మహేష్ సలహా పాటిస్తున్నాను!


Sat,March 30, 2019 11:27 PM

majili is a new concept says samantha akkineni

చూడటానికి కాస్త అమాయకంగా కనిపిస్తుంది సమంత. ఒక్కసారి మాట కలిపితే చాలు ఆమెలో ఎంత అల్లరి ఉందో తెలిసిపోతుంది. పెదాలపై తారాడే చిరునవ్వు, సోగకళ్లలో పలికే వేల భావాలు, జలపాతంలా దూకే మాటల ప్రవాహం వెరసి స్వచ్ఛమైన అందానికి అచ్చమైన చిరునామాగా భాసిల్లుతుంది. వివాహానంతరం భర్త నాగచైతన్యతో కలిసి సమంత నటిస్తున్న చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకుడు. ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా సమంత పాత్రికేయులతో తన మనోభావాల్ని పంచుకుంది. ఆమె చెప్పిన ముచ్చట్లివి..

-సినిమాలోని నాయకానాయికలు పూర్ణ, శ్రావణి పాత్రలతో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. వాకి పాత్రలతో సహానుభూతిచెందుతూ తాదాత్మ్యం చెందుతారు. హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలున్న కథలో భాగమవడం అదృష్టంగా భావిస్తున్నాను.

-సూపర్‌డీలక్స్ చిత్రంలో నా పాత్రకు మంచి స్పంద లభిస్తున్నది. నెగెటివ్ క్యారెక్టర్ చేశాను కాబట్టి అందరూ విమర్శిస్తారనుకున్నాను. విచిత్రంగా అందరూ మెచ్చుకుంటున్నారు. గతంలో ట్రోల్స్(ఆన్‌లైన్ విమర్శలు) అంటే భయమేసేది. ఇప్పుడు అనుభవం వచ్చింది కాబట్టి వాటి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు.

-భావోద్వేగభరిత సన్నివేశాల్లో గ్లిజరిన్ వాడటం నాకు ఇష్టం ఉండదు. గ్లిజరిన్ వాడితే సంపూర్ణమైన నటులు కాలేరని నా వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి కన్నీళ్లు పెట్టుకునే సన్నివేశాల్లో అస్సలు గ్లిజరిన్ వాడను. సహజసిద్ధంగా అభినయించడానికే ప్రాధాన్యతనిస్తాను.

పళ్లైన తర్వాత చైతూతో కలిసి తొలిసారి నటించిన చిత్రమిది. ఈ కొత్త ప్రయాణాన్ని ఎలా ఆస్వాదించారు?

-ఇదివరకు మానిటర్‌లో కేవలం నా అభినయం ఎలా ఉందో అని మాత్రమే చెక్ చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ప్రాధాన్యతలు మారిపోయాయి. మజిలీ సినిమా విషయంలో చైతూ ఎలా చేశాడు? షాట్ పర్‌ఫెక్ట్‌గా వచ్చిందా? అని ఎక్కువ టెన్షన్ పడ్డాను. వాస్తవానికి ఇద్దరం కలిసి సినిమా చేయడం నాకు ఇష్టం లేదు. అభిమానుల అంచనాలు అందుకుంటామో లేదో అనే భయం ఉండేది. పెళ్లయ్యాక కూడా తెరపై తొలిచూపు ప్రేమలు, రొమాన్స్..ఇవన్నీ ఎవరు చూస్తారు? అని సందేహ పడ్డాను. అయితే మజిలీ కథ విన్న తర్వాత ఈ టైమ్‌లో చేయాల్సిన సరైన సినిమా ఇదే అనిపించింది.

మజిలీ కథ గురించి..?

-పెళ్లికి ముందు నా జీవితం వేరుగా ఉండేది. ఇప్పుడున్న ప్రశాంతత ఉండేది కాదు. పెళ్లయిన తర్వాత జీవితంలో భద్రతాభావం పెరిగింది. ఇప్పుడు ఎంతో శాంతంగా ఉండగలుగుతున్నాను. భార్యభర్తల ప్రేమలో ఏదో మ్యాజిక్ ఉందనిపించింది. ఇలాంటి పాయింట్‌ను సినిమాలో ఎవరూ టచ్ చేయలేదు కదా అనుకున్నాను. ప్రేమంటే కేవలం ప్రేమికులకు సంబంధించిన భావన కాదు. కుటుంబ ఆప్యాయతలు, అనురాగాల అందమైన కలబోత. మజిలీలో అలాంటి హృద్యమైన అంశాల్ని స్పృశించాడు దర్శకుడు శివ నిర్వాణ.

ఈ సినిమాలో శ్రావణిగా మీ పాత్రలో ఎలాంటి భావోద్వేగాల్ని పండించారు?

-మనం ఎంచుకున్న రంగంలో నిన్నటి కంటే నేడు మరింత ఉన్నతంగా ఉండాలన్న సిద్ధాంతాన్ని నేను విశ్వసిస్తాను. ప్రతి పాత్రలో ఏదో కొత్తదనం ఉండాలని కోరుకుంటాను. ఈ సినిమాలో శ్రావణి మితభాషి. కానీ కుటుంబంలో అన్ని విషయాల్ని తానే చక్కగా బెడుతుంది. శ్రావణి నవ్విస్తుంది. కంటతడిపెట్టిస్తుంది. స్వాంతన అందిస్తుంది.

ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో మీరేమైనా మార్పులు చేర్పులు సూచించారా?

-అలాంటిదేమి లేదు. ఏ సినిమా కథ అయినా నచ్చితే వెంటనే అంగీకరిస్తాను. ఆ తర్వాత స్క్రిప్ట్ విషయంలో అస్సలు జోక్యం చేసుకోను. అదే విధంగా నాకు నచ్చని కథకు ఎన్ని మార్పులు చేసి తీసుకొచ్చినా ఆ సినిమా ఒప్పుకోను. కెరీర్ తొలినాళ్ల నుంచి ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాను.

షూటింగ్ నుంచి ఇంటికొచ్చాక మీరు, చైతన్య సినిమా గురించి ఏమైనా చర్చించేవారా?

-కొన్ని సందర్భాల్లో సినిమా గురించి చర్చలు వచ్చేవి. ముఖ్యంగా సినిమా ైక్లెమాక్స్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. సినిమాలో చైతూ పాత్ర విస్త్రృతి ఎక్కువ. అభినయపరంగా ఎంతో శక్తివంతమైనది. అందుకే చైతూ పాత్ర గురించి ఎక్కువగా మాట్లాడుకునే వాళ్లం. ఈ సినిమా చేసిన తర్వాత చైతూ భార్యగా ఎంతో గర్వపడుతున్నాను.

ఈ మధ్యకాలంలో సినిమాల ఎంపికలో మీ దృక్పథం మారినట్లు కనిపిస్తున్నది?

-కెరీర్ ఆరంభంలో మాదిరిగా వరుసగా ఐదారు సినిమాలు చేయాలనే ఆత్రుత ఇప్పుడు లేదు. ఒక్క సినిమా చేసినా కథలో కొత్తదనం ఉండాలని కోరుకుంటున్నాను. తొలినాళ్లతో పోల్చితే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నా దృక్పథంలో చాలా మార్పులొచ్చాయి. ఇప్పుడు సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాను. రెగ్యులర్ సినిమా అనే పదాన్ని నా డిక్షనరీ నుంచి తీసేశాను (నవ్వుతూ). ఏ తరహా పాత్ర చేసినా ఛాలెంజ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను.

చైతూ అభినయం చూస్తే మీకెలా అనిపించింది?

-ఈ విషయాన్ని ఎవరితో మాట్లాడొద్దని చైతూ నాతో చెప్పారు (నవ్వుతూ). ప్రతి సినిమాకు చైతూ నటుడిగా పరిణితి చెందుతున్నాడు. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో చైతూ నటన చూసి షాక్ అయ్యాను.

ప్రేమలో ఉన్నప్పటి కంటే పెళ్లయ్యాక చైతూతో కలిసి నటించడం సౌకర్యవంతంగా అనిపించిందా?

-అలాంటిదేమి లేదు. తెరపై నా పక్కన ఎవరున్నా బెస్ట్ పర్‌ఫార్మెన్స్ అందివ్వాలని ప్రయత్నిస్తాను. సినిమాలోని చిన్న సన్నివేశాన్ని కూడా తక్కువ అంచనా వేయలేము. సహ నటులు ఎవరైనా పాత్రకు అనుగుణంగా నా అభినయం విషయంలో ఏమాత్రం తేడా ఉండదు.

సినీ ప్రయాణాన్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది?

-ఇప్పుడు మరింత బాధ్యత పెరిగింది. దూకుడు షూటింగ్ సమయంలో మహేష్‌బాబుగారు నాకు కెరీర్‌లోనే ఉత్తమైన సలహా ఇచ్చారు. ప్రతి సినిమాను కొత్త సినిమాగానే భావించు. అప్పుడే రాణిస్తావు అని చెప్పారాయన. మహేష్‌బాబు మాటల్ని ఖచ్చితంగా పాటిస్తున్నాను.

పదేళ్ల కెరీర్‌లో చేయాల్సిన డ్రీమ్ క్యారెక్టర్ మిగిలిపోయిందా?

-క్రీడా నేపథ్యంలో సినిమా చేయాలన్నది నా కల. ఎందుకంటే శారీరకమైన శ్రమ కలబోసిన పాత్రలు నాకు ఎంతగానో స్ఫూర్తినిస్తాయి. అలాంటి కథాంశాలు సార్వజనీన ఉద్వేగాలతో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి.

4564

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles