షూటింగ్‌లకు విరామం!


Sun,June 16, 2019 11:57 PM

Leave the shooter could pause

ఇటీవలకాలంలో సినిమా చిత్రీకరణలో మన కథానాయకులు వరుసగా ప్రమాదాలకు గురికావడం పరిశ్రమను కలవరపరుస్తున్నది. యాక్షన్ ఘట్టాల షూటింగ్‌లో చోటుచేసుకుంటున్న పొరపాట్లతో పాటు, డూప్‌లేకుండా సొంతంగా యాక్షన్ సీక్వెన్స్‌లో నటించాలనుకోవడం ప్రమాదాలకు కారణమవుతున్నది. ఈ ఘటనల వల్ల షూటింగ్‌లకు బ్రేక్ పడుతున్నది. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటూ సుశిక్షుతులైన ట్రైనర్స్ఆధ్వర్యంలో పోరాట ఘట్టాల్లో పాల్గొంటే శ్రేయస్కరంగా ఉంటుందని అభిమానులు కోరుకుంటున్నారు..
ntr
ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఈ చిత్రం హైదరాబాద్‌లో తొలిషెడ్యూల్ పూర్తిచేసుకుంది. అనంతరం అహ్మదాబాద్, పుణేలో కొన్ని కీలక ఘట్టాల్ని తెరకెక్కించారు. అయితే షూటింగ్ మధ్యలో ఇద్దరు హీరోలు అనూహ్యంగా గాయాలుపాలవడంతో చిత్రీకరణను కొన్ని రోజులు వాయిదా వేశారు. రామ్‌చరణ్ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా కాలికి గాయమైంది. దీంతో పూణే షెడ్యూల్‌ను రద్దు చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఏప్రిల్ మొదటివారంలో ఈ ఘటన జరిగింది. దాంతో మూడు వారాల పాటు షూటింగ్‌కు విరామం ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ కూడా గాయపడ్డారు. కుడి చేతికి చిన్న గాయం అయిందని తెలిసింది. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో చేతికి పట్టీ కట్టుకొని ఎన్టీఆర్ కనిపించారు. అయితే ఎన్టీఆర్‌కు గాయమైన విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ధృవీకరించలేదు. ఇద్దరు హీరోల గాయాల కారణంగా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రీకరణ కొన్ని రోజులు వాయిదా పడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది.

డూప్ లేకుండా నాగశౌర్య ప్రయత్నం..

naaga
స్వీయ నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ పతాకంపై నాగశౌర్య ఓ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. రమణతేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ విశాఖపట్నంలో జరుగుతున్నది. సినిమాలో కొన్ని కీలకమైన యాక్షన్ ఘట్టాల్ని అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా తెరకెక్కిస్తున్న ఓ యాక్షన్ ఎపిసోడ్‌లో నాగశౌర్య ఎడమ కాలికి తీవ్రంగా గాయమైంది. డూప్ లేకుండా ఓ భారీ భవనం నుంచి దూకడానికి ప్రయత్నిస్తుండగా నాగశౌర్య అదుపుతప్పి కిందపడ్డారు. ఆయన్ని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. గాయం నుంచి కోలుకోవడానికి నెలరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దాంతో నాగశౌర్య షూటింగ్‌ను రద్దు చేసుకొని హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. నాగశౌర్య గాయం కారణంగా ముఫ్పైరోజుల పాటు షూటింగ్ వాయిదా పడింది.

పేలుడులో గాయపడ్డ సందీప్‌కిషన్

ranbir-kapoor
సందీప్‌కిషన్ కర్నూల్‌లో జరుగుతున్న షూటింగ్‌లో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెనాలి రామకృష్ణ చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ ఘట్టాల్ని కర్నూల్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా బాంబు పేలుడు నేపథ్యంలో ఓ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. పేలుడు సమయంలో బస్సు అద్దాలు పగిలి సందీప్‌కిషన్ ఎడమకన్ను క్రింద గాయాలయ్యాయి. రిస్కీ షాట్‌వల్లే ఈ ప్రమాదం జరిగిందని, ఎవరి తప్పిదం లేదని సందీప్‌కిషన్ తెలిపారు. ఈ ఘటనతో షూటింగ్‌ను రద్దు చేసుకున్న సందీప్‌కిషన్ ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్‌కు చేరుకున్నారు.

96 షూటింగ్‌లో గాయపడ్డ శర్వానంద్

sharwanand
ప్రస్తుతం శర్వానంద్ 96 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్‌రాజు నిర్మాత. సి. ప్రేమ్‌కుమార్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా శర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కైడైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సుశిక్షుతులైన ట్రైనర్స్ ఆధ్వర్యంలో శర్వానంద్ రెండు రోజుల పాటు ప్రాక్టీస్ చేశారు. మూడో రోజు ప్రాక్టీస్‌లో కూడా నాలుగుసార్లు క్రిందకు సురక్షితంగానే చేరుకున్నారు. ఐదోసారి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా గాలి ఎక్కువగా వీయడంతో క్రిందకు దిగడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కాళ్లపై ల్యాండ్ కావాల్సివుండగా భుజాలతో నేలమీదకు దిగారు. దీంతో షోల్డర్‌లో ఫ్రాక్చర్ అయింది. ఈ సంఘటన తర్వాత శర్వానంద్ వెంటనే హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయిన అతన్ని డాక్టర్లు పరీక్షించి భుజానికి బలమైన గాయమైందని తెలిపారు. శస్త్ర చికిత్స అవసరమని సూచించారు. సోమవారం శర్వానంద్‌కు శస్త్ర చికిత్స జరగనుంది. ఆపరేషన్ అనంతరం కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు సూచించారు.

జైపూర్‌లో గోపీచంద్‌కు ప్రమాదం..

Gopichand
గోపీచంద్ కథానాయకుడిగా తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర చాణక్య పేరుతో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో జైపూర్‌లో చిత్రీకరణ సందర్భంగా గోపీచంద్ గాయపడ్డారు. బైక్‌పై ఛేజింగ్ ఘట్టాల్ని చిత్రీకరిస్తుండగా బైక్ అదుపుతప్పడంతో గోపీచంద్ క్రింద పడ్డారు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం ఆయన తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇక కథానాయిక అంజలి ఆనందభైరవి షూటింగ్‌లో ప్రమాదానికి గురైందని చిత్ర బృందం తెలిపింది. స్కూటీ నడిపే సన్నివేశంలో అంజలి అదుపుతప్పి పడిపోయింది. దీంతో స్వల్ప గాయాలైనట్లు చిత్ర బృందం పేర్కొంది.

2627

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles