
జీవిత గమనంలో ఎన్నో మజిలీలుంటాయి. ప్రతి మజిలీ ఏవో కొన్ని జ్ఞాపకాల్ని మిగుల్చుతుంది. ఇక ప్రేమ ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైనది. విరహ వేదనలు, సంయోగవియోగాలు, ఎడబాటు తెచ్చే మనోవేదన, ఏదో తెలియని సంఘర్షణ..వెరసి బాధలోనూ మాధుర్యాన్ని పంచుతుంది ప్రణయ ప్రయాణం. అలాంటి మధురమైన అనుభవాలకు వెండితెర దృశ్యరూపమే మా మజిలీ అన్నారు శివ నిర్వాణ. ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్పెద్ది నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకురానుంది. దివ్యాంశ కౌశిక్ మరో కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్ర రెండో లుక్ను సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. క్రికెట్ బ్యాట్ పట్టుకొని ప్రేయసి సమక్షంలో ఆనందభరితుడై ఉన్న నాగచైతన్య లుక్ అందరిని ఆకట్టుకుంటున్నది. వైజాగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దేర్ ఈజ్ లవ్..దేర్ ఈజ్ పెయిన్ అనే క్యాప్షన్ వస్తున్న ఈ సినిమాలో ప్రేమతాలూకు హృద్యమైన భావాల్ని ఆవిష్కరించామని దర్శకుడు చెప్పారు. ఇప్పటికే ఎనభైశాతం చిత్రీకరణ పూర్తయిందని నిర్మాతలు తెలిపారు రావు రమేష్, సుబ్బరాజు, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: విష్ణు శర్మ, ఆర్ట్: సాహి సురేష్, సంగీతం: గోపీ సుందర్, రచన-దర్శకత్వం: శివ నిర్వాణ.