విమర్శల్ని స్వీకరిస్తున్నాం!


Sat,May 11, 2019 12:03 AM

maharshi success celebrations

మహేష్‌బాబు కెరీర్‌లో మహర్షి చిత్రం మైలురాయిలా నిలుస్తుంది. తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లను సాధిస్తుందనే నమ్మకం ఉంది అని అన్నారు దిల్‌రాజు. మహేష్‌బాబు, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి. వంశీపైడిపల్లి దర్శకుడు. దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ నిర్మాతలు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిరోజు తెలుగు రాష్ర్టాల్లో ఈ చిత్రం 24.6 కోట్ల షేర్‌ను సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దిల్‌రాజు మాట్లాడుతూ మహేష్ సినీ ప్రయాణంలో అత్యధిక ప్రారంభ వసూళ్లను సాధించిన చిత్రమిది. మంచి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి రుజువుచేసింది. నైజాంలో నాన్‌బాహుబలి రికార్డులను అధిగమించింది. మరికొన్ని ప్రాంతాల్లో వసూళ్ల పరంగా మొదటి, రెండో స్థానాల్లో నిలిచింది. నెల్లూరులో శుక్రవారం రోజు తొమ్మిది థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. కమర్షియల్‌గా ఈ సినిమా మరో స్థాయికి వెళ్లనుందనడానికి ఈ వసూళ్లు నిదర్శనం. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాం అని అన్నారు.

చిరు ప్రశంసల్ని మర్చిపోలేను
దర్శకుడు వంశీపైడిపల్లి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి మనసుల్లోకి వెళ్లి వారిలో ఆలోచనల్ని రేకెత్తించే మంచి కథాంశమిది. సినిమాపై వస్తున్న విమర్శల్ని స్వీకరిస్తున్నాను. తదుపరి సినిమా విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడానికి అవి ఉపకరిస్తాయి. మనిషిలో ఉండే అంతర్లీన, బాహ్య అంశాలను సినిమాలో ఆవిష్కరించాం. కుటుంబం, కెరీర్, ప్రేమలో విజయాన్ని సాధించడం కోసం సాగించిన పోరాటాన్ని హృద్యంగా చూపిస్తూనే మన మనుగడకు కారణమైన రైతుల్ని ఎలా విస్మరిస్తున్నామనే అంశాన్ని సందేశాత్మక కోణంలో చూపించాం. తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని గెలుపు కోసం ప్రయత్నించే ఓ కొడుకు కథ ఇది. స్నేహం, ప్రేమ, కుటుంబవిలువల కలబోతగా రూపొందిన ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.

వినోదంతో పాటు చక్కటి సామాజిక ఇతివృత్తంతో మంచి సినిమాను తెరకెక్కించామని ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. తల్లీకొడుకుల అనుబంధంతో మహిళా ప్రేక్షకులు సహానుభూతి చెందుతున్నారు. సినిమా విజయంపై మహేష్‌బాబు పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేయడం ఆనందంగా ఉంది. ఫోన్ ద్వారా చిరంజీవి అందించిన ప్రశంసల్ని మర్చిపోలేను అని తెలిపారు. గొప్ప సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నానని పూజాహెగ్డే చెప్పింది. కమర్షియల్ హంగులతో పాటు చక్కటి సందేశం ఉన్న సినిమా ఇదని, అందరిని అలరించే ఎమోషన్స్ ఉన్నాయని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పేర్కొన్నారు.

1185

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles