మా అధ్యక్షుడిగా నరేష్

Tue,March 12, 2019 03:23 AM

మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ (మా) కార్యవర్గ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ప్రాంగణంలో ఉత్కంఠభరితంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నరేష్ గెలుపొందారు. 69ఓట్ల ఆధిక్యంతో ఆయన తన ప్రత్యర్థి శివాజీరాజాపై విజయం సాధించారు. నరేష్‌కు 268ఓట్లు లభించగా, శివాజీరాజాకు 199ఓట్లు వచ్చాయి. జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజశేఖర్, ఉపాధ్యక్షులుగా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ, కోశాధికారిగా రాజీవ్ కనకాల, జాయింట్ సెక్రటరీలుగా గౌతమ్‌రాజు, శివబాలాజీ ఎన్నికయ్యారు. ప్యానల్‌తో సంబంధం లేకుండా హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకోవడం విశేషం. ఇక కార్యవర్గ సభ్యులుగా అలీ, రవిప్రకాష్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వి, జాకీ, సురేష్ కొండేటి, అనితాచౌదరి, అశోక్‌కుమార్, సమీర్, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటే కల్యాణి, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు.
Maa-1
గతకొంతకాలంగా మాలో చోటుచేసుకున్న వివాదాల నేపథ్యంలో ఈ ఏడాది ఎన్నికలకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది. మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి శివాజీరాజా, నరేష్ హోరాహోరిగా పోటీపడ్డారు. వీరిద్దరి నేతృత్వంలోని రెండు ప్యానల్స్ మధ్య పోటీ రసవత్తరంగా సాగింది. మాలో మొత్తం 745 ఓట్లకు గాను 472 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటివరకు జరిగిన మా ఎన్నికలతో పోల్చితే ఈ స్థాయిలో ఓటింగ్ జరగడం ఇదే ప్రథమం. సినీరంగానికి చెందిన ప్రముఖులందరూ తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించగా, ఈ దఫా బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికల్ని నిర్వహించారు. దాంతో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాతే ఫలితాలు వెల్లడయ్యాయి.

1985

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles