్ బయోపిక్‌కు అంకురార్పణ ఎలా జరిగింది?

-ప్రాచీన ఆంధ్ర చరిత్ర సృష్టికర్త గౌతమి పుత్ర శాతకర్ణి అయితే, ఆధునిక ఆంధ్ర చరిత్ర సృష్టికర్త నందమూరి తారకరామారావుగారు. నాన్నగారు పోషించిన పౌరాణిక పాత్రలు కొన్నింటిని నేనూ చేయాలనే కోరిక బలంగా ఉండేది. కానీ ఆయన జీవిత చరిత్ర చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఓసారి నాన్నగారి స్వస్థలం నిమ్మకూరు వెళ్లినప్పుడు ఆ ఆలోచన కలిగింది. ఆ ఊరు స్థలమహిమో, లేదా అమ్మానాన్నల దీవెనల బలమో కాకతాళీయంగా ఈ బయోపిక్‌కు శ్రీకారం చుట్టడం జరిగింది.

తండ్రి జీవిత కథా చిత్రంలో ఆయన తనయుడు కథానాయకుడిగా నటించడం భారతదేశ చరిత్రలోనే ప్రపథమం. ఈ అరుదైన ఘనత సాధించడం ఎలా అనిపిస్తున్నది?

-గౌతమి పుత్ర శాతకర్ణి కథ ఆధారంగా సినిమా చేయాలని నాన్నగారు ఒకప్పుడు అనుకున్నారు. ఎందుకో గానీ అది కార్యరూపం దాల్చలేదు. ఆ సినిమా చేసే అదృష్టం నాకు దక్కింది. ఒకే ధోరణిలో సాగే మూస సినిమాలు కాకుండా ట్రెండ్ సెట్ చేసే సినిమాలు చేయాలన్నది నా ఆశయం. తెలుగులో ఫ్యాక్షన్ సినిమాల ఒరవడి నాతోనే మొదలైంది. ఇప్పుడు ఎన్టీఆర్ వంటి మహానీయుడి బయోపిక్ చేయడం ఆనందంగా ఉంది. ఎన్టీఆర్‌గారిది విస్త్రృతమైన జీవితం. ఆయన కేవలం ఒకే పార్శానికి పరిమితమైపోలేదు. సినిమా, రాజకీయం, ప్రజాసేవ...ఇలా బహుముఖరంగాల్లో ఆయన ప్రభావశీలిగా ఉన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి జీవితకథలో నటించడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నాను.

ఈ సినిమాలో మీరు ఎన్టీఆర్ పోషించిన కొన్ని పాత్రల్లో కనిపించబోతున్నారని తెలిసింది. వాటికోసం ఎలాంటి కసరత్తులు చేశారు?

-ఎన్టీఆర్‌గారు నాకు కేవలం తండ్రి మాత్రమే కాదు.. గురువు, దైవం అన్నీ ఆయనే. అందుకే ఈ సినిమాకు ఏదీ కష్టమనిపించలేదు. చిన్నప్పటి నుంచి నాన్నగారి సినిమాలు చూస్తూ పెరిగాను కాబట్టి ఆయన పాత్రలు చేయడం ఏమాత్రం ఇబ్బందిగా అనిపించలేదు. ప్రతి పాత్రను మనసారా ఆస్వాదించాను. ఈ సినిమాలో ప్రతి పాత్రకు నటులందరూ దేవుడు తెచ్చి పెట్టిన చందంగా అద్భుతంగా కుదిరారు. విద్యాబాలన్, రానా, సుమంత్, కల్యాణ్‌రామ్, రకుల్‌ప్రీత్‌సింగ్, ప్రణీత ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. సహజత్వం కోసం సురభి నాటక కళాపరిషత్తు నుంచి కొందరిని తీసుకొని నటింపజేశాం.

ఆరంభంలోనే రెండు భాగాలుగా ఈ సినిమా చేద్దామనుకున్నారా?

-తొలుత రెండో భాగం ఆలోచనే లేదు. ఒక పార్ట్‌లో నాన్నగారి జీవితచరిత్రకు న్యాయం చేయలేం బాబు..రెండో పార్ట్ చేద్దాం అని క్రిష్ అడిగారు. కథానాయకుడు, మహానాయకుడు అనే టైటిల్స్‌ను కూడా ఆయనే సూచించారు. దైవబలం, సంకల్పసిద్ధి వల్ల సినిమాను రెండు భాగాలుగా తీయడం సాధ్యమైంది. మరో విషయమేమిటంటే వ్యాపార ప్రయోజనాలను ఆశించి ఈ సినిమా తీయలేదు. ఫలానా రేంజ్‌లో తీయాలనే లెక్కలు కూడా వేసుకోలేదు.

ఈ సినిమాతో నిర్మాతగా మారడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

-ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. బ్రహ్మతేజ ప్రొడక్షన్స్ అనే సంస్థ పేరును రిజిష్టర్ చేయించి ఎప్పుడో సినిమా చేద్దామనుకున్నాను. చిత్ర నిర్మాణానికి కావాల్సిన అన్ని హంగులుండి సినిమా తీయలేకపోయాను. ఇప్పుడు విధి లిఖితంలా నాన్నగారి బయోపిక్‌తో నిర్మాతగా మారాను. నాన్నగారి బయోపిక్ చేస్తానని లైఫ్‌లో ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమా స్టిల్స్, ట్రైలర్స్ చూసిన వారు నేను అచ్చు రామారావులాగానే వున్నాడంటున్నారు. నాన్నగారి తర్వాత ఆదిత్య 369 వంటి ఫాంటసీ సినిమాల్ని నేనే చేశాను. పౌరాణిక, చారిత్రక ఇతివృత్తాల్ని ఎంచుకొని చక్కటి సినిమాలు చేయాలన్నది నా అభిమతం. ఆ తరహా సినిమాలు చేయాలనే లక్ష్యంతో నిర్మాతగా ప్రయాణం ఆరంభించాను. తెలుగు చిత్రసీమలో ట్రెండ్‌సెట్టర్స్ మేమే. ట్రెండ్ విషయంలో ఎవరైనా సరే నన్ను ఫాలో కావాల్సిందే.

వ్యక్తిగతంగా జీవితాన్ని మీరు ఎలా ఆస్వాదిస్తారు?

-నా జీవితమంతా ఓపెన్‌బుక్. నాకు తోచినట్లుగా జీవితాన్ని గడుపుతాను. కొందరు నన్ను ముక్కోపి అంటారు. అలాంటి మాటల్ని అస్సలు లెక్కచేయను. హీరోలు బయట విగ్ తీయడానికి సంశయిస్తారు. కానీ నేను అలాంటి వాటిని పట్టించుకోను. ఎన్నో సందర్భాల్లో విగ్ తీసి కనిపించాను. దానివల్ల ఏమైనా నష్టం జరిగిందా? నా సినిమాలు ఏమైనా ఫ్లాప్ అయ్యాయా? షూటింగ్ లొకేషన్లలో విగ్ తీసినప్పుడు కొందరు జనాలు నవ్వేవారు. అలాంటి విషయాల్ని తేలిగ్గా తీసుకుంటాను. ఇక క్రమశిక్షణ, సమయపాలన అనే అంశాల్ని నాన్నగారి దగ్గరి నుంచి నేర్చుకున్నాను. ఆయనలాగే నేను ఉదయం నాలుగుగంటల లోపే నిద్రలేస్తాను. ఏ పనినైనా చెప్పిన టైమ్‌లో పూర్తి చేయాలని తపిస్తాను.

ఫలితం ఎప్పుడైనా వస్తుంది కానీ మనం ప్రయత్నం మొదలుపెట్టాలి. తెలుగు సినిమా బొమ్మ అంతర్జాతీయ యవనికపై మెరవాలన్నది నాన్నగారి ఆశయం. అదే సంకల్పంతో ఈ సినిమా కోసం శ్రమించాను.
Balakrishna1.jpg

ఇండస్ట్రీకి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్లలాంటివారు. ఈ సినిమాలో ఏఎన్నార్‌గారి పాత్ర చిత్రణ ఎంతవరకు ఉంటుంది?

-ఏఎన్నార్‌ను మేమంతా బాబాయ్ అనే సంబోధించేవాళ్లం. ఏఎన్నార్‌గారి తల్లిగారు అక్కినేని పున్నమ్మను మరో నానమ్మగా భావించేవాళ్లం. పున్నమ్మగారు మా నాన్నను తన పెద్దకొడుకు అని పిలుచుకునేది. అక్కినేని కుటుంబాన్ని నాన్నగారు సొంత ఇంటి మనుషులే అనుకునేవారు. అంతటి గొప్ప బాంధవ్యం మాది. ఈ సినిమాలో ఏఎన్నార్ పాత్రను సుమంత్ అద్భుతంగా పోషించాడు.

3729

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles