ఆ పొరపాట్లతో రియలైజ్ అయ్యాను!


Sun,May 5, 2019 03:32 AM

Mahesh Babu reveals Maharshi movie secrets

తెలుగు చిత్రసీమ అగ్ర కథానాయకుల్లో మహేష్‌బాబు ఛరిష్మాయే వేరు. వెండితెరపై ఆయనొక సమ్మోహనాస్త్రం. దక్షిణాది పరిశ్రమలో మెస్మరైజింగ్ స్క్రీన్‌ప్రజెన్స్ ఉన్న హీరోగా మహేష్‌ను అభివర్ణిస్తారు. రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన 25వ చిత్ర మైలురాయిని చేరుకున్నారు. వాణిజ్యపరంగా ఎన్నో అద్భుత విజయాల్ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాశారు. అభిమానుల ప్రేమానురాగాలతో తాను ఈ స్థాయికి చేరుకున్నానని, భవిష్యత్తులో ఉత్తమ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరిస్తారని చెబుతున్నారాయన. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీపైడిపల్లి దర్శకుడు. దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ నిర్మాతలు. ఈ నెల 9న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం మహేష్‌బాబు పాత్రికేయులతో సంభాషించారు.

మహర్షి సినిమా కోసం రెండేళ్లు ఎదురుచూశానని చెప్పారు?

ఈ కథ వినగానే ఏదో తెలియని ఉద్వేగం కలిగింది. నా కళ్లల్లో నీళ్లుతిరిగాయి. జీవన పథంలో రిషి అనే యువకుడు చేసిన భావోద్వేగభరిత ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం. ఇందులో నా పాత్ర మూడు భిన్న పార్శాల్లో సాగుతుంది. ముఖ్యంగా కాలేజీ ఎపిసోడ్ సినిమాకు ఆయువుపట్టులా ఉంటుంది. కాలేజీ నేపథ్య ఘట్టాలు కీలకంగా ఉంటాయి. వాటిని అర్థవంతంగా తెరపై తీసుకురావాలని దర్శకుడు వంశీని కోరాను. ఆ సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి.

కెరీర్‌లో సూపర్‌స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న ఈ తరుణంలో కాలేజీ విద్యార్థి పాత్రలో కనిపించడం ఎలా అనిపించింది?

నేను నటిస్తున్న 25 చిత్రమిది. కెరీర్‌ను ఆరంభించి అప్పుడే రెండు దశాబ్దాలు గడచిపోయాయి. ఈ సమయంలో విద్యార్థి పాత్రలో నటించానంటే కథలో దానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాలేజీ ఎపిసోడ్ 45నిమిషాల వరకు ఉంటుంది. కథాగమనంలో కీలకంగా సాగుతూ సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. కాలేజీ సన్నివేశాల్ని తీర్చిదిద్దిన విధానం చూసి చాలా గర్వపడ్డాను.

సినిమాలో మీ పాత్ర చిత్రణ ఎలా ఉంటుంది?

నా కెరీర్‌లో ఇంతటి బలమైన ఉద్వేగాలు ఉన్న పాత్రను ఎప్పుడూ చేయలేదు. రిషి పాత్రను అంత ఉన్నతంగా తీర్చిదిద్దాడు దర్శకుడు వంశీ. కంటెంట్, ఎమోషన్‌పరంగా ఈ మధ్యకాలంలో తెలుగులో ఇలాంటి సినిమా రాలేదని నిజాయితీగా చెబుతున్నాను. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అందరిని సంతృప్తిపరిచే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి.

శ్రీమంతుడు భరత్ అనే నేను చిత్రాల ఛాయలు మహర్షిలో కనిపించాయంటున్నారు?

పై మూడు సినిమా కథల్లో బలమైన సామాజిక సందేశం ఉంది.
అదే కామన్‌పాయింట్. సోషల్‌మెసేజ్‌తో నాకోసం కథలు సిద్ధం చేస్తున్న దర్శకులకు రుణపడి ఉంటాను. బాధ్యతాయుతమైన కథలతో సినిమాలు చేస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. మహర్షిలో కూడా సమాజపరివర్తనను కాంక్షిస్తూ చక్కటి సందేశం ఉంటుంది.

25వ సినిమాను ప్రత్యేకంగా ప్లాన్ చేసుకోలేదు. అనుకోకుండా జరిగిపోయింది. వంశీ చెప్పిన కథ బాగా నచ్చడంతో ఓ ల్యాండ్‌మార్క్ లాంటి సినిమాకు ఇలాంటి కథే బాగుంటుందని భావించాం.

శ్రీమంతుడు సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మహర్షిలో ఎలాంటి పాయింట్‌ను చర్చించారు?

ఈ కథలో కూడా అంతే ఉన్నతమైన సామాజికాంశం ఉంటుంది. ముందే దాని గురించి వెల్లడిస్తే థ్రిల్ మిస్ అవుతారు. సినిమా చూసిన తర్వాత ఆ పాయింట్ చూసి మీరే ఎక్సైట్ అవుతారు.

తలపాగా కట్టుకొని రైతు పాత్రను పోషించడం ఎలా అనిపించింది?

ఈ సినిమాలో నేను కంపెనీ సీఈఓగా, రైతుగా, విద్యార్థిగా మూడు పాత్రల్లో కనిపిస్తాను. ఈ మూడు పాత్రల కోసం నా లుక్స్‌ను వైవిధ్యంగా డిజైన్ చేశారు. ప్రతి సినిమాలో నేను ఒకే రకమైన గెటప్‌లో కనిపిస్తున్నానని చాలా మంది అంటుంన్నారు. ఈ సినిమాలో మూడు గెటప్స్‌తో కనిపించాను. ప్రేక్షకులకు అవి చాలా కొత్తగా అనిపిస్తాయి.

ఏడాదికి ఒకే చిత్రాన్ని చేస్తున్నారు. ఇకముందైనా సినిమాల వేగాన్ని పెంచాలనుకుంటున్నారా?

ఈ మధ్యకాలంలో నేను ఒక నెల మాత్రమే విశ్రాంతి తీసుకున్నాను. ప్రస్తుతం సినిమాలు చేయడం పెద్ద ఛాలెంజ్. నాన్నగారు 350 సినిమాలు చేశారు. ఇప్పుడు 25 చిత్రాలకే ల్యాండ్‌మార్క్ ఫిల్మ్ అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో పెద్ద సినిమా చేయాలంటే మినిమమ్ 10 నెలల సమయం పడుతున్నది. నాణ్యతతో కూడిన పరిపూర్ణమైన సినిమా ఇవ్వాలంటే టైమ్ తీసుకోవాల్సిందే. నమ్మరు కానీ..సాంకేతికత పెరగడం కూడా సినిమాలు ఆలస్యమవడానికి కారణమవుతున్నది.

సుకుమార్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా ఎందుకు కార్యరూపం దాల్చలేదు. సృజనాత్మకమైన విభేదాలు వచ్చాయని అంటున్నారు?

అలాంటిదేమిలేదు. ఆ టైమ్‌లో దర్శకుడు అనిల్‌రావిపూడి చెప్పిన స్క్రిప్ట్ కరెక్ట్ అనిపించింది. వరుసగా సామాజిక సందేశాలు ఉన్న చిత్రాల్ని చేస్తున్నాను. ఈసారి పూర్తిస్థాయి వినోదభరిత సినిమా చేయాలనుకున్నాను. నా కంఫర్ట్‌జోన్ నుంచి బయటికొచ్చి కొత్తగా ట్రై చేద్దామనుకున్నాను. ఇదే విషయాన్ని సుకుమార్‌గారితో చెప్పాను. ఆయన కూడా ఓకే అన్నారు. తనో సినిమా పూర్తిచేసుకొని మళ్లీ నా దగ్గరకు వస్తానన్నారు. సుహృద్భావపూరిత వాతావరణంలో మేమిద్దరం సినిమా గురించి నిర్ణయం తీసుకున్నాం.

బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమాలు చేస్తానని చెప్పారెందుకని?

బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమాలు చేయాలి. అదొక నియమంగా భావిస్తాను. స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేయకుండా షూటింగ్ దిగడం..ఆ తర్వాత మార్పుల పేరుతో షెడ్యూల్స్‌కు విరామం ఇవ్వడం మంచిది కాదు. ఒక్కసారి షూటింగ్‌లో దిగామంటే స్క్రిప్ట్ విషయంలో చర్చలు ఉండకూడదన్నది నా అభిప్రాయం. నేను గతంలో చేసిన పొరపాట్ల వల్ల రియలైజ్ అయ్యాను. బౌండ్ స్క్రిప్ట్ ఉంటేనే సినిమాకు ఓకే చెప్పాలని నిర్ణయించుకున్నాను. స్పైడర్, బ్రహ్మోత్సవం చిత్రాలు ఇరవై నిమిషాల నరేషన్‌లో బాగానే అనిపించాయి. ఒక్కసారి షూటింగ్‌లో అడుగుపెట్టిన తర్వాత తేడా తెలిసిపోయింది. ఇకముందు అలాంటి తప్పులు పునరావృతం చేయొద్దని నిర్ణయించుకున్నాను.

మహర్షి కథ మనలో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సినిమాలో కథానాయకుడు ఎదుర్కొన్న పరిస్థితులు మనందరికి ఏదో సందర్భంలో తారసపడతాయి. తమ జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి కదా అని ప్రేక్షకులు అనుకుంటారు. అంతటి ఎమోషనల్ కంటెంట్‌తో దర్శకుడు వంశీ కథ రాసుకున్నారు.

యువ దర్శకులతో సినిమాలు చేసే ఆలోచన ఉందా?

చాలా మంది కొత్త దర్శకులు కథలు చెబుతున్నారు. అయితే నా బాడీలాంగ్వేజ్‌కు తగిన కథతో ఎవరూ రావడం లేదు. దాంతో వారి సినిమాల్ని అంగీకరించలేకపోయాను. అంతేకాని నేను కొత్త దర్శకుల్ని ఎంకరేజ్ చేయడంలేదనే విమర్శ సరికాదు.

రాజమౌళిగారితో సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి?

తప్పకుండా రాజమౌళితో సినిమా ఉంటుంది. మా ఇద్దరి కమిట్‌మెంట్స్ పూర్తయిన తర్వాత సినిమా గురించి ఆలోచిస్తాం. అదే సమయంలో త్రివిక్రమ్ కూడా స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో కూడా సినిమా చేసే ఛాన్స్ ఉంది. నాకు చారిత్రక చిత్రాలు చేయాలంటే కొంచెం భయం. రాజమౌళి వంటి దర్శకుడైతే ఆ తరహా చిత్రాలకు న్యాయం చేయగలడని నమ్ముతాను.

ఏఎమ్‌బీ సినిమాస్ మల్టీఫ్లెక్స్ స్టార్ట్ చేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

నా కల నిజమైనట్లనిపించింది. చాలా ఏళ్ల క్రిందటే ఏషియన్ ఫిల్మ్ సునీల్‌నారంగ్‌గారిని కలిసి మల్టీఫ్లెక్స్ గురించి చర్చించాను. ఇండియాలో బెస్ట్ థియేటర్‌గా ఉండాలన్నది నా డ్రీమ్. సాంకేతికంగా అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని కోరుకున్నాను. సునీల్‌గారు నా కలను నిజం చేశారు. చాలా మంది సెలబ్రిటీలు అక్కడికొచ్చి సినిమాలు చూస్తున్నారు. నేను కూడా అవెంజర్స్ సినిమా చూద్దామనుకుంటున్నాను. ఏఎంబీలో టిక్కెట్లు అడిగితే షోలు ఖాళీగా లేవని చెప్పారు (నవ్వుతూ). త్వరలో ఆ సినిమా చూస్తా.

ఇటీవల మీ మైనపు విగ్రహాన్ని ఏఎంబీ సినిమాస్‌లో ప్రదర్శించడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

ఆ వేడుకలో నా కూతురు సితార పాప రియాక్షన్ మాత్రం అద్భుతంగా అనిపించింది. ఏదో విగ్రహం ఉంటుందిలే అనుకుంది కానీ...ఆ బొమ్మని చూడగానే సితాపాప ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యానికిలోనైంది. ఆ రోజు సితార పాప ప్రదర్శించిన హావభావాలు వెలకట్టలేనివనుకుంటున్నాను.
Maheshbabu1
మే 9 చాలా మ్యాజికల్ తేది. ఆ రోజు మహర్షితో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టబోతున్నాం. ఇక నుంచి నా సినిమాలన్నింటిని అభిమానులు మే నెలలో విడుదల చేయాలని అంటారేమో (నవ్వుతూ). నాన్నగారు కూడా మహర్షి సినిమా విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు.

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మల్టీస్టారర్ సినిమాల చేయలేదు..?

ఆ సినిమా తర్వాత నాకు నచ్చిన మరో మల్టీస్టారర్ స్క్రిప్ట్ రాలేదు. మల్టీస్టారర్ చేయడం మామూలు విషయం కాదు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కథ దొరికితే ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో సంతోషంగా సినిమా చేస్తా.
మహర్షి థియేట్రికల్ రైట్స్ 120కోట్లకు పైగా అమ్ముడుబోయాయని తెలిసింది. సోలో హీరోగా అంతటి కమర్షియల్ వాల్యూని సాధించడం ఎలా అనిపిస్తున్నది?
చాలా గర్వంగా అనిపిస్తున్నది. అదే సమయంలో లోలోన కొంచెం భయం కూడా ఉంది. ఓ సినిమా థియేట్రికల్ రైట్స్ 120కోట్లకు అమ్ముడుపోయాయంటే.. సినిమా 140కోట్లకు పైగా వసూళ్లు రాబడితేనే విజయం సాధిచింనట్లు. అప్పుడే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఆనందంగా ఉంటారు. కాబట్టి మహర్షి చిత్రం తప్పకుండా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మీ 25 సినిమాల ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ కొందరు దర్శకుల్ని విస్మరించారనే విమర్శలొచ్చాయి?

ప్రీరిలీజ్ వేడుకకు ముందే నేను యూరప్ ప్రయాణాన్ని ముగించుకొని రావడంతో కొంచెం బడలికగా ఉన్నాను. మరోవైపు స్టేజీ మీద అభిమానుల హంగామా. ఆ ఒత్తిడిలో కొందరు దర్శకుల పేరు ప్రస్తావించడం మర్చిపోయాను. అది నా తప్పే అని ఒప్పుకుంటున్నాను. పోకిరి నన్ను సూపర్‌స్టార్‌ను చేసింది. అందుకు దర్శకుడు పూరి జగన్నాథ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 1 నా కెరీర్‌లో ఓ కల్ట్‌మూవీ. ఆ చిత్ర దర్శకుడు సుకుమార్‌కు కూడా థాంక్స్ చెప్పాలి. ఆ సినిమాలో నేను నా తనయుడితో పనిచేసే అదృష్టం దక్కింది. సుకుమార్‌గారు నా అభిమాన దర్శకుల్లో ఒకరు. ప్రీరిలీజ్ వేడుకలో దర్శకుడు వంశీ గురించి చెబుతూ స్క్రిప్ట్ దగ్గరపెట్టుకొని వంశీ రెండేళ్లు వెయిట్ చేశాడు. ఈ రోజుల్లో ఎవరూ రెండు నెలలు కూడా అలా చేయరు అన్నాను. ఆ వ్యాఖ్యలు కేవలం వంశీని ప్రశంసించడానికే తప్ప సుకుమార్‌గారి వైపు వేలుచూపించడానికి కాదు. కొందరు దీనిపై తప్పుడు వార్తలు రాశారు. సుకుమార్ నాకెంతో ఆప్తమిత్రుడు. భవిష్యత్తులో మేమిద్దరం తప్పకుండా కలిసి పనిచేస్తాం. మా ఇద్దరి విషయంలో అనవసరంగా అయోమయాన్ని సృష్టించారు.

1704

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles