ఏఎన్నాఆర్ పాత్ర స్ఫూర్తితో..


Sun,January 27, 2019 11:28 PM

mr majnu director venky atluri interview

ప్రేమ, రాజకీయ ఇతివృత్తాలతో కూడిన సినిమాలంటే నాకు చాలా ఇష్టం. దర్శకుడిగా అలాంటి కథలతో సినిమాలు చేయడమే సౌకర్యంగా భావిస్తాను అని అన్నారు వెంకీ అట్లూరి. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం మిస్టర్ మజ్ను. అఖిల్, నిధి అగర్వాల్ జంటగా నటించారు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో వెంకీ అట్లూరి పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి...

సినిమాకు లభిస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కుటుంబ బంధాలు, వినోదంతో పాటు అఖిల్ నటనను ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తున్నారు. ప్రేమ్‌నగర్ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ కథ రాసుకున్నాను. చరిత్రలో మజ్ను జీవితం విషాదంగా ముగిసిపోయింది. అందుకు భిన్నంగా ఈ సినిమాను హ్యాపీ ఎండింగ్‌తో ముగించాం. తుంటరి లవర్‌బాయ్‌గా అఖిల్ ఈ సినిమాలో కనిపిస్తారు. అందుకే టైటిల్ ముందు మిస్టర్ అనే పదాన్ని జోడించాం. నిర్మాత, అఖిల్‌తో పాటు టీమ్ అందరూ సినిమా ఫలితం పట్ల సంతృప్తితో ఉన్నారు. ఈ సినిమాకు తొలి ప్రేక్షకుడు హీరో నాగార్జున. తొలుత కథ వినడంతో పాటు షూటింగ్ పూర్తయిన తర్వాత సినిమా చూసి బాగుందని మెచ్చుకున్నారు. తెలుగు చిత్రసీమలో ఉన్న రెండో సినిమా సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని షూటింగ్ మొదలుపెట్టినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడా భయం పోయి ధైర్యం వచ్చింది.

విమర్శలు స్వీకరించాల్సిందే..

ఈ సినిమాపై కొన్ని విమర్శలు వినిపించాయి. సగటు ప్రేక్షకుల నుంచి కాకుండా సమీక్షకుల నుంచే ఆ మాటలు వినిపించాయి. వారే నా తొలి ప్రేమ సినిమా బాగుందని రాశారు. అప్పుడు ఆనందపడి ఇప్పుడు వారిపై కోపం తెచ్చుకోవడం సరికాదనిపించింది. ఆ విమర్శల్ని స్వీకరిస్తున్నాను. సినిమా అందరికి నచ్చాలని లేదు.
రెండో టేక్ తీసుకోలేదు..

తొలిప్రేమతో పాటు ఈ సినిమా విషయంలో కథా పరంగా నిర్మాత దిల్‌రాజు విలువైన సూచనలు ఇచ్చారు. ఆయన మనవడు అరాన్ష్ ఈ సినిమాలో చిన్న పాత్రను పోషించారు. ఏడాదిన్నర వయసే కానీ అర్షాన్ చాలా హుషారుగా కనిపిస్తాడు. నా నమ్మకానికి తగినట్లుగానే అరాన్ష్ రెండో టేక్ తీసుకోకుండా సన్నివేశాన్ని పూర్తిచేశారు.

మణిరత్నం నాకు స్ఫూర్తి..

నటనతో పోలిస్తే కథలు, మాటలు రాయడంలోనే నాకు ఎక్కువ సంతృప్తి దొరుకుతుంది. స్నేహగీతం సినిమాకు సంభాషణలు రాశాను. ఆ తర్వాత దర్శకత్వంపై దృష్టి సారించాను. మణిరత్నం, త్రివిక్రమ్‌ల ప్రభావం నాపై చాలా ఉంది. సంభాషణలు రాయడంలో, సినిమా రూపకల్పనలో వారిని స్ఫూర్తిగా తీసుకుంటాను.

ఎన్టీఆర్‌తో సినిమా..

తదుపరి సినిమా కోసం కథలు సిద్ధం చేసుకుంటున్నాను. మైత్రీ మూవీస్‌తో పాటు ఇతర నిర్మాణ సంస్థలతో కొన్ని కమిట్‌మెంట్స్ ఉన్నాయి. అఖిల్‌తో మరో సినిమా చేయాలని అనుకుంటున్నాను. ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం ఉంది. దర్శకుడిగా మరింత అనుభవం సంపాదించుకున్న తర్వాత తప్పకుండా ఆయనతో సినిమా చేస్తాను. నాగార్జున నటించిన గీతాంజలి, శివ, అన్నమయ్య సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కుదిరితే ఆయనతో సినిమా చేస్తాను.

2154

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles