సినిమావాళ్లందరూ రాజకీయాల్లో రాణించలేరు!


Wed,January 10, 2018 11:27 AM

Nandamuri Balakrishna Interview About Jai Simha Movie

సినిమా అనేది బహుళ ప్రచార సాధనం, సకల కళలకు నిలయం. సామాన్యుడికి ఆనందాన్ని పంచే మలయ పవనం. ఆలోచనను రేకెత్తించే, మన సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే నందనవనం సినిమా అన్నారు బాలకృష్ణ. ఆయన అభినయకౌశలం గురించి ఎంత చెప్పినా చర్వితచర్వణమే అవుతుంది. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో పాత్రలకు తనదైన విలక్షణ అభినయంతో ప్రాణప్రతిష్ట చేశారాయన. బాక్సాఫీస్ బొనాంజగా అభిమానుల నీరాజనాలందుకున్నారు. గత ఏడాది గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంతో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన తాజాగా జై సింహాగా ప్రేక్షకులముందుకొస్తున్నారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో బాలకృష్ణ నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా సంభాషించారు. తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
Balakrishna

జైసింహా ఎలా ఉండబోతున్నది. ఫలితం గురించి మీ అంచనాలు ఎలా ఉన్నాయి?

-పుట్టిన బిడ్డను ప్రేమించినట్లుగానే చేస్తున్న సినిమాపై ప్రతి ఒక్కరికి ఇష్టమే ఉంటుంది. పైసా వసూల్ తర్వాత నేను చేసిన సినిమా ఇది. నటీనటుల పనితీరు, సాంకేతిక నిపుణుల ప్రతిభకు సమిష్టి కృషి తోడవ్వడంతో బ్రహ్మాండంగా వచ్చింది. ఈ సినిమాలో కొత్త బాలకృష్ణను చూస్తారు.

కథాపరంగా ఈ సినిమాకున్న ప్రత్యేకత ఏమిటి?

-రత్నం చెప్పిన కథ నన్ను బాగా ఆకట్టుకుంది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేయాలని కల్యాణ్, నేను అనుకున్నాం. కేవలం కుటుంబ కథలతోనే కాకుండా మాస్ కథాంశాలతో అద్భుతమైన సినిమాలు చేశారు రవికుమార్. రజనీకాంత్‌తో ముత్తు, నరసింహా, కమల్‌హాసన్‌తో దశావతారం, మన్మథబాణం లాంటి చక్కటి సినిమాలు చేశారు. ఈ సినిమా ద్వారా రవికుమార్‌తో పని చేయాలనే నా ఎనిమిదేళ్ల కల నెరవేరింది.

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో సినిమాలు చేయడం మీకెలా సాధ్యమయింది?

-ఒక హీరోతో చేసిన సినిమా హిట్టయితే వరుసగా అతడితో దర్శకులు పది సినిమాలు చేస్తుంటారు. అదే దర్శకులు చేస్తున్న తప్పు. దర్శకులందరితో ఇదే విషయాన్ని చెబుతుంటాను. పదిరకాల సినిమాలు చేసినప్పుడే పరిణితి వస్తుంది. నటుడిగా శ్రీరామరాజ్యం, గౌతమిపుత్రశాతకర్ణి, పైసా వసూల్ అంతకుముందు సమరసింహారెడ్డి, నరసింహానాయుడు.. ఇలా ప్రతి సినిమా విభిన్నంగా ఉంటుంది. కొన్ని సార్లు దర్శకులు ఒక్కరే అయినా భిన్న నేపథ్యాలతో వైవిధ్యంగా సినిమాలు చేశాను. దర్శకులే వైవిధ్యత కోసం ప్రయత్నాలు చేయాలి. లేదంటే నటులే ముందుకు రావాలి. కొత్త నటీనటులతో సినిమాలు చేస్తున్నప్పుడు దర్శకులు పరిధులు దాటి ఆలోచిస్తుంటారు. అప్పుడే అద్భుతాలు సృష్టించవచ్చు. మనల్ని ప్రజలు మర్చిపోకుండా మంచి సినిమాలు చేయాలి. నటుడిగా అది మన ధర్మం. సినిమా అనేది బహుళ ప్రచార సాధనం, సకల కళలకు నిలయం. సామాన్యుడికి ఆనందాన్ని పంచే మలయ పవనం. ఆలోచనను రేకెత్తించే, మన సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించే నందనవనం సినిమా. కళామతల్లి ఇచ్చిన అవకాశానికి బావిలో కప్పలా పరిమితులు విధించుకోకూడదు. అనుమానాలతో ఏదో చేయాలనే ఆలోచనలతో సినిమాలు చేయకూడదు. నమ్మకంతో ప్రయత్నాలు చేయాలి.

వంద సినిమాలు చేసిన తర్వాత కొత్త కథలు, పాత్రలు కోసం తపిస్తుంటారని చెబుతుంటారు. మూసధోరణిలో కథలు వస్తే తిరస్కరించిన సందర్భాలు ఉన్నాయా?

-అలాంటివి ఉన్నాయి. కొందరు దర్శకులు భారమంతా మాపై వదిలేయండి అని చెబుతుంటారు. కొందరిని పూర్తిగా నమ్ముతాను. మరికొందరికి అవసరం మేరకు సలహాలు ఇస్తుంటాను.

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలకు ప్రాధాన్యతనిచ్చే అతి కొద్దిమంది హీరోల్లో మీరు ఒకరు. వారి అభిరుచుల్ని గౌరవిస్తూ మీరు ఇప్పటికి సినిమాలు చేస్తుంటారు?

-నిర్మాతలు పదికాలాల పాటు వర్థిల్లాలి.. సినిమాలు తీయాలన్నదే నా సిద్ధాంతం. ప్రస్తుతం కొందమంది నిర్మాతలు ఇండస్ట్రీలో మేము తప్ప వేరెవరు లేరనే ధోరణిలో వున్నారు. అది సమంజసం కాదు. అలాంటి వారిని దగ్గరకు రానివ్వను. ఓసారి ఒక పెద్ద బడ్జెట్ సినిమా మా సొంత సంస్థలో నిర్మించిన చిత్రానికి పోటీగా వచ్చింది. మాదేమో మామూలు సినిమా. అవతల వైపేమో భారీ బడ్జెట్ చిత్రం. దాంతో మా చిత్రాన్ని రిలీజ్ చేయాలా? వద్దా? అని ఆలోచించాము. చివరకు ఆ సినిమా విడుదలై రెండు ఆటలు కూడా ఆడలేదు. మా సినిమా సిల్వర్‌జూబ్లీ ఆడింది. ఆ చిత్ర నిర్మాత నాతో మీకెంతో ధైర్యం వుంది. మాతో పోటీగా వచ్చారు అని అన్నారు. తన సినిమా ఫెయిల్ ఎందుకయిందో చెప్పమని అడిగారు. కథాబలానికి అనుగుణంగా తారాగణం కుదరలేదు కాబట్టి సినిమా పరాజయం పాలైందని చెప్పాను. ఇప్పటి హీరోలు ఈరోజు కోసమే బ్రతుకుతున్నారు. దీర్ఘకాలికంగా ఆలోచించడం లేదు. పాశ్చాత్య ప్రభావం ఎక్కువగా వుంటున్నది. రేపు వుంటాయో లేదో అనే స్థాయిలో బ్రతుకుతున్నారు.

సినిమా పరిశ్రమలో మీలా ముక్కుసూటి తత్వం కొందమందికే వుంటుంది కదా? రాజకీయాల్లో కూడా మీరు అలాగే వుంటారంటారు?

-రాజకీయాల్లో ముక్కుసూటితనం మాకే చెల్లుతుంది. నా దృష్టిలో సినిమా నటులందరూ రాజకీయాల్లో రాణించలేరు. ఎంతోమంది రాజకీయాల్లోకి వస్తే ఎలా వుంటుందోనని నాతో అనేవారు. నేను వద్దని వారించేవాణ్ణి. అందరూ నాన్నగారిలా రాజకీయాల్లో విజయం సాధించలేరు. ఇక ముక్కుసూటితనమనేది సమాజంలో ప్రయోజనకరంగా వుంటుంది. వ్యక్తిత్వాన్ని మరింత ఇనుమడింపచేస్తుంది. కొన్ని సమస్యల్ని నేను కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన సందర్భాల్లో నా వ్యవహారశైలి చూసిన అక్కడివారు మీరు కూడా మీ నాన్నగారిలా చండశాసనుడే అని చమత్కరించారు. ఏదైనా అనుకుంటే అయిపోవాలంతే. ప్రజలకు మేలు చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాం. అధికారం కోసం కాదు. ప్రజాసేవే మా లక్ష్యం.

మోక్షజ్ఞను హీరోగా ఎప్పుడు పరిచయం చేయబోతున్నారు?

-మోక్షజ్ఞ సినీరంగ ప్రవేశం ఈ ఏడాదే వుంటుంది. ఆగస్టు లేదా సెప్టెంబర్ తరువాత సినిమా వుంటుందనుకుంటున్నాను.
Balakrishna1

ఖాళీ సమయాల్లో మీ మనవడు దేవాన్షుతో కాలక్షేపం చేస్తారా?

-దేవాన్షు విషయంలో వాళ్ల తాత నుంచి చాలా కైంప్లెంట్స్ వస్తున్నాయి. అంతా మీ అవేశమే వచ్చిందని అంటుంటారు. వాడు అనుకున్నది జరగ లేదంటే చేతిలో ఏది వుంటే అది విసిరేస్తుంటాడు. వాళ్ల తాత దేవాన్షు అల్లరిని ఎంత సంస్కరించాలనుకుంటుంటాడో నేను అంతగా చెడగొడుతుంటాను (నవ్వుతూ). బాధ్యతగా వుండాలని ఈ వయసు నుంచే వాడికి చెబుతుంటారాయన. నేను మాత్రం ఈ వయసు నుంచే వాడికి సమాజం అంటూ అన్నీ నేర్పిస్తున్నారు. కుటుంబం, పిల్లలు అంటే కాస్త సరదా వుండాలి అని చెబుతుంటాను. నేను బిగ్గరగా మాట్లాడితే దేవాన్షు నన్ను పరీక్షగా చూస్తూ నన్ను గోల తాత అని పిలుస్తుంటాడు. ఎవరు నా పేరు అడిగినా గోల తాత లేదా శాతకర్ణి అని చెబుతుంటాడు. ఇప్పటికీ నా అసలు పేరేంటో వాడికి తెలియదు.

రజనీకాంత్, కమల్‌హాసన్ కూడా రాజకీయాల్లోకి వస్తామంటున్నారు కదా?

-రాజకీయాల్లో ఏం చేసినా టైమింగ్ ముఖ్యం. రైట్ టైమ్‌లో రావాలి. సినిమా పరిశ్రమలో ఓ ధోరణి వుంటుంది. కొంతమంది పక్కనుండి మసిపూసి మారేడికాయ చేసినట్లు చప్పట్లు కొడతారు. దాంతో క్షణికావేశంలో ఏదో అయిపోతుందనుకుంటారు.

మీ నాన్నగారి బయోపిక్ తరువాత ఎవరితో సినిమా చేయబోతున్నారు?

-ఆగస్టు నుంచి బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా వుంటుంది.

మీ నాన్నగారి బయోపిక్‌లో నటించబోతున్నారు. మీ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన సినిమా. ఎలా వుండబోతున్నది?

-స్క్రిప్ట్ బ్రహ్మాండంగా వస్తున్నది. నాన్నగారి జీవితంలో జరిగిన అనూహ్య పరిణామాలను నేపథ్యంగా తీసుకుని సినిమా చేస్తున్నాను. ఇందులో అందరికి తెలిసిన విషయాలతో పాటు తెలియని అంశాల్ని మేళవించి బయోపిక్‌ను రూపొందిస్తున్నాం. దీనితోపాటు నాన్నగారిచ్చిన సందేశాన్ని కూడా అందించబోతున్నాం. భావితరాలు ఆయన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎందుకు ఆయన నడిచిన మార్గాన్ని అనుసరించాలి? అనే విషయాల్ని ప్రధానంగా చర్చిస్తూ బయోపిక్‌ను తెరపైకి తీసుకురావాలనుకుంటున్నాం. సమయం చిక్కినప్పుడల్లా వెళ్లి కథాచర్చల్లో పాల్గొంటున్నాను. సినిమా ఖచ్చితంగా కమర్షియల్ పంథాలోనే సాగుతుంది. నేను నాన్నగారి పాత్రలో నటించబోతుండటం నాకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది.

గతంతో పోలిస్తే ప్రస్తుతం సినిమాలు వారం నుంచి పది రోజులు మాత్రమే ఆడే పరిస్థితి. అందుకే వసూళ్ల విషయంలో పోటీ పడుతున్నారు. ఈ అంశాలను మీరు కూడా పరిగణనలోకి తీసుకుంటారా?

-నా రూటు వేరు. అందుకే ఇలాంటి అంశాల్ని పెద్దగా పట్టించుకోను. నేను ఇండస్ట్రీని మార్చలేను. చిత్రపరిశ్రమ బాగుండాలని, మరింత కాలం మనుగడ సాగించాలంటే ఎవరికి వారు తమని తాము సంస్కరించుకోవాలి. నా విషయం వరకు వస్తే నా వరకు నేను ఏం చేయాలో అదే చేస్తాను. ఈ రోజుల్లో ఎవరికి మంచి చెప్పినా దాన్ని పాటించే పరిస్థితి లేదు. అలాంటప్పుడు మరొకరికి మంచి చెప్పాలని ప్రయత్నించడం వృథా అని నా అభిప్రాయం.

3384

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles