ఇట్లు.. ప్రేమతో.. మీ అభిమాన హీరో!

Tue,February 5, 2019 11:57 PM

సినీ పరిశ్రమలోనే కాదు ఏ రంగంలోనైనా జయాపజయాలు దోబూచులాడుతుంటాయి. విజయాల్ని ప్రతి ఒక్కరూ గర్వంగా స్వీకరిస్తుంటారు. అయితే అపజయాల విషయంలో చాలా మందిలో దాటవేసే ధోరణి కనిపిస్తుంటుంది. ఫెయిల్యూర్స్‌ను అంగీకరించడానికి మనసొప్పుకోదు. టాలీవుడ్ హీరోలు మాత్రం అందుకు అతీతంగా నిలుస్తున్నారు. అపజయాల్ని హుందాగా స్వీకరిస్తూ అభిమానుల మనసుల్ని గెలుచుకుంటున్నారు. అందరిని మెప్పించే మంచి సినిమా చేయలేకపోయామని తప్పుల్ని ఒప్పుకుంటున్నారు. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్ర పరాజయానికి పూర్తి బాధ్యత తనదే నని బాలీవుడ్ మిస్టర్‌పర్‌ఫెక్ట్ ఇటీవల అమీర్‌ఖాన్ వెల్లడించారు. ఆయన బాటలోనే రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, విజయ్‌దేవరకొండ సహా పలువురు తెలుగు కథానాయకులు అడుగులు వేస్తూ కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుడుతున్నారు.
sharwanand
పడి పడి లేచే మనసు సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాను. పెద్ద రేంజ్‌లో నిలుస్తుందని, గొప్ప సినిమా అవుతుందనుకున్నాను. సినిమాపై వచ్చిన విమర్శల్ని గౌరవంగా స్వీకరిస్తున్నాను. ప్రథమార్థం బాగుందని, ద్వితీయార్థంలో కొన్ని తప్పులు దొర్లాయని చెప్పారు. ఆ పొరపాట్లను సవరించుకుంటూ భవిష్యత్తులో అందరిని మెప్పించే మంచి సినిమాలు చేస్తాను సినిమా విడుదలైన ఐదో రోజున శర్వానంద్ చెప్పిన మాటలివి. సినిమా థియేటర్లలో ఉండగానే ఫ్లాప్ అయిందని ధైర్యంగా ఒప్పుకొని ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల్ని ఆశ్చర్యపరిచారు. సినిమా విషయంలో కొన్ని తప్పులు చేశానని చెప్పి ఓటమిని అంగీకరించారు. విడుదలకు ముందు ప్రచార చిత్రాల్లో శర్వానంద్, సాయిపల్లవి కెమిస్ట్రీ, సంగీతం, దర్శకుడు హను రాఘవపూడి టేకింగ్ కారణంగా మణిరత్నం శైలిలో గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందని ప్రచారం జరిగింది. ఆ అంచనాల్ని తారుమారు చేస్తూ అంతిమంగా పరాజయాన్ని చవిచూసింది. శర్వానంద్‌తో పాటు చిత్రబృందానికి నిరాశను మిగిల్చింది.

సామాన్య ప్రేక్షకుడి ఊహాశక్తికి..


varuntej
స్పేస్ థ్రిల్లర్ కథాంశంతో తెలుగుతెరపై వచ్చిన తొలి సినిమాగా అంతరిక్షం ప్రారంభం నుండి దక్షిణాది సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ గత ఏడాది డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగిలింది. సైన్స్‌కు సంబంధించిన అంశాలతో సామాన్య ప్రేక్షకుడి ఊహాశక్తికి మించి కథాగమనం సాగడం, కథ, కథనాల్లో ఉత్కంఠ లోపించడం, బడ్జెట్ పరిమితుల కారణంగా కమర్షియల్‌గా నిర్మాతలకు ఈ చిత్రం నష్టాలను మిగిల్చింది. తమ సినిమా అందరిని మెప్పించలేకపోయిందని అంతరిక్షం విడుదలైన కొద్ది రోజులకు వెల్లడించారు వరుణ్‌తేజ్. ప్రతి సినిమాపై ప్రశంసలతో విమర్శలు రావడం సహజం. మా అంతరిక్షంపై వచ్చిన విమర్శల్ని అంగీకరిస్తున్నాను అని తెలిపారు. అలాగే బీ,సీ వర్గాలను ఈ సినిమా ఆకట్టుకోవడం కొంత కష్టమేనని ముందే ఊహించానని పేర్కొన్న ఆయన ప్రేక్షకులు ఇచ్చిన తీర్పును ఒప్పుకున్నారు.

అల్లు అర్జున్ సైతం..


Allu-Arjun
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా తనకు పరాజయాన్నే మిగిల్చిందని లవర్స్ డే ఆడియో వేడుకలో పేర్కొన్నారు అల్లు అర్జున్. ఈ పరాజయానికి కారణాలేమిటో మాత్రం చెప్పలేదు. అలాగే కల్యాణ్‌రామ్ సైతం నా నువ్వే కథలోని లోపాల కారణంగా సరైన ఫలితాన్ని అందివ్వలేదని చెప్పారు. వీరే కాదు చాలా మంది నవతరం హీరోలు ఫలితం ఏదైనా వాస్తవాల్ని దాచకుండా అభిమానులతో పంచుకుంటూ నిజాయితీని చాటుకుంటున్నారు.


గెలుస్తే గెలుస్తాం..


vijaydevarakonda
నోటా చిత్రంతో తమిళంలో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ అరంగేట్రంలోనే అపజయాన్ని ఎదుర్కొన్నారు. తమిళనాడు రాజకీయ పరిస్థితులకు అద్దంపడుతూ దర్శకుడు ఆనంద్‌శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. తన కోసం నోటా సినిమా చూడటానికి వచ్చిన వారిని మెప్పించలేకపోయానని విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. నా పరాజయం కోసం ఎదురుచూసిన వారికి ఇప్పుడు సమయం వచ్చింది. ఇక పండుగ చేస్కోండి. నోటాలో నటించినందుకు పశ్చాతపడటంలేదు. గర్వపడుతున్నాను. మంచి కథ చెప్పడానికి ప్రయత్నించాం. తమిళనాడుతో పాటు జాతీయ స్థాయిలో కొందరు సినిమా బాగుందని అన్నారు. వారి ప్రేమను స్వీకసున్నాను. ఈ సినిమా విషయంలో వచ్చిన విమర్శల్ని అంగీకరిస్తున్నాను. వాటి పట్ల ఆత్మవిమర్శ చేసుకుంటూ తప్పుల్ని సవరించుకుంటాను. ఈ నిర్ణయాల వల్ల నా వృత్తిలో మార్పు వస్తుందే కానీ నా మనస్తత్వంలో మాత్రం రాదు. సక్సెస్, ఫెయిల్యూర్ ఏదైనా రౌడీని ఆపలేదు. రౌడీ అంటే నా దృష్టిలో గెలవడం కాదు విజయం కోసం పోరాడేతత్వం. పోరాడదాం. గెలుస్తే గెలుస్తాం. లేదా నేర్చుకుంటాం. మంచి విజయంతో మళ్లీ మీ ముందుకు వస్తాను అని ట్విట్టర్ ద్వారా విజయ్ దేవరకొండ నోటా అపజయాన్ని ఒప్పుకున్నారు.


రేయింబవళ్లు కష్టించాం..కానీ


రామ్‌చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన చిత్రం వినయవిధేయరామ. దాదాపు ఎనభై కోట్ల బడ్జెట్‌తో మాస్ ఎంటర్‌టైనర్‌గా ఎన్నో అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అనూహ్యంగా పరాజయాన్ని చవిచూసింది. కథ, కథనాల్లోని లోపాలతో పాటు లాజిక్‌లతో సంబంధం లేకుండా వాస్తవికతకు దూరంగా సాగిన యాక్షన్ సన్నివేశాల కారణంగా అ చిత్రం ప్రేక్షక తిరస్కారానికి గురైంది. రంగస్థలం విజయంతో దిగ్విణీకృత ఉత్సాహంతో ఉన్న రామ్‌చరణ్‌ను ఈ చిత్ర ఫలితం నిరుత్సాహపరిచింది. పోరాట ఘట్టాల చిత్రీకరణతో పాటు దర్శకత్వ పనితీరు పరంగా బోయపాటి శ్రీను ఈ సినిమాతో చాలా విమర్శల్ని ఎదుర్కొన్నారు. ఈ సినిమా ఫలితంపై చిత్రబృందం ఇన్నాళ్లు పెదవి విప్పలేదు. ఎట్టకేలకు రామ్‌చరణ్ ఈ ఓటమిని నిజాయితీగా అంగీకరించారు. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించలేకపోయామని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

మా వినయవిధేయరామ సినిమా కోసం రేయింబవళ్లు కష్టించిన సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. నిర్మాత దానయ్య అందించిన సహకారం మాటల్లో వర్ణించలేనిది. మా చిత్రాన్ని నమ్మిన పంపిణీదారులు, ప్రదర్శనదారులకు కృతజ్ఞుడినై ఉన్నాను. అందరికీ నచ్చే మిమ్మల్ని వినోదింపచేసే సినిమా అందించడానికి మేమంతా ఎంతగానో శ్రమించాం. దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాను అందించలేక మీ అంచనాలను అందుకోలేకపోయాం. మీరు చూపించే ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో మీకు నచ్చే మీరు మెచ్చే సినిమాలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తాను అని రామ్‌చరణ్ పేర్కొన్నారు. వినయవిధేయరామ పరాజయాన్ని హుందాగా అంగీకరించి అభిమానుల హృదయాల్ని గెలుచుకున్నారు.

2493

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles