వాడిని నమ్మడమే నేను చేసిన తప్పు


Fri,February 15, 2019 11:01 AM

lakshmi parvathi reaction on rgvs lakshmis ntr trailer

కుట్రల పునాదులపై నిర్మించుకున్న అబద్ధపు సౌధాల నగ్నస్వరూపాల్ని బట్టబయలు చేయడానికి నిజాల కత్తి ఝుళిపిస్తున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. తన తాజా చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రచార విషయంలో రాజీలేని తత్వంతో దూసుకుపోతున్నారు వర్మ. ఈ సినిమా ద్వారా కుటుంబ కుట్రల, వెన్నుపోటు రాజకీయాల అసలు రంగు బయటపెడతానని చెబుతున్న ఆయన వాలంటైన్స్ డేను పురస్కరించుకొని గురువారం లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేశారు. నమ్మితేనే కదా ద్రోహం చేసేది 1989 ఎన్నికలలో ఎన్టీఆర్ దారుణంగా ఓడిపోయిన తరువాత రోజులవి..అంటూ రెండు క్యాప్షన్లతో ట్రైలర్ మొదలవుతుంది. జీవితం ఎప్పుడు ఏ మలుపులు తిరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు అంటూ లక్ష్మీపార్వతితో ఎన్టీఆర్ అనడం...ఈవిడ పేరు లక్ష్మీపార్వతి.. మా జీవిత చరిత్ర రాస్తున్నారు అంటూ లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్...చంద్రబాబుతో పాటు తన సహచరులకు పరిచయం చేయడం ఆసక్తికరంగా అనిపిస్తున్నది.

దానికిగాని కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్ అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో చంద్రబాబు గొంతు హెచ్చరించడం...మీరు నా పిల్లలు అయి వుండి వాడితో చేరారా సిగ్గులేకుండా అంటూ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులను తీవ్రంగా కోప్పడటం ఉత్కంఠను పంచింది. వైస్రాయ్ హోటల్ వద్ద ఎన్టీఆర్‌పై చంద్రబాబు బృందం చెప్పులు విసిరివేయడం..ఆ తర్వాత ఇంటికి వెళ్లిన ఎన్టీఆర్ తీవ్ర ఆందోళనతో కుంగిపోవడం ఉద్విగ్నతను పంచాయి. నా మొత్తం జీవితంలో చేసిన ఒకే ఒక తప్పు వాడిని నేను నమ్మడం అంటూ లక్ష్మీపార్వతి వద్ద ఎన్టీఆర్ విలపిస్తుండటంతో ట్రైలర్‌ను ముగించారు. విడుదలైన తొలి ఎనిమిది గంటల్లోనే 25లక్షల మందికి పైగా ట్రైలర్‌ను వీక్షించడం విశేషం. నిజాల్ని నిర్భయంగా చూపించే ప్రయత్నం చేశారంటూ ఎంతో మంది వర్మను ప్రశంసిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి పాత్ర, ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడానికి సాగిన కుట్ర నేపథ్యంలో రామ్‌గోపాల్‌వర్మ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అగస్త్యమంజు కూడా ఈ సినిమాకు మరో దర్శకుడు. ఈ చిత్రాన్ని రాకేష్‌రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించబోతున్నారు.


8729

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles