సంజయ్ లీలా భన్సాలీ సినిమాలంటే ఇష్టం!

Sun,March 10, 2019 11:49 PM

దర్శకుడిని కావాలనే ఆలోచన పదిహేనేళ్ల క్రితమే వచ్చింది. మలయాళ సినిమా కోసం దివంగత నిర్మాత డి. రామానాయుడు గారు నన్ను సంప్రదించారు. అయితే సరైన కథ కుదరకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు. దర్శకత్వం వహించే ముందు ఆ శాఖ పరంగా కొంత నైపుణ్యం సంపాదించాలనే ఇంత కాలం ఆగడం జరిగింది. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన తరహాలో సినిమాలు చేయాలన్నది నా కోరిక. అందు కోసం కొన్ని కథలు సిద్ధం చేసుకున్నాను అన్నారు అశోక్‌కుమార్. కళా దర్శకుడిగా దాదాపు 150 చిత్రాలకు పనిచేసిన ఆయన తొలిసారి దర్శకుడిగా పరిచయమవుతూ స్వీయ నిర్మాణంలో రూపొందిస్తున్న చిత్రం మౌనమే ఇష్టం. రామ్ కార్తీక్, పార్వతి అరుణ్ జంటగా నటిస్తున్నారు. ఈ నెల15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అశోక్ కుమార్ హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు.

రామ్‌చరణ్ కథానాయకుడిగా కృష్ణవంశీ రూపొందించిన గోవిందుడు అందరివాడేలే చిత్రం తరువాత దర్శకత్వం వైపు వెళ్లాలని మరే చిత్రాన్ని అంగీకరించలేదు. రెండేళ్ల క్రితం రామోజీరావుగారు దర్శకుడిగా అవకాశం ఇస్తాను అన్నారు. కథా చర్చలు జరిగాయి. కానీ మంచి కథ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. దాంతో నేనే నిర్మాతగా మారి మౌనమే ఇష్టం చిత్రాన్ని తెరకెక్కించాను. ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా వుండే చిత్రమిది. ప్రేమకు ప్రేమే ఎలా సమస్యగా మారిందన్న అంశం చుట్టూ సాగే కథ ఇది. నవతరం ప్రేమికుల సంఘర్షణ తప్పకుండా నచ్చుతుంది. ఆ నమ్మకంతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాను. ఈ చిత్రాన్ని నా శ్రేయోభిలాషులైన డి. సురేష్‌బాబు, ఎస్.గోపాల్‌రెడ్డికి చూపించాను. సినిమా బాగుందని ఎస్ గోపాల్‌రెడ్డి అన్నారు. తీసుకున్న అంశం, దాన్ని తెరపై చూపించిన తీరు బాగుందని అభినందించిన సురేష్‌బాబు రిలీజ్‌కు సహకరిస్తున్నారు.

నాకు పొగరని ప్రచారం చేశారు..

కళా దర్శకుడిగా ఇప్పటి వరకు దాదాపు 150 చిత్రాలకు పనిచేశాను. ఐదు నంది పురస్కారాల్ని దక్కించుకున్నాను. దేవర్ మగన్(తెలుగులో క్షత్రియ పుత్రుడు) చిత్రానికి గాను జాతీయ పురస్కారానికి నామినేట్ అయ్యాను. మా తాతయ్య పి.ఎన్. మీనన్ మలయాళ చిత్ర సీమలో పేరు పొందిన దర్శకుడు.అలాగే మా మామయ్య భరతన్‌కు కూడా దర్శకుడిగా ఎలాంటి పేరుందో అందరికి తెలిసిందే.

పలు జాతీయ పురస్కరాల్ని సొంతం చేసుకున్న చిత్రాల్ని రూపొందించారాయన. దర్శకుడిగా వారి పేరును నిలబెట్టే చిత్రాల్ని రూపొందించాలని వుంది. కళా దర్శకుడిగా ఎన్నో ఉత్తమ చిత్రాలకు పనిచేశాను. అలాంటి నాకు ఓ దశలో పొగరని ప్రచారం చేశారు. దాంతో కావాలనే కళా దర్శకుడిగా విరామం తీసుకున్నాను. ఇకపై కళా దర్శకుడిగా కొనసాగుతూనే నాకు నచ్చిన కథల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. త్వరలో నా మాతృభాష అయిన మలయాళంలో ఓ సినిమా చేయబోతున్నాను.

832

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles