మహేష్ మేనల్లుడి చిత్రం షురూ

Mon,November 11, 2019 12:23 AM

గల్లా జయదేవ్‌తో చాలా కాలంగా పరిచయముంది. తనయుడు అశోక్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఆయన ఈ సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది అని అన్నారు హీరో రామ్‌చరణ్. సీనియర్‌హీరో కృష్ణ మనవడు, గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా కథానాయకుడిగా పరిచయమవుతున్న నూతన చిత్రం ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై పద్మావతి గల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రామ్‌చరణ్ క్లాప్‌నివ్వగా, రానా కెమెరా స్విఛాన్ చేశారు. కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. గల్లా జయదేవ్ మాట్లాడుతూ సృజనాత్మక రంగంలో కొత్తదనాన్ని ప్రోత్సహించాలనే ఆలోచనతో అమర్‌రాజా మీడియా సంస్థను స్థాపించాం. ఈ సంస్థ ద్వారా మా అబ్బాయి అశోక్ గల్లాను హీరోగా పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది. అన్ని వర్గాల్ని అలరించేలా దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తీస్తారనే నమ్మకం ఉంది. నటన, సినీ పరిశ్రమ పట్ల ఇష్టంతో అశోక్ అమెరికాలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు.


నటనలో శిక్షణ తీసుకొని ఈ సినిమా చేస్తున్నాడు అని తెలిపారు. పద్మావతి మాట్లాడుతూ నాన్న కృష్ణ రూపొందించిన పండంటిసంసారంతో పాటు మహేష్‌బాబుతో కలిసి నాని సినిమాలో అశోక్ నటించాడు. యంగ్ టీమ్ ఈ సినిమాకు కుదరడం ఆనందంగా ఉంది అని తెలిపింది. కంటెంట్ ప్రధాన చిత్రాలతో హీరోగా అశోక్ కొత్త ట్రెండ్‌ను సృష్టించాలని ఎంపీ రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. అశోక్‌కు హీరోగా ఈ చిత్రం మంచి పేరును తెచ్చిపెట్టాలని గల్లా అరుణకుమారి చెప్పింది. అశోక్‌ను హీరోగా చూడాలని అతని తల్లి పద్మావతి కన్న కల వల్లే ఈ సినిమా కార్యరూపం దాల్చింది. విభిన్నమైన కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రతి ఒక్కరిని సర్‌ప్రైజ్ చేస్తుంది అని దర్శకుడు శ్రీరామ్‌ఆదిత్య చెప్పారు. దర్శకుడు తనకు శుభారంభాన్ని అందిస్తాడనే నమ్మకం ఉందని, సోమవారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుందని అశోక్ గల్లా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేశినేని నాని, జేసీ దివాకర్‌రెడ్డి, నన్నపనేనిరాజకుమారి, అమల, నమ్రతశిరోద్కర్ తదితరులు పాల్గొన్నారు.
Krishna

673

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles