మహేష్‌ను కొత్తగా చూపిస్తా!


Mon,February 12, 2018 11:19 PM

మహేష్‌బాబును దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా కథలు రాయాల్సిన అవసరం లేదు. అందం, అభినయం, వ్యక్తిత్వంతో ఎలాంటి కథలోనైనా అతడు ఒదిగిపోతాడు. హాలీవుడ్ స్థాయి నటుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు, అతడు నా తమ్ముడైనందుకు గర్వపడుతున్నాను అని అన్నారు మంజుల. సీనియర్ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ వారసురాలిగా అరంగేట్రం చేసిన మంజుల మంచి నటిగా, విజయవంతమైన చిత్రాల నిర్మాతగా బహుముఖప్రజ్ఞాశాలిగా రాణిస్తున్నారు. తాజాగా దర్శకురాలిగా మారుతూ మంజుల తెరకెక్కించిన చిత్రం మనసుకు నచ్చింది. ఈ నెల 16న ఈ చిత్రం విడుదలకానున్నది. ఈ సందర్భంగా మంజుల పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి...
Manjula

సినిమాలో మీ మనసుకు నచ్చినదేమిటి?

కమర్షియల్ సినిమా తీసి డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో కాకుండా నాలోని ఆలోచనలు, అభిప్రాయాలకు అక్షరరూపమిస్తూ మనసుపెట్టి నిజాయితీగా చేసిన ప్రయత్నమిది. ఆధునిక జీవన శైలి కారణంగా చిన్న చిన్న ఆనందాలకు దూరమైపోతున్నాం. ఆ జ్ఞాపకాలకు అందమైన దృశ్యరూపంగా ఈసినిమా ఉంటుంది.

ఇంతకీ ఈ సినిమా కథేమిటి?

ఫన్ లవ్‌స్టోరీ ఇది. కథ వెనుక మరో కథతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ప్రకృతి సినిమాలో కీలకభూమిక పోషిస్తుంది. ప్రకృతికి సంబంధించిన సన్నివేశాలకు మహేష్‌బాబు వాయిస్ ఓవర్అందించారు. పెళ్లి పీటల మీది నుంచి పారిపోయిన ఓ జంట చివరకు తమ మనసుకు ఏం కావాలో ఎలా తెలుసుకున్నారు? ఏ విధంగా తమ ప్రేమను గెలుచుకున్నారన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. ఆధునిక యువత మనస్తత్వాలకు దగ్గరగా ఉంటుంది.

మీ నిజజీవితంలోనుంచి స్ఫూర్తి పొందిన సంఘటనలేమైనా సినిమాలో కనిపిస్తాయా?

అలాంటివేమి ఉండవు. పూర్తిగా కల్పిత కథ ఇది. నిజజీవితంలో నాకో లవ్‌స్టోరీ ఉంది. నా కథకు సినిమాలోని లవ్‌స్టోరికి ఎలాంటి పోలికలు ఉండవు. సూర్యోదయాలు, సూర్యస్తమయాలంటే నాకు చాలా ఇష్టం. ఇందులో కథానాయికను అలాగే చూపించాను. నాన్న, మహేష్‌బాబుతో పాటు నిజజీవితంలో నేను చూసిన వ్యక్తుల గుణగణాలను సినిమాలోని పాత్రలకు అన్వయించాను. కానీ వారిని యథాతథంగా తెరపై చూపించలేదు.

నటన, నిర్మాణం, దర్శకత్వంలో మీకు ఏది కష్టంగా అనిపించింది?

ఈ సినిమాతో దర్శకురాలిగా నాకు పదికి పది మార్కులు పడతాయనే నమ్మకముంది. నాన్నగారి ప్రభావం.. ఇతర కారణాల వల్ల తొలుత నటనవైపు అడుగులు వేశాను. అలాగని నేనేమి గొప్ప నటిని కాదు. కానీ ఎన్ని చేసినా దర్శకత్వంపైనే నా మనసంతా కేంద్రీకృతమయ్యేది. కానీ సొంతగా కథనురాయగలనా? లేదా? అనే అపనమ్మకం ఉండేది. తెలుగు భాషపై పెద్దగా పట్టులేకపోవడంతో ఆ ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. నా హృదయంలోంచి పుట్టిన కథ ఇది. దానికే తెరరూపమిచ్చాను.

దర్శకత్వం చేస్తాననగానే నాన్న, మహేష్‌బాబు ఏమన్నారు?

నాన్నగారు చాలా థ్రిల్‌గా ఫీలయ్యారు. దర్శకత్వ విభాగం పట్ల నాకు ఆసక్తి ఉన్న విషయం ఆయనకు తెలుసు. ఆయన నటించిన తెలుగు వీర లేవరా సినిమాకు పనిచేశాను. కానీ నటిగా రాణించలేకపోవడంతో దర్శకత్వ ప్రయత్నాలు చేస్తున్నాననుకున్నారు. మహేష్‌బాబుతో చెప్పగానే దర్శకత్వ ఎంత కష్టమో నీకు తెలుసా? పిచ్చెక్కిందా? అని అన్నాడు. తొలుత నా మాటలు నమ్మలేదు. కథ, నాలోని విశ్వాసాన్ని చూసి అప్పుడు నమ్మాడు. ట్రైలర్ అతడికి చాలా నచ్చింది.

నాన్న, మహేష్ ఈ సినిమా చూశారా?

లేదు. ఫస్ట్‌డే ఫస్ట్‌షో చూస్తామని అన్నారు.

మహేష్‌బాబుతో సినిమా ఎప్పుడు చేయబోతున్నారు?

మహేష్‌బాబుతో ఓ సినిమా చేయాలనే ప్లానింగ్‌లో ఉన్నాను. ఇంతకుముందు నాన్నగారు తప్ప ఎవరూ చేయనటువంటి కొత్త కథలో మహేష్‌బాబును చూపించబోతున్నాను. స్ట్రెయిట్ సినిమానా? నాన్నగారి రీమేకా? అనే విషయం ఇప్పుడు చెప్పను. తొందరలోనే ఆ సినిమాకు సంబంధించిన వివరాల్నివెల్లడిస్తాను.

పవన్‌కల్యాణ్ కోసం కథను సిద్ధం చేసుకున్నారని ప్రచార కార్యక్రమాల్లో చెప్పారు?

ఓ అగ్ర కథానాయకుడు సినిమాల్ని వదిలిపెట్టి ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వస్తే ఏం జరుగుతుందనే ఇతివృత్తంతో ఓ కథను సిద్ధంచేసుకున్నాను. ఆ కథను పవన్‌కల్యాణ్‌తో చేస్తాననే నమ్మకమైతే ఉంది. అది కుదురుతుందో లేదో తెలియదు.

1459

More News

VIRAL NEWS