వీరులను స్మరించుకోవాలి!


Fri,January 4, 2019 11:54 PM

manikarnika movie trailer launch

వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం మణికర్ణిక. క్వీన్ ఆఫ్ ఝాన్సీ ఉపశీర్షిక. కంగనారనౌత్ టైటిల్‌రోల్‌ని పోషిస్తున్నది. క్రిష్, కంగనారనౌత్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ పతాకంపై కమల్‌జైన్, నిశాంత్ నిర్మించారు. ఈ నెల 25న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకులముందుకురానుంది. ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కంగనారనౌత్ మాట్లాడుతూ నాకు తెలుగు భాష చాలా ఇష్టం. చక్కటి శబ్దమాధుర్యంతో తెలుగు వినసొంపుగా అనిపిస్తుంది. అందుకే ఈ సినిమా డబ్బింగ్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకున్నాను. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమాను ఆగస్ట్‌లో పూర్తి చేయాలి. దర్శకుడు క్రిష్ మరో ప్రాజెక్ట్‌తో బిజీ కావడం వల్ల నేను దర్శకత్వ బాధ్యతల్ని తీసుకున్నాను. ఓవర్‌నైట్‌లో తీసుకున్న నిర్ణయమది. టీమ్ అంతా ఈ చారిత్రక ఇతివృత్తాన్ని ఎంతగానో ప్రేమించాము. అందరి సహకారంతో దర్శకురాలిగా నా బాధ్యతను నిర్వర్తించాను.
Mamidi-Harikrishna.jpg
ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర కోసం గుర్రపుస్వారీ, కత్తిసాములో శిక్షణ తీసుకున్నాను. మహోన్నతమైన మన దేశ చరిత్ర విస్మృతికి గురవుతున్నది. గొప్ప సంస్కృతిని మరచిపోతున్నారు. దేశం కోసం రక్తంధారబోసిన వీరుల్ని స్మరించుకోవాలన్న సంకల్పంతో ఈ సినిమాను తెరకెక్కించాం. దేశ చరిత్రలో మరుగునపడిన ధీరోదాత్తులు ఎందరో ఉన్నారు. వారి చరిత్ర నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా సందర్భంగా నేను ప్రమాదంలో గాయపడ్డాను. అయినా కథపై ప్రేమతో అంకితభావంతో శ్రమించాను. ఈ సినిమా విషయంలో దర్శకురాలిగా ఎప్పుడూ అభద్రతాభావానికి గురికాలేదు అని చెప్పింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ మనమంతా గర్వించదగిన చిత్రమిది.

దేశభక్తి ప్రధాన చిత్రాలు భారీ నిర్మాణ విలువలతో రూపుదిద్దుకోవడం శుభపరిణామం. అత్యద్భుతమైన అభినయానికి ప్రతీక కంగనారనౌత్. ట్రైలర్ చూస్తే ఈ సినిమా కోసం ఆమె ఎంతగా శ్రమించిందో తెలుస్తున్నది. అంకితభావం, సినిమా కళ పట్ల ప్రేమ ఏమిటో కంగనారనౌత్‌ను చూస్తే అర్థమవుతుంది అన్నారు. దేశభక్తి సినిమా చేస్తున్నందుకు కంగనారనౌత్‌ను అభినందిస్తున్నానని, ట్రైలర్‌లో ఆమె అభినయం తనను మంత్రముగ్ధుణ్ణి చేసిందని ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథా రచయిత విజయేంద్రప్రసాద్, నిర్మాత కమల్‌జైన్ పాల్గొన్నారు.

1382

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles