నాకు నటించడం రాదు!


Wed,June 5, 2019 12:08 AM

Killer Release Date June 7

సంగీత దర్శకుడిగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించి హీరోగా మారారు విజయ్ ఆంటోనీ. ప్రయోగాత్మక కథాంశాలతో తమిళ చిత్రసీమలో నటుడిగా వైవిధ్యతను చాటుకున్న ఆయన అనువాద చిత్రం బిచ్చగాడుతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. జయాపజయాలకు అతీతంగా ప్రతి సినిమాతో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించడానికి తపిస్తుంటారాయన. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం కొలైగారన్‌తెలుగులో కిల్లర్ పేరుతో ఈ నెల 7న విడుదలవుతోంది. అండ్రూ లూయిస్ దర్శకుడు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విజయ్ ఆంటోనీ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..

కొత్త దర్శకుడితో సినిమా రిస్క్ అనిపించలేదా?

-దర్శకుడు ఆండ్రూ లూయిస్ నా క్లాస్‌మేట్. విజువల్ కమ్యూనికేషన్స్ కలిసి చదువుకున్నాం. అండ్రూ చెప్పిన కథ నచ్చే అతడికి అవకాశమిచ్చాను. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే చిత్రమిది.కొత్త దర్శకులతోనే ప్రయాణం సేఫ్ అని నేను నమ్ముతాను.

మీ గత సినిమాలు సరైన ఫలితాల్ని అందుకోలేదు కదా?

-జయాపజయాలు అనేవి ప్రతి ఒక్కరి కెరీర్‌లో సహజం. పరాజయాల నుంచి నేర్చుకున్న పాఠాలతో భవిష్యత్తులో మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను.

కిల్లర్ నేపథ్యమేమిటి? సినిమా ద్వారా ఏదైనా సందేశాన్ని చెప్పబోతున్నారా?

-ఓ సీరియల్ కిల్లర్ కథ ఇది. అతడు వరుసగా హత్యలు చేయడానికి కారణమేమిటి? ఆ కిల్లర్ మంచివాడా?చెడ్డవాడా? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాం. గత సినిమాల్లో మాదిరిగా ఇందులో ఎలాంటి సందేశాన్ని చెప్పే ప్రయత్నం చేయలేదు. కుటుంబ విలువలతో సాగుతుంది.

ప్రచార చిత్రాలు చూస్తుంటే అర్జున్‌తో పోటీపడి నటించినట్టున్నారు?

-నేను మంచి నటుడిని కాదు. నాకు పెద్దగా నటించడం రాదు. కాకతాళీయంగా హీరోనయ్యాను. బాగా నటించడానికి ఎల్ల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాను. నా దృక్కోణంలో అర్జున్ పరిపూర్ణ నటుడు. ఆయన నటన నన్ను బాగా ఆకట్టుకున్నది. పోలీస్ ఆఫీసర్‌గా ఆయన పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

మీ సినీ ప్రయాణాన్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది?

-సంగీతం పట్ల ఎలాంటి పరిజ్ఞానం లేకపోయినా మ్యూజిక్‌డైరెక్టర్‌గా మంచి పేరుతెచ్చుకున్నాను. నటనలో ఓనమాలు తెలియకపోయినా, ఆర్థిక ప్రోత్సహం లేకపోయినా నటుడిగా, నిర్మాతగా విజయాల్ని అందుకున్నాను. నా పట్ల నాకున్న గుడ్డి నమ్మకమే విజయాల్ని తెచ్చిపెట్టింది. తప్పైనా, ఒప్పైనా నా స్వీయ నిర్ణయాలకే కట్టుబడుతాను. నిలకడతనం, స్పష్టత వల్లే రాణించగలుగుతున్నాను. నాకు తెలియని పనులు చేయాల్సివచ్చినప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకుంటూ కష్టపడతాను. మైనస్‌లను ప్లస్‌లుగా మార్చుకోవడానికి నిర్విరామ కృషి చేస్తాను. అదే నేను ఇన్నేళ్లు ఇండస్ట్రీలో నిలబడేలా చేస్తుంది.

తదుపరి సినిమా విశేషాలేమిటి?

-ప్రస్తుతం తమిళంలో ఖాకీ అనే సినిమా చేస్తున్నాను. సత్యరాజ్ ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తున్నారు. పోలీస్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తాం. అలాగే అరుణ్ విజయ్‌తో కలిసి జ్వాలా అనే సినిమా చేస్తున్నాను. మరో పది సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

సాంకేతిక అంశాల పట్ల మీకున్న పరిజ్ఞానం బాగా నటించడానికి ఉపయోగపడుతుందా?

-నా సినిమాలకు నేనే సౌండ్ ఇంజనీర్, ఎడిటర్‌గా పనిచేస్తాను. అవన్నీ సొంతంగా నేర్చుకున్నాను తప్పితే ఎవరి వద్ద పనిచేస్తూ తెలుసుకోలేదు. నటుడిగా నేను చేసే తప్పుల్ని సవరించుకోవడానికి సాంకేతిక అంశాలపై ఉన్న పట్టు దోహదపడుతుంది.

2150
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles