అమ్మ భయపడేది


Tue,July 9, 2019 11:58 PM

meghamsh raj dooth movie release On the 12th

నన్ను హీరోను, అన్నయ్యను దర్శకుడిని చేస్తానని నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన చెప్పిన మాటల్ని మేము ఫాలో అవుతున్నాం అని అన్నారు మేఘాంశ్. దివంగత నటుడు శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం రాజ్‌దూత్. అర్జున్, కార్తిక్ దర్శకత్వంవహిస్తున్నారు. ఎం.ఎల్.వి సత్యనారాయణ నిర్మించారు. ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో మేఘాంశ్ పాత్రికేయులతో ముచ్చటించారు.

రాజ్‌దూత్ బైక్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ యువకుడు బైక్ కోసం ఎందుకు అన్వేషిస్తున్నాడన్నది ఆకట్టుకుంటుంది. భిన్నమైన కమర్షియల్ సినిమాగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. కుటుంబ బంధాలు, ప్రేమ, వినోదం సమపాళ్లలో ఉంటాయి. నా వయసుకు సరిపోయే మంచి కథ కావడంతో అరంగేట్రానికి ఈ సినిమాను ఎంచుకున్నాను. హుషారు, అల్లరితనం మేళవింపుతో కూడిన పాత్రలో కనిపిస్తాను. సుధీర్‌వర్మ సినిమాలకు రచనా విభాగంలో పనిచేసిన అర్జున్-కార్తీక్ వినూత్నంగా సినిమాను తెరకెక్కించారు. ఇద్దరు దర్శకులు కావడంతో వారి మధ్య అభిప్రాయభేదాలు వస్తే సినిమా ఆగిపోతుందనే భయం ఎప్పుడూ ఉండేది. కానీ ఒకే మాట మీద ఉంటూ చిత్రాన్ని పూర్తిచేశారు. తొలి సినిమా అంచనాలు, ఒత్తిడుల నుంచి దూరంగా ఉండటానికే ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్ పూర్తి చేశాం. కొన్ని సన్నివేశాల్ని నలభై ఐదు డిగ్రీల వేడిని భరిస్తూ ఎండల్లో కష్టపడి పూర్తిచేశాను.

బీబీఏ మూడో ఏడాది...

చిన్నప్పటి నుంచి సినిమా తప్ప నాకు మరో ప్రపంచం తెలియదు. ప్రస్తుతం బీబీఏ మూడో ఏడాది చదువుతున్నాను. చదువును కొనసాగిస్తూనే ఈ సినిమాలో నటించాను.. నేను హీరోగా నటిస్తుండటం చూసి అమ్మ గర్వపడినా ఫలితం ఎలా ఉంటుందోనని భయపడేది. సినిమా చూసి నచ్చిందని చెప్పింది. అమ్మ సెట్స్‌లోకి వచ్చినప్పుడు తన ముందు నటించడానికి నేను చాలా టెన్షన్ పడ్డాను. ఈ సినిమాను అంగీకరించిన తర్వాత నటనలో నెల రోజుల పాటు శిక్షణ తీసుకున్నాను. అలాగే స్కూల్‌లో నాటికలు వేసిన అనుభవం ఉపయోగపడింది.

అన్నయ్య దర్శకత్వంలో..

నాన్న దూరమైన తర్వాత మూడు సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమయ్యాం. అమ్మ యోగక్షేమాలు చూసుకుంటూ ఉండిపోయాం. అయినా ఇండస్ట్రీలోని చాలా మంది నన్ను ప్రోత్సహించడం ఆనందంగా ఉంది. భద్రాచలం, కింగ్, ఢీ, మగధీరతో పాటు నాన్న నటించిన అన్ని సినిమాలు ఇష్టమే. నాన్న ఉంటే నా తొలి సినిమా ఇంకా పెద్ద స్థాయిలో ఉండేది. అయినా నాన్న లేని లోటును అమ్మ తీర్చుతున్నది. నిరంతరం మాలో ధైర్యాన్ని నింపుతూ ముందుకు నడిపిస్తున్నది. నాన్న పోలికలు ఎక్కువగా అన్నయ్యలో కనిపిస్తాయి. నేనూ అమ్మలా ఉంటానని అందరూ చెబుతుంటారు. అన్నయ్య ప్రస్తుతం దర్శకత్వంలో మెళకువలను నేర్చుకుంటున్నారు.

790

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles