మాభూమి:వెండితెరపై మహత్తర తెలంగాణ


Sun,March 22, 2015 12:01 AM

mabhoomi: Telangana of the most striking the screen

Bhoomi


1955లో

సత్యజిత్‌రే మొదలుపెట్టిన నవ్య సినిమా ఉద్యమం భారతీయ సినిమాపై చెరగని ప్రభావం చూపడమే గాక ప్రపంచ వేదికలు కూడా మన సినిమాలకు అఖండ కీర్తి శిఖరాలను తెచ్చి పెట్టాయి. ఈ క్రమంలో దక్షిణాన అరవిందన్, ఆదూర్, శ్యాంబెనగల్ ఎం.టి. వాసుదేవ నాయర్ వంటి వారు సమాంతర సినిమా ఉద్యమాన్ని ప్రారంభించి మూస సినిమాకు భిన్నంగా స్వయంవరం, అంకుర్, నిర్మాల్యం వంటి సినిమాలు తీసి ఆ తరాన్ని ప్రభావితం చేశారు. అందులోంచి పుట్టుకు వచ్చిన వారే మాభూమి బృందం.

సత్యజిత్‌రే తరువాత భారతీయ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన వారు మృణాళ్ సేన్. ఆయన 1954 నుండి బెంగాలీ సినిమాలు తీస్తూ 1976లో హిందీలో తొలిసారిగా మృగయా తీసి జాతీయ అవార్డు సాధించారు. అప్పటికే మన వాళ్లు ఏదైనా న్యూ సినిమా తీద్దామని వెళ్లి మృణాళ్‌ను కలుసుకున్నారు. వారి కోసం మృణాళ్ 1977లో ఒక వూరి కథ తీశారు. అయితే, ఆ సినిమా చాలా కారణాల వల్ల ప్రజలకు చేరువ కాలేదు. కానీ, చాలా అవార్డులు వచ్చాయి.

ఎప్పుడైతే ఒక వూరి కథ వచ్చిందో తెలుగులో సీరియస్ సినిమాలు తీయవచ్చని మనోళ్లకి నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతో బి.నరసింగరావు, జి.రవీంద్రనాథ్ అనే యువనిర్మాతలు ధైర్యంగా ముందడుగు వేసి తీసిన చిత్రం మాభూమి. తెలుగు సినిమాలో ఒక మైలురాయిగా నిలిచిన సినిమా మాభూమి.
బి.నరసింగరావు కవి, రచయిత, పేయింటర్, నటుడు. వీటికి మించి అభ్యుదయ భావాలున్నవారు. ఇక, రవీంద్రనాథ్ -సారథి స్టూడియోస్ అధినేతల్లో ఒకరు. మృణాల్ తీసిన మృగయా, ఒక వూరి కథ నిర్మాణంతో సంబంధమున్నవారు కూడా. వీరిద్దరూ కలిసి వెళ్లి తమకోసం ఒక తెలుగు సినిమా తీసి పెట్టండని మృణాళ్‌ను అడిగారు. తనకప్పుడు వీలు కాదని, బెంగాల్‌లో గొప్ప డాక్యుమెంటరీలు తీస్తున్న గౌతంఘోష్‌ను పరిచయం చేసి జత కలిపాడు.

గౌతం

యువకుడు. అప్పటికే డాక్యుమెంటరీ ఫిలిం మేకర్‌గా ది ఎర్త్, హంగ్రీ ఆటం తీసి అంతర్జాతీయ ఖ్యాతి అందుకున్నారు. ఫిలిం నిర్మాణంలో సీరియస్‌నెస్ ఉన్నోడు. ఇది మనవాళ్లకు కలిసివచ్చింది. అప్పటికే కిషన్ చందర్ రాసిన జబ్ ఖేత్ జాగే ఉర్దూ నవలను ఎంచుకున్న నరసింగరావు బృందంతో కలిసేందుకు, స్క్రిప్టు సిద్ధం చేసుకొని దర్శకుడిగా హైదరాబాదులో దిగేశాడు గౌతం. సినిమా తీసేందుకు తగిన పరిస్థితుల అధ్యయనం, అవగాహన చేసుకోవడానికి నల్గొండ, మెదక్, వరంగల్ జిల్లాల్లో తిరిగారు. ఆయనకు ఉర్దూ రావడం వల్ల కథలోని ఆత్మను పట్టుకున్నారాయన. తెలంగాణ పల్లె జీవనం ఎలా ఉంటుందో అని పరిశీలించడానికి పొద్దున లేచి వాకిళ్ల ముందు కాపలా కాసేవారు. జనాల కట్టు, బొట్టు, ఆహార్యం, అలవాట్లను సన్నిహితంగా అవగాహన చేసుకున్నాక స్క్రిప్టును తిరగరాసుకున్నారు.

మాభూమిలో

కథా నాయకుడు రామయ్యగా త్రిపురనేని గోపీచంద్ కొడుకు సాయిచంద్, తండ్రి వీరయ్యగా కాకరాల, జమీందార్‌గా ఎంబీవీ ప్రసాదరావు, పట్వారీగా లక్ష్మణ్‌రావు (ఈ నెల 6న కన్నుమూశారు) లంబాడి చంద్రిగా మరాఠి నటి హంస, ఇంకా నరసింగరావు, గద్దర్, భూపాల్‌రెడ్డి, రామిరెడ్డి, విజయప్రకాశ్, మాస్టర్ సురేశ్, యాదగిరి, రాజగోపాల్, రాజేశ్వరి, శకుంతల, పోచమ్మ, సూర్యకుమారి, రమణి తదితరులు నటీనటులు. బి.నరసింగరావు, ప్రాణ్‌రావ్‌లు సంభాషణలు రాశారు. సినిమాలో తెలంగాణ యాసలో రాసిన మాటలు సినిమాకు మనదైన కళను తెచ్చాయి. సహజ జానపద స్వరాలతో సంగీతం చేసింది వింజమూరి సీతాదేవి. గద్దర్ పాడిన, బండి యాదగిరి రాసిన బండెనక బండికట్టి నేటికీ తెలంగాణ జనజీవన గీతమే. సుద్దాల హనుమంతు రాసిన పల్లెటూరి పిల్లగాడ పసులగాసె మొనగాడ పాట సంధ్యనోట జీవం పోసుకున్నది. పొడలా పొడలా గట్లా నడుమ పాట కూడా మరవదగనిది కాదు. సినిమాటోగ్రఫీ నిర్వహించింది కమల్‌నాయక్. వైకుంఠం కళ, డి.రాజగోపాల్ ఎడిటింగ్ నిర్వహించారు. కాస్ట్యూమ్స్ గౌతం గర్ల్‌ఫ్రెండ్ నీలాంజన చేశారు. (అప్పటికి వారిద్దరికి పెళ్లి కాలేదు). చైతన్య చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్‌పై చిత్ర నిర్మాణం జరిగింది.

సినిమా

షూటింగ్ మెదక్ జిల్లాలోని మంగళపర్తి, దొంతి, దౌల్తాబాదు గ్రామాలతో బాటు మెదక్‌లో సుమారు 50 రోజుల పాటు జరిగింది. ప్రధాన పాత్రధారులు విడిగా కనిపించకుండా జనంలో ఒకరుగా కనిపించడం చిత్రీకరణలో ప్రత్యేకత. గ్రామస్థులుగా చాలా మటుకు నిజమైన ఊరి జనమే నటించారు. కేవలం 5.5 లక్షల చిన్న బడ్జెట్‌లో భారీ కాన్సెప్ట్‌తో నిర్మాణమైన సినిమా మాభూమి. దొరల మీద దాడి లాంటి సీన్లలో ప్రజలు నటించడం కాదు అంతా జీవించారనే అనాలి. దొంతిలో గడిని ముట్టడించే సీన్ తీసే నాటికి వాళ్లేమనుకున్నారో గాని ఆ సీన్ తీయడానికి ఒప్పుకోలేదు. గేటు వేసుకున్నారు. ఐనా అంతా రెడీ అయింది. అనుమతి లేకుండానే జనం ఆగ్రహంతో ఉరికి వస్తుంటే సెట్ చేసుకున్న కెమెరాలతో గడి తలుపులు బద్దలు కొడుతున్న షాట్‌ను చిత్రీకరించారు. చిత్రీకరణలో చారిత్రక సంఘటనలు చూపించేటప్పుడు అప్పటి వార్తా పత్రికల లైబ్రరీ షాట్స్‌ని వాడటంతో సినిమా స్థాయి మరింత పెరిగింది.

సినిమా అంతా మూడు షెడ్యూల్స్‌లో పూర్తయింది. చెన్నైలో డబ్బింగ్‌లో బి.గోపాలం సహాయం చేశారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గౌతం ఘోషే చేశారు. పాటలన్నీ హైదరాబాదులోని జర్మన్ లైబ్రరీలో రికార్డు చేశారు. బండెనక బండికట్టి మొదట బి.నర్సింగరావుపై చిత్రీకరించినా ఆ తరువాత గద్దర్‌పైనే చిత్రీకరించారు. సినిమా పూర్తయి సెన్సార్‌కి వెళ్లింది. ఏమవుతుందోననే భయం. కానీ, వారంతా పిలిచి అభినందించి సర్టిఫికెట్ ఇచ్చారు. విడుదల చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరూ ముందుకు రాలేదు. చూసిన వారంతా ఇదేదో రాజకీయ పాఠాలు చెప్పినట్లుగా ఉందని వెనక్కివెళ్లి పోయారు.

చివరికి లక్ష్మీ ఫిలింస్, శ్రీతారకరామా ఫిలింస్ వారు రిలీజ్ చేశారు. ఆ రోజు 1980 మార్చి 23. విడుదలైన చోటల్లా హౌస్‌ఫుల్. టికెట్స్ దొరక్క థియేటర్ల వద్ద జనం గుంపులు గుంపులు. థియేటర్లు ఈలలు డ్యాన్సులతో మారు మోగాయి. అదో గొప్ప చారిత్రాత్మక విజయం. ప్రజలు ఇండియన్ ఆర్మీ దళాలపై పోరాటం చేసిన చారిత్రిక వాస్తవాన్ని దృశ్యమానం చేసిన తొలిచిత్రం మాభూమినే. ఇందులోని పాత్రలన్నీ సహజమైన గ్రామీణ భాషను, ముస్లిం పాత్రలు హైదరాబాదీ ఉర్దూలో మాట్లాడుతై. ఈ సినిమా రాకతో తెలుగు సినిమాకు మంచి రోజులు రానున్నాయని పత్రికలు రాశాయి కూడా. మరోవైపు మాభూమికి తిరుగుబాటు సినిమా ముద్రవేసి ఎస్.పి.స్థాయి పోలీసు అధికారులు థియేటర్ల వద్దకెళ్లి సినిమా బాక్స్ ఎంత కొన్నావ్. పెట్టుబడి వచ్చిందా? వస్తే రేపే తీసేయ్ అని బెదిరించేవారు. అట్లా-పరోక్షంగా సినిమాను బ్యాన్ చేసే యత్నాలు జరిగాయి. బయట అంతా నక్సలైట్ సినిమా అనే ప్రచారం చేశారు. అవేవీ సినిమా విజయాన్ని ప్రజాదరణను ఆపలేకపోయాయి. మాభూమిలోని ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో సినిమా ఉంది. ఆ తరువాత తీసిన రంగుల కల, దాసి, మట్టి మనుషులు, డాక్యుమెంటరీలు అందులోంచి వచ్చినవే అంటారు

సినిమా ఏడాది పాటు ఏకబిగిన ఆడింది. స్వర్ణోత్సవాలు జరుపుకుంది. ద్వితీయ ఉత్తమ చిత్రంగా, స్క్రీన్‌ప్లేకు గాను నంది అవార్డులు అందుకున్న మాభూమి ఇండియన్ పనోరమాకూ ఎంపికైంది. రాజకీయ కారణాల వల్ల జాతీయ అవార్డు రాలేదు. అయితే, ఫిలింఫేర్, హెరాల్డ్ అవార్డులతో బాటు కేన్స్, ట్రివేండ్రమ్, కార్ల్ వివరీ, కైరో, సిడ్నీ, తాష్కెంట్ ఫిలింఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది.

ఏ విధంగా చూసినా

వెండితెరపై తెలంగాణ మట్టి వాసనకు దృశ్యరూపం ఇచ్చిన సినిమా మాభూమి. ప్రజల పోరాటానికి, చరిత్రకు, సాంస్కృతిక భాషకు సినిమా పరిభాష మా భూమి. ఒకనాటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని సహజమైన నలుపు తెలుపులో అద్భుతంగా ఆవిష్కరించిన మాభూమి తెలంగాణ భూమికకు మహత్తర వెండితెర కానుక. భారతీయ సినిమా రంగంలో, ప్రజల సినిమా చరిత్రలో మా భూమి ఒక సంచలనం. ఒక అధ్యాయం, ఒక మైలురాయి అంతే...అంతే...అంతే.

ఎప్పటికీ మాభూమి రామయ్యనే!


Sai


మాభూమి సినిమా నా జీవితంతో పెనవేసుకుపోయింది. అంతా నిన్న మొన్న జరిగినట్లుగా ఉంది. నా జీవితం మాభూమికి ముందు, తర్వాతగా అన్నట్లుగా మారింది. మరో మాటలో మాభూమి నా జీవితంలో ఒక అద్భుతం. ఆ సిండ్రోమ్‌లోనే ఉండిపోయాను. అందుకే- అప్పటికి ఇప్పటికి ఎప్పటికి మాభూమి రామయ్యగానే ఉండిపోతాను. ఈ సినిమా చిత్రీకరణ అంతా సహజంగా జరిగింది. అందుకోసం 1940ల నాటి వాతావరణం ఉట్టిపడేలా వున్న మంగళపర్తిలో సినిమా తీశారు. కరెన్సీ దగ్గర్నుంచి అన్నీ ఆ కాలం నాటివే వాడారు. అవే కాస్టూమ్స్. ముందు రామయ్య పాత్ర పోషించగలనా? అని భయపడ్డాను. ఆ బాధ్యత మాది అని నర్సింగ్, గౌతం అన్న మాటలు నిజమే అయ్యాయి. వారిద్దరూ థియేటర్ నుంచి వచ్చిన వారవడం వల్ల వారిద్దరు ప్రతీది చేసి చూపేవారు. దాంతో నాకు నటించడం ఈజీ అయిపోయింది. రామయ్య పాత్రలో లీనమయ్యాను.


చరిత్రలో ఒక్కసారే జరుగుతుంది!


bnarsingarao


నేను చాలా కాలం నాటక రంగంలో పని చేసిన తర్వాత 1977లో కొత్తగా ఏమైనా చేయాలనుకున్నప్పుడు సినిమా ఆలోచన వచ్చింది. నా మిత్రుడు జి.రవీంద్రనాథ్, నేనూ వెళ్లి మృణాల్‌ని అడిగాం. కానీ, ఒక లక్ష బడ్జెట్‌లో తనకు సాధ్యం కాదని, కలకత్తాకు చెందిన గౌతంఘోష్‌తో డైరెక్ట్ చేయించుకోమని ఆయనే సూచించారు. కలకత్తాలో బెంగాల్ జర్నలిస్ట్ అసోసియేషన్ అవార్డుల సభలో మొదటిసారి గౌతంను కలుసుకున్నాం. విచిత్రమేమిటంటే ఆ సభలో సత్యజిత్‌రే పక్కనే నా సీటు. అనిర్వచనీయ అనుభూతి. ముగ్గురం కిషన్ చందన్ నవల జబ్ ఖేత్ జాగే కథతోనే సినిమా చేయాలనుకున్నాం. తరువాత నవల బేస్‌గా గౌతం ఏదో ట్రీట్‌మెంట్ రాసుకుని హైదరాబాద్‌కు వచ్చేశాడు. అది సరిగ్గా నచ్చక మొత్తం తెలంగాణలోని కడవెండి, బాలముల, సూర్యాపేట్, వరంగల్ వంటి ప్రాంతాలను సందర్శించి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వారితో ఇంటర్వ్యూలు, ఫొటోలు, రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, సుందరయ్య, బసవ పున్నయ్య, రాసుకున్నవి-ఇతర 20, 30 పుస్తకాలు, క్రానికల్, గోలకొండ, మీజాన్ ప్రెస్ రిపోర్టులు అట్లా అదో పెద్ద రీసెర్చ్ వర్క్ చేశాం. అప్పుడు రాసుకున్న స్క్రిప్టుతో సినిమా సెట్స్ మీదికెళ్లాం.

నటీనటులు

, టెక్నీషియన్లు అంతా కొత్త వాళ్లమే. మొదటిరోజు అందరం లారీలో వెనుక తాట్‌పాల్ మీద కూర్చుని షూటింగ్ వెళ్లాం. అప్పటికే అల్వాల్ బ్రాంచ్ సిండికేట్ బ్యాంక్‌లో మా ఇల్లును కుదువపెట్టి లక్ష రూపాయల లోన్ తీసుకున్నాను. మెదక్‌జిల్లా మంగళపర్తిలో షూటింగ్ ప్రారంభించాం. రోజూ షూటింగ్‌లో కిందపడి దెబ్బలు తాకేవి. సాధారణ జనంలోనే కొందరిని ఎంపిక చేసుకొని వాళ్లకు శిక్షణ ఇచ్చి, కొత్త చీరలు, రుమాల్లు, పంచెలు వాళ్లకిచ్చి- పాతవి తీసుకుని షూటింగ్స్‌లో వాడేవాళ్లం. నర్సాపూర్ తాలూకా దొంతి గడిలో దాడి చేసే దృశ్యం తీయడం అదో గొప్ప అనుభవం. సినిమా విడుదలై జైత్రయాత్ర చేసింది. అభినందనల్లో తడిసి ముద్దయిపోయాము. వెళ్లిన చోటల్లా సభలు, సమావేశాలు, అభినందనలు. మహబూబ్‌నగర్‌లోనైతే మాకు పోలీస్ సెల్యూట్ ఇచ్చారు.

Goutam


ఒకసారి సారస్వత పరిషత్తులో ఏదో సభ. ఒకాయన చాలాసేపు నా చుట్టూ తిరుగుతున్నాడు. నేనే అడిగాను. ఏమిటండి విషయం అని. ఏమీ లేదండి, నేను మీ మాభూమి 22 సార్లు చూశాను అన్నాడు. ఇంకొకాయన 40 సార్లు చూశానని చెప్పాడు. అప్పట్లో అదొక క్రేజ్. ఇప్పటికీ మాభూమి నిర్మాత నర్సింగరావు అనే గుర్తింపు గర్వంగా అనిపిస్తుంది.

సినిమాకు

పేరేం పెట్టాలని అనుకున్నప్పుడు జైత్రయాత్ర, ఇంకా ఏదో అనుకున్నా, కానీ, అదంతా నాటకీయంగా ఉంటుందని, భూమి కోసమే పోరాటం జరిగింది కదా! మాభూమి అంటే సరిపోతుంది అని నేనే ఆ పేరు పెట్టాను. ఆ పేరు చాలా పాపులర్ అయింది. పొలిటికల్ ఓరియెంటెడ్ హిస్టారికల్ చిత్రంగా మాభూమిలో సెమీ డ్రామా, సెమీ డాక్యుమెంటేషన్, మాంటేజెస్, ఫిక్షనల్ ఎలిమెంట్స్ స్పష్టంగా కనిపిస్తాయి. అవన్నీ జీవితానికి దగ్గరగా ఉంటాయి. చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం ఒకసారే జరిగింది. అలాగే మాభూమి సినిమా నిర్మాణం కూడా.


సమిష్టి ఫలితం మాభూమి


జీవితంలో నేనేమైనా మంచి పనిచేశానంటే అది మాభూమి సినిమా తీయడం. మాభూమి తీసిన ఆ రెండేళ్లు ఒక యజ్ఞంలా భావించాం. రెండో పనిలేదు. ఎందరో ఈ మహా యజ్ఞంలో తోడ్పడ్డారు. ముఖ్యంగా నా భార్య. సినిమా విడుదలైన మూడో రోజు ఆదివారం-మాకు యజ్ఞఫలం దక్కింది. సుదర్శన్ టాకీస్‌లో టిక్కెట్ల కోసం పెద్ద దాడే జరిగింది. సినిమా అంతగా సక్సెస్ అవుతుందని గౌతమ్ గానీ, నర్సింగ్ గానీ ఊహించి ఉండలేదు. కానీ, మాభూమి అపూర్వ విజయం సాధిస్తుందని నేను ముందు నుంచి నమ్మాను.

maabhoomi


సినిమా

తీసినంతకాలం ఏరోజు కారోజు డబ్బులు వెదుక్కుని సెట్స్‌మీది కెళ్లేవాళ్లం. ఇందుకు అమ్మవలసినవన్నీ అమ్మేశాను. సినిమా పూర్తయింది. సెన్సార్ చేయించాలి. చివరికి భద్రంగా దాచుకున్న వెడ్డింగ్ రింగ్స్ కూడా అమ్మేశాను. వచ్చిన ఏడొందల రూపాయలతో సెన్సార్ చేయించాను. అవన్నీ తలుచుకుంటే భావోద్వేగం తన్నుకువస్తోంది. వందలాదిమందిమి కలిసి పనిచేశాం. ఒక్కమాటలో సమిష్టి కృషి ఫలితమే మాభూమి. ఇతివృత్తమూ, నిర్మాణమూ అంతానూ ప్రజల సినిమా గనుకే మాభూమి చరిత్ర సృష్టించింది.

6336

More News

VIRAL NEWS