శౌర్య ప్రేమప్రయాణం..


Fri,December 25, 2015 11:41 PM

Manchu Manoj New movie Shaurya

regina


మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం శౌర్య. ఏ థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ అని ఉపశీర్షిక. దశరథ్ దర్శకుడు. రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర సాంగ్ టీజర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్ర సాంగ్ టీజర్‌ను విడుదల చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి నచ్చే చిత్రమిది అన్నారు. రెజీనా మాట్లాడుతూ దశరథ్ దర్శకత్వంలో ఇంత కాలం ఎందుకు నటించలేదా అనిపిస్తోంది. ఏదో విషయం వుంటే కానీ ఆయన సినిమా చేయరు. అలాంటి దర్శకుడి చిత్రంలో నేనూ ఓ భాగమైనందుకు ఆనందంగా వుంది. ఈ చిత్రం ద్వారా పరిచయమవుతున్న వేదా అద్భుతమైన సంగీతం అందించాడు. పాటలన్నీ ఆకట్టుకుంటాయి అని తెలిపింది.

నందు మాట్లాడుతూ మనోజ్‌ను కొత్త కోణంలో ఆవిష్కరించే సినిమా ఇది. మాస్ ఇమేజ్ వున్న మనోజ్‌ను తన పంథాకు అనుగుణంగా మార్చి దశరథ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా వుంటుంది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఆ క్రెడిట్ దర్శకుడిదే. సినిమా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరి మొదటి వారంలో ఆడియోను, చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో జీవి, శివారెడ్డి, మధుమణి, బాలు, జోషి తదితరులు పాల్గొన్నారు.

1923

More News

VIRAL NEWS