చరిత్రను వక్రీకరించడం తప్పు!


Fri,January 19, 2018 11:11 PM

Krishnam Raju Marriage is definitely on Prabhas mind

ఈ ఏడాదితో యాభై వసంతాల సినీ ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నారు సీనియర్ నటుడు కృష్ణంరాజు. సుదీర్ఘ నటజీవితంలో ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారాయన. జనరంజకమైన చిత్రాల్లో నటించి రెబల్‌స్టార్‌గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. యాక్షన్, కుటుంబ కథా చిత్రాల కథానాయకుడిగా తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్నారు. ఆయన నట వారసుడు ప్రభాస్ బాహుబలి సినిమాతో జాతీయస్థాయిలో పేరు సంపాదించుకున్నాడు. ఈ విజయంతో ఆనంద పారవశ్యంలో ఉన్నారు కృష్ణంరాజు. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో కృష్ణంరాజు పాత్రికేయులతో ప్రత్యేకంగా సంభాషించారు. సినిమా, రాజకీయాల గురించి తన అభిప్రాయాల్ని వెల్లడించారు.
Krishnam-Raju

రెండు నెలల్లో యాభై ఏళ్ల వేడుక..

ఈ ఏడాదితో 50వసంతాల సినీ ప్రయాణాన్ని పూర్తిచేసుకున్నాను. ఈ సందర్భంగా నా అభిమానుల్ని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో సన్మానించాలని నిర్ణయించుకున్నాను. ఎన్నో సంవత్సరాలుగా నా అభిమానులుగా కొనసాగుతున్న వారందరిని ఈ వేడుకకు ఆహ్వానించబోతున్నాను. ఆ తర్వాత దేశవ్యాప్తంగా వివిధ చిత్ర పరిశ్రమల్లోని ప్రముఖుల్ని ఆహ్వానించి వారికోసం మరో వేడుకను నిర్వహిస్తాం. ఈ యాభైఏళ్ల ఉత్సవాన్ని రాబోవు రెండుమూడు నెలల్లో జరపడానికి సన్నాహాలు చేస్తున్నాం.

స్థాయికి తగిన పాత్రలు..

ఈ ఏడాది నా మనసుకు నచ్చిన మంచి పాత్రల్లో కనిపించాలనుకుంటున్నాను. నేను ఏదైనా పాత్ర చేస్తే అందులో తప్పకుండా ప్రత్యేకత వుంటుందని ప్రేక్షకులు భావిస్తారు. అలా వారి హృదయాల్ని మెప్పించే పాత్రలు చేస్తాను. ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంలో నా పాత్ర చిన్నదే అయినా కథాగమనంలో కీలకంగా ఉంటుంది. ఆ తరహాలో నా స్థాయికి తగిన పాత్రలు చేస్తాను.

రాజకీయాల్లో క్రియాశీలకంగా ...


ఇక నుంచి రాజకీయాలకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాను. వచ్చే ఏడాదిన్నరలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి పార్టీకి నా సేవలు అవసరమవుతాయని భావిస్తున్నాను. నరేంద్రమోదీగారు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు. ఆయనకు నావంతు సహాయసహకారాల్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్నికలకు ఇంకా సమయం వుంది కాబట్టి నేను పోటీ చేసే విషయాన్ని సరైన సమయంలో తెలియజేస్తాను.

ఆ విషయం ప్రభాస్‌నే అడగండి..

మీడియా సమావేశాల్లో ప్రభాస్ పెళ్లి గురించి కానీ, రాజకీయ రంగప్రవేశం గురించి కానీ నన్ను ప్రశ్నలు అడగొద్దు (నవ్వుతూ). ఇదివరకు ప్రభాస్‌ను పెళ్లి గురించి అడిగితే బాహుబలి పూర్తవనివ్వండి.. అప్పుడు ఆలోచిస్తాను అనేవాడు. ఇప్పుడేమో సాహో అయిపోవాలి అంటున్నాడు. ప్రభాస్ కొంచెం మెత్తబడుతున్నట్లు కనిపిస్తోంది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచనకు వచ్చినట్లుంది. అందుకే ఈ మధ్య నా మాటకు విలువిస్తున్నాడు (నవ్వుతూ).

వర్మ బలవంతం పెట్టడం లేదు కదా..

రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న అడల్ట్ వెబ్ మూవీ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ గురించి కృష్ణంరాజు స్పందిస్తూ ఈ సినిమా విషయంలో రామ్‌గోపాల్‌వర్మను విమర్శించాల్సిన అవసరం లేదు. సినిమాను ఆయనొక్కరే ప్రేక్షకుల ముందుకుతీసుకురాలేరు కదా? ఆయన ముందు సెన్సార్ వుంది. ప్రభుత్వం వ్యవస్థలు వున్నాయి. కాబట్టి ఆ సినిమాను వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదు. తెలుగువాడైనా రామ్‌గోపాల్‌వర్మ జాతీయస్థాయిలో దర్శకుడిగా సత్తాచాటాడు. ఆయన్ని చూసి మనం గొప్పగా ఫీలవ్వాలి. రామ్‌గోపాల్‌వర్మ ఆ సినిమా తీయడంలోని ఉద్దేశం ఏమిటో మనకు తెలియదు. సినిమా చూడమని ఆయన ఎవరిని బలవంతం పెట్టడం లేదు కదా? ఆ సినిమాకు సంబంధించి టీవీల్లో జరిగిన చర్చల్ని చూశాను. ఒక ఛానల్ జరిపిన పోలింగ్‌లో 64శాతం మంది వర్మకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు నాలాంటి వారు ఎవరి పక్షం మాట్లాడాలో మీరే నిర్ణయించాలి.

ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి

చరిత్ర ఆధారంగా సినిమాలు తీస్తున్నప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. అందులో జనాదరణ వున్న పాత్రను తెరకెక్కిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి. చరిత్రను వక్రీకరించి సినిమాలు తీయడం తప్పు. అదే సమయంలో ఒక్కోసారి చరిత్రను యథాతథంగా తీయడం కూడా తప్పే అవుతుంది. చరిత్రను వక్రీకరించారనే కోణంలోనే సెన్సార్ వారు పద్మావత్ చిత్రానికి అభ్యంతరం చెప్పారు. అలాగే రాజ్‌పుత్‌లు కూడా అదే కారణంతో సినిమా విడుదలను అడ్డుకుంటున్నారు. వాస్తవానికి సెన్సార్‌కు, రాజకీయపార్టీలకు ఎలాంటి సంబంధం ఉండదు.

ఏప్రిల్‌లో ప్రభాస్‌తో సినిమా..

2014ఎన్నికల ముందు ఒక్క అడుగు పేరుతో ఓ రాజకీయ సందేశాత్మక చిత్రం చేయాలనుకున్నాను. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యమైంది. ఇక ఆ సినిమా లేనట్లే. మా స్వీయనిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ పతాకంపై ప్రభాస్ కథానాయకుడిగా ఏప్రిల్‌లో ఓ చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి రాధాకృష్ణ (జిల్‌ఫేమ్) కథను సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ సాహో చిత్రీకరణలో వున్నాడు. మార్చిలోగా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

1587

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles