చైతూ కనిపిస్తే నేను ఫెయిలైనట్లే!

Tue,April 2, 2019 11:55 PM

హీరో ఇమేజ్‌లను దృష్టిలో పెట్టుకొని తాను కథలు రాయలేనని అన్నారు దర్శకుడు శివ నిర్వాణ. నిజజీవితానుభవాల్ని తెరపై అందంగా ఆవిష్కరించడం అంటే ఇష్టమని చెప్పారు. నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా ప్రతిభను చాటుకున్నారు శివనిర్వాణ. హృద్యమైన ప్రేమకథకు భావోద్వేగాల్ని జోడించి తెరకెక్కించిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం మజిలీ. నాగచైతన్య, సమంత జంటగా నటించారు. ఈ నెల 5న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్‌లో శివనిర్వాణ ఈ చిత్ర విశేషాల్ని పాత్రికేయులతో పంచుకున్నారు. ఆ ముచ్చట్లివి...


మజిలీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది?

దర్శకుడిగా ఒకే జోనర్‌కు పరిమితమై సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. నిన్నుకోరి తర్వాత ప్రేమకథతో కాకుండా ఓ విభిన్నమైన పాయింట్‌తో రెండు కథలు రాసుకున్నాను. కానీ హీరోల డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో అవి వర్కవుట్ కాలేదు. అదే సమయంలో నాగచైతన్య ఫోన్ చేసి నిన్నుకోరి తనకు బాగా నచ్చిందని, తన శైలికి సరిపోయే కథ ఉంటే కలిసి సినిమా చేద్దామని అన్నారు. ఆయన ఇమేజ్, బాడీలాంగ్వేజ్‌కు సరిపోయే కథ అప్పటికీ నా దగ్గర లేదు. ఇరవై రోజుల తర్వాత ఫ్లాష్‌లా మజిలీ కథ నా మనసులో మెదిలింది. అలా ఈ సినిమా ప్రయాణం ప్రారంభమైంది.

ఈ సినిమా నేపథ్యమేమిటి?

క్రికెట్, ప్రేమ, పెళ్లి అంశాలకు మధ్య తరగతి నేపథ్యాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది. క్రికెటర్ అవ్వాలని తాపత్రయపడే 19 ఏళ్ల యువకుడిగా, జీవితంలో ఓటమి పాలై గతంలో బతుకుతూ మదనపడే ముఫ్పైనాలుగేళ్ల వ్యక్తిగా చైతన్య పాత్ర భిన్న పార్శాలతో సాగుతుంది. విఫల ప్రేమ జ్ఞాపకాల నుంచి భర్తను దూరంచేయడానికి నిరంతరం ప్రయత్నించే భార్యగా సమంత కనిపిస్తుంది.

ఈ కథలో మీ జీవితంలో జరిగిన స్వీయ అనుభవాల్ని ఏమైనా చూపించారా?

గతం తాలూకు జ్ఞాపకాల్ని తెరపై అందంగా ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల్ని ఆనాటి రోజుల్లోకి తీసుకెళ్లడం నాకు చాలా ఇష్టం. ప్రతి కథలో నాతో పాటు నా స్నేహితుల జీవితాల్లో చోటుచేసుకున్న అనుభవాల్ని చూపిస్తూ వాటిలోని ఎమోషన్‌తో ప్రేక్షకుల్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటాను. నా సినిమాల్లో ఎక్కడో ఒక చోట స్వీయఅనుభవాలు కనిపిస్తుంటాయి. మన జీవితంలో చోటుచేసుకున్న సన్నివేశాల్ని సీన్‌గా మార్చితే వచ్చే కిక్ బాగుంటుంది.

టీజర్‌లోని వెధవలకే మంచి పెళ్లాలు దొరుకుతారు అనే డైలాగ్ విషయంలో నాగార్జున అసంతృప్తిని వ్యక్తంచేశారని వార్తలు వచ్చాయి?

కావాలని ఆ డైలాగ్‌ను సినిమాలో ఉపయోగించలేదు. పోసాని ధృక్కోణంలో నాగచైతన్య వ్యక్తిత్వాన్ని గురించి చెప్పే సందర్భంలో ఆ సంభాషణ వస్తుంది. ఈ డైలాగ్‌ను నాగార్జున సరదాగానే తీసుకున్నారు.

నాగచైతన్య లాంటి ఇమేజ్ ఉన్న హీరోను భార్య మీద ఆధారపడి బతికే యువకుడిగా చూపించారు. ఆయన పాత్ర ఎంతవరకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నారు?

ఇమేజ్‌ల గురించి ఆలోచించి కథ రాయను. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు పాత్ర కాకుండా నాగచైతన్య కనిపిస్తే నేను ఫెయిలైనట్లే. అలా కాకుండా ఆయన పాత్ర గుర్తుంటే దర్శకుడిగా నేను సక్సెస్ అయినట్లుగా భావిస్తాను.

ద్వితీయవిఘ్నం అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది. దానిని అధిగమిస్తానా? లేదా? అన్న భయం ఉందా?

సెకండ్ సినిమా సెంటిమెంట్ గురించి చాలా మంది చెప్పారు. అలాంటివేమీ ఉండవని నా నమ్మకం. నిన్నుకోరి కంటే ఎక్కువ కష్టపడి ఈ సినిమా చేశాను. ఫ్లాప్ అవుతుందనే భయం లేదు.

రెండు సినిమాలు లవ్‌ఫెయిల్యూర్ కథాంశాలతోనే చేశారు? నిజజీవితంలో మీరు ప్రేమలో ఓడిపోయారా?

నావన్నీ టైమ్‌పాస్ ప్రేమలే. నిన్నుకోరి, మజిలీ సినిమాల్లో చూపించినట్లుగా సీరియస్ కాదు. లవ్‌ఫెయిల్యూర్ సినిమా తీయాలంటే నిజజీవితంలో ప్రేమలో ఓడిపోవాల్సిన అవసరం లేదు. ఇతరుల జీవితాల్లో జరిగిన సంఘటనల్ని చూడగలగడంతో పాటు అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటే సరిపోతుంది.

తదుపరి సినిమా విశేషాలేమిటి?

కామెడీ, యాక్షన్ కథాంశాలతో రెండు కథలు సిద్ధంచేసుకున్నాను. వాటిలో ఏ కథతో సినిమా చేస్తానో తెలియదు. జోనర్‌లతో సంబంధం లేకుండా అన్ని తరహా కథాంశాలతో సినిమాలు చేయాలనుంది.

క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో మీ సినిమాతో పాటు జెర్సీ ఇదే నెలలో విడుదలకానుంది. ఆ సినిమాతో ఏమైనా పోలికలు ఉంటాయని అనుకుంటున్నారా?

జెర్సీతో మా కథకు ఎలాంటి పోలికలు కనిపించవు. జెర్సీ పూర్తిగా క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. మా సినిమా భార్యాభర్తల అనుబంధం నేపథ్యంలో సాగుతుంది.

1938

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles