హలం పట్టిన మహర్షి


Wed,March 13, 2019 12:01 AM

maharshi chennai schedule wrapped hyderabad shoot started

ఉన్నత భావాలు కలిగిన యువకుడతను. వ్యవసాయం అంటే మక్కువ ఎక్కువ. అగ్రికల్చరే నిజమై కల్చర్ అని బలంగా విశ్వసిస్తుంటాడు. నేల తల్లిని నమ్ముకుంటే ఏ లోటు ఉండదనేది అతని నమ్మకం. దీంతో పల్లెబాట నడిచి హలం పట్టుకుంటాడు. అలాంటి యువకుడి జీవిత ప్రయాణం ఏమిటన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది అంటున్నది చిత్రబృందం. మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీపైడిపల్లి దర్శకుడు. దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ నిర్మాతలు. పూజాహెగ్డే కథానాయిక. మహేష్‌బాబు నటిస్తున్న 25వ చిత్రమిదే కావడంతో నిర్మాణదశ నుంచే ఆసక్తినిరేకెత్తిస్తున్నది. ఇటీవలే చెన్నైలో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం హైదారాబాద్‌లో షూటింగ్ జరుగుతున్నది. ఈ షెడ్యూల్ తర్వాత ఈ నెలాఖరులో దుబాయ్‌లో రెండు గీతాల్ని తెరకెక్కించబోతున్నారు.

దీంతో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. ఈ చిత్రంలో మహేష్‌బాబు కాలేజీ విద్యార్థిగా, రైతుగా విభిన్న కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తారని సమాచారం. కొద్దినెలల క్రితం పొల్లాచ్చిలో మహేష్‌బాబు వ్యవసాయం చేస్తున్న కొన్ని కీలకఘట్టాల్ని తెరకెక్కించారు. కుటుంబ విలువల ఔన్నత్యాన్ని, రైతు గొప్పదనాన్ని తెలియజెప్పే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇందులో మహేష్‌బాబు స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నాడు. వేసవి కానుకగా మే 9న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాల్ని అందిస్తున్నారు.

1852

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles