మరపురాని మజిలీ ఇది!


Wed,April 17, 2019 11:36 PM

Naga Chaitanya Emotional Speech At Majili Movie Grand Thanks Meet

నాగచైతన్య నిజాయితీ వున్న నటుడు. అందువల్లే ఆయన చేసిన ప్రతి పాత్ర గుర్తుండిపోతుంది. పూర్ణ పాత్ర నిజంగా వైజాగ్‌లో ఉందనిపించేలా సహజంగా నటించారు. నాగచైతన్య, సమంత కెమిస్ట్రీ సినిమాలో అద్భుతంగా కుదిరింది అని అన్నారు దర్శకుడు కొరటాల శివ. నాగచైతన్య, సమంత, దివ్యాంశకౌశిక్ నాయకానాయికలుగా నటించిన చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకుడు. సాహు గారపాటి, హరీష్‌పెద్ది నిర్మించారు. ఈ చిత్ర థాంక్స్‌మీట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ భరత్ అనే నేను సినిమా చేస్తున్నప్పుడు శివనిర్వాణ ఈ కథ వినిపించాడు. మంచి సినిమా అవుతుందనిపించింది. సంభాషణలు, సన్నివేశాలు కొత్తగా ఉన్నాయని, ఇలాంటి కథలు ఇంకా రాయమని అతడితో చెప్పాను. వైజాగ్ బ్యాక్‌డ్రాప్‌తో పాటు పాత్రల కోసం నటీనటులను ఎంచుకున్న విధానం బాగుంది.

శివనిర్వాణ నిజజీవితంలో బాధ ఉన్నట్లున్నది. ఎవరైనా అమ్మాయి ఆయన్ని వదిలేసి వెళ్లింది కావచ్చు అందుకే ఇలాంటి మంచి సినిమాలు తీస్తున్నాడు అని అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ మజిలీతో నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని ఇచ్చాడు దర్శకుడు శివ. కెరీర్ క్లిష్టమైన పరిస్థితుల్లో అందమైన పాత్రను ఇచ్చాడు. భవిష్యత్తులో విజయాలు, పరాజయాలు ఎన్ని వచ్చినా ఈ సినిమాను మర్చిపోలేను అని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమించి చేసిన సినిమా ఇది. నాగచైతన్య, సమంత తమ అభినయంతో ఈ సినిమాకు ప్రాణం పోశారు.

ఈ సినిమాతో సమంతకు అభిమానిగా మారిపోయాను. నాగచైతన్యకు సరైన కథ పడితే సినిమాను మరో స్థాయికి తీసుకెళతాడని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. నాకు గ్రాస్, షేర్స్ లెక్కలు తెలియదు. ఈ పదిహేను రోజుల్లోనే అవన్నీ చూస్తున్నాను అని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాతో శివనిర్వాణ అందరిని తనదైన ప్రపంచంలో విహరించేలా చేశారని, నాగచైతన్య కంప్లీట్‌యాక్టర్‌గా కనిపించారని, ఆయనతో ఎప్పటికైనా సినిమా చేయాలనుందని అనిల్ రావిపూడి చెప్పారు. చిత్రబృందానికి దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి జ్ఞాపికల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బరాజు, రావురమేష్, దివ్యాంశకౌశిక్, పోసాని కృష్ణమురళి, తమన్ తదితరులు పాల్గొన్నారు.

2013

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles