ఇమేజ్ ఛట్రంలో బందీ అయిపోకుండా భిన్న తరహా కథాంశాలతో ప్రేక్షకుల్ని అలరించాలన్నదే తన అభిమతమని అన్నారు నాగచైతన్య. వైవిధ్యతను నమ్మి హీరోగా తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారాయన. ఫలితాన్ని గురించి ఆలోచించకుండా కథ, పాత్రల పరంగా ప్రతి సినిమాతో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించడానికి తపిస్తుంటారు. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మజిలీ. పెళ్లి తర్వాత భార్య సమంతతో కలిసి ఆయన నటిస్తున్న తొలి సినిమా ఇది. శివనిర్వాణ దర్శకుడు. రేపు ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నాగచైతన్య పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి...
తొలిసారి మీ సినిమా విడుదలకు ముందు తిరుపతి వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు? ఎందుకలా?
-సమంత తీసుకెళ్లడంతో ఆమెతో పాటు తిరుపతి వెళ్లాను. సమంత దేవుణ్ణి బాగా నమ్ముతుంది. నేను తాతయ్య ఏఎన్నాఆర్లా మిధ్యావాదిని. దేవుడిపై అతిగా ఆధారపడను. వ్యతిరేకించను. మజిలీలోమీరు, సమంత కలిసి నటించారు. సినిమాలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?
-గతంలో నేను, సమంత కలిసి ఏమాయచేశావే, ఆటోనగర్‌సూర్య, మనం సినిమాలు చేశాం. అవన్నీ ప్రేమకథలే. వాటికి భిన్నంగా పెళ్లి తర్వాత కొత్త కథ దొరికితే జంటగా నటించాలని అనుకున్నాం. శివనిర్వాణ అలాంటి కథతో మా దగ్గరకు వచ్చారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల జీవితంలో ఉండే ఒడిదుడుకుల్ని, ప్రేమను ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదివరకు వెండితెరపై ఎవరూ స్పృశించని కథ ఇది. ఇలాంటి కొత్త కథను చెబితే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఏర్పడింది. పెళ్లి తర్వాత మేమిద్దరం కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో అంచనాలు చాలా ఏర్పడ్డాయి.
ట్రైలర్‌కు పాజిటివ్టాక్ లభిస్తున్నది. కథ విన్నప్పుడు వర్కవుట్ అవుతుందనే ఫీలింగ్ కలిగిందా?
-శివ నిర్వాణ దర్శకత్వం వహించిన నిన్నుకోరి సినిమా నాకు బాగా నచ్చింది. ఆ సినిమాను రియలిస్టిక్‌గా, నిజాయితీగా చూపించిన విధానం బాగుంది. నాకు అలాంటి సినిమాలంటే చాలా ఇష్టం. నిన్నుకోరి తరహాలో హృద్యమైన ప్రేమకథ ఉంటే చెప్పు కలిసి సినిమా చేద్దామని శివనిర్వాణతో అన్నాను. రెండు నెలల తర్వాత మజిలీ పాయింట్ చెప్పడంతోవెంటనే సినిమాకు ఓకే చెప్పాను.
సమంతను కథానాయికగా తీసుకోవాలనే ఆలోచన మీదేనా?
-ఆ ఆలోచన నాది కాదు. దర్శకుడిదే. కథ విన్న తర్వాత సమంత ఇందులో భాగమయితే బాగుంటుందని అనుకొని ఆమెను తీసుకున్నారు.
ఇంట్లో సమంతకు, మీకు మధ్య సినిమాల ప్రస్తావన వస్తుందా?
-ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరువరకు సినిమాల గురించి ఆలోచిస్తాం. ఆ తర్వాత సినిమాల టాపిక్ మా మధ్య రాదు.
శ్రావణి పాత్రను సమంత చేయడం సినిమాకు ఎంతవరకు ఉపయోగపడిందని అనుకుంటున్నారు.
-కథానుగుణంగా మా ఇద్దరి పాత్రలు శక్తివంతంగా సాగుతాయి. మా మధ్య ఉన్న అవగాహన వల్లే తెరపై పూర్ణ, శ్రావణి పాత్రల కెమిస్ట్రీ బాగా కుదిరింది. సమంత ఈ సినిమా చేయడం నాకు చాలా హెల్పయింది.
మీ పాత్ర బాగా రావాలని ఎక్కువ టెన్షన్ పడ్డట్లు సమంత ప్రచార వేడుకల్లో చెప్పింది.
-ఇల్లు, షూటింగ్...ఎక్కడైనా తన లైఫ్ కంటే నా గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటుంది సమంత.అది ఆమె స్వభావం.
పూర్ణ పాత్ర కోసం ఎలా సన్నద్దమయ్యారు?
-కథ సిద్ధంచేస్తున్నప్పటి నుండి షూటింగ్ ప్రారంభం కావడానికి మధ్య ఏడెనిమిదినెలల విరామం దొరికింది. ఈ సమయంలో దర్శకుడు శివ ఓ నలభై సార్లు నాకు కథ వినిపించి పాత్రలో లీనమయ్యేలా చేశారు. ఈ సినిమా ద్వారా అతడు నాకు మంచి స్నేహితుడయ్యాడు. కథ ఓకే అయినా తర్వాత నేను అతడి పనిలో ఎలాంటి జోక్యం కలుగజేసుకోలేదు. దర్శకుడి సూచనల్ని అనుసరించాను.
సినిమాలో మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన సన్నివేశం ఏదైనా ఉందా?
-పతాక ఘట్టంతో పాటు ద్వితీయార్థంలో పోసానికి, నాకు మధ్య వచ్చే సన్నివేశం సవాల్‌గా అనిపించాయి. పతాక ఘట్టాల కోసం నేను, సమంత నెల రోజుల ముందునుంచే ప్రత్యేక్యంగా సన్నద్దమయ్యాం. మధ్యతరగతి జీవితాల్ని, వారి మధ్య ఉండే అనుబంధాల్ని సహజంగా సినిమాలో చూపించారు. సినిమాటిక్ స్వేచ్ఛ ఎక్కడ తీసుకోలేదు.
సినిమాలో విఫల ప్రేమకుడిగా కనిపిస్తారా?
-ప్రేమ, కెరీర్‌తో పాటు అన్నింటిలో ఓడిపోయిన యువకుడిగా కనిపిస్తాను. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడోఒకప్పుడు ఓటమి ఎదురవుతుంది. ఆ ఓటమిని అధిగమించి కొత్త జీవితాల్ని ఎలా ప్రారంభించాలన్నదే ఈ కథ.
మీ వ్యక్తిగత జీవితాన్ని ఈ సినిమా ఏమైనా ప్రభావితం చేసిందా?
-అలాంటిదేమీ లేదు. ఈ సినిమా ప్రభావం నా జీవితంపై జీరోగా ఉంటుంది.
సినిమాలో ఎక్కువగా మీరు, సమంత గొడవలు పడుతూ కనిపిస్తున్నారు?
-సినిమాలో నాకు సమంతకు మధ్య చాలా వాదనలు జరుగుతుంటాయి. ఆ సన్నివేశాల్ని వినోదంతో మొదలుపెట్టి ఎమోషనల్ టచ్‌తో దర్శకుడు చక్కగా నడిపించారు.
ఈ సినిమాతో మీరు ఆశించిన కమర్షియల్ హిట్ లభిస్తుందని అనుకుంటున్నారా?
-నిజాయితీతో ఈ సినిమా చేశాం. కమర్షియల్‌గా విజయాన్ని సాధిస్తే సంతోషమే. వేసవి, ఉగాది పండుగ ఈ సినిమాకు కలిసివస్తాయనే నమ్మకం ఉంది.
జయాపజయాల్ని మీరు ఎలా స్వీకరిస్తారు.
-కొన్ని సినిమాలు బాగా ఆడుతాయనే నమ్మకంతో చేస్తాం. అలాంటివి సరైన ఫలితం అందుకోనప్పుడు బాధ కలుగుతుంది.చిన్న వయసులోనే జయాపజయాల్ని రెండింటిని చూశాను. ప్రస్తుతం ఆ తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నాను.
భవిష్యత్తులో మీరు, సమంత కలిసి సినిమాలు చేస్తారా?
-మజిలీ లాంటి మంచి కథలు దొరికితే తప్పకుండా కలిసి నటిస్తాం.
నాగచైతన్యకు సమంత రూపంలో మంచి అమ్మాయి దొరికింది అని మీ నాన్నగారు నాగార్జున ప్రీరిలీజ్ వేడుకలో అన్నారు.
-నాన్న మాటలు సంతోషాన్ని కలిగించాయి. నిజంగా నాకు మంచి అమ్మాయి దొరికింది.
సమంత నటించిన తమిళ చిత్రం సూపర్‌డీలక్స్ చూశారా?
-చూశాను. నాకు బాగా నచ్చింది. సమంతతో పాటు అందరి నటన బాగుంది. అలాంటి కథల్ని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి. తెలుగులో ఇలాంటి కథలతో ఎవరైనా దర్శకులు వస్తే తప్పకుండా నటిస్తాను. అర్జున్‌రెడ్డి సినిమా పాత్రల పరంగా ఇండస్ట్రీలో ఉన్న సెంటిమెంట్స్‌ను చాలా వరకు చెరిపేసింది.
వెంకీమామా షూటింగ్ ఎంతవరకు వచ్చింది?
-ఇప్పటికే పదిహేను రోజులు షూటింగ్ చేశాం. ఈ నెల 8 నుంచి తదుపరి షెడ్యూల్ ప్రారంభంకానుంది. జూలైలోగా సినిమాను పూర్తిచేస్తాం. వెంకటేష్ కామెడీ టైమింగ్‌కు నేను పెద్ద అభిమానిని. ఆయనతో నటించడం ఛాలెంజింగ్ అనిపిస్తుంది.
తదుపరి సినిమా విశేషాలేమిటి?
-కథలు వింటున్నాను. ఏదీ ఖరారు కాలేదు. నాన్నతో కలిసి బంగార్రాజు సినిమా చేసే ఆలోచనలో ఉన్నాను. ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం కథ చర్చలు సాగుతున్నాయి. అన్ని కుదిరితే ఆగస్టులో ఈ సినిమా ప్రారంభమవుతుంది.
మజిలీలో క్రికెటర్‌గా కనిపిస్తున్నారు. ఈ ఆటలో ఏమైనా శిక్షణ తీసుకున్నారు?
-క్రికెట్లో నాకు ఎలాంటి పరిజ్ఞానం లేదు. బ్యాట్ పట్టుకోవడం రాదు. సినిమా కోసం రంజీ క్రికెటర్ సతీష్ దగ్గర నాలుగు నెలల పాటు శిక్షణ తీసుకున్నాను. అలాగే అఖిల్ కొన్ని విలువైన సలహాలు ఇచ్చారు.

-పెళ్లి తర్వాత సమంతతో కలిసి నటించడంతో సినిమాలో ఎక్కువ కంఫర్ట్ దొరికింది. మేము చేసే తప్పులు ఏమిటో వెంటనే తెలిసిపోయేవి ఒకరికొకరం సహాయం చేసుకుంటూ వాటిని సరిదిద్దుకొనే అవకాశం లభించింది. స్వేచ్ఛగా అభిప్రాయాల్ని పంచుకున్నాం. అదే కొత్త హీరోయిన్ అయితే ఇద్దరి మధ్య కంఫర్ట్ కుదరడానికి సమయం పడుతుంది.
-హీరోగా అన్ని రకాల కథాంశాలతో సినిమాలు చేయాలనుంది. అయితే రొమాంటిక్ కథాంశాలతో నేను చేసిన సినిమాల్ని ప్రేక్షకులు ఇష్టపడ్డారు. అందుకే అలాంటి సినిమాలు చేస్తున్నాను. రొమాన్స్, నిజాయితీతో కూడిన రియలిస్టిక్ కథలు నాకు ఇష్టం.