రాముణ్ణి ఆటపట్టించాను!


Fri,January 4, 2019 11:52 PM

kiara advani interview vinaya vidheya rama

ధోని చిత్రం ద్వారా బాలీవుడ్ యవనికపై తళుక్కున మెరిసింది కియారా అద్వాణీ. అందం, అభినయంతో ఆకట్టుకుంది. భరత్ అనే నేను ఆమెకు తెలుగులో శుభారంభాన్నిచ్చింది. ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో భారీ అవకాశాలతో దూసుకుపోతున్నదీ సుందరి. కియారా అద్వాణీ కథానాయికగా నటించిన తాజా చిత్రం వినయ విధేయ రామ. బోయపాటి శ్రీను దర్శకుడు. ఈ నెల 11న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా కియారా అద్వాణీ పాత్రికేయులతో ముచ్చటించింది.నేను నటించినలస్ట్‌స్టోరీస్ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. ఏ భాషా చిత్రం చేసినా వీలైనంత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువకావాలన్నదేనా లక్ష్యం. నాయికగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకోవాలన్నదే నా అభిమతం.

తెలుగులో మీరు నటిస్తున్న రెండో చిత్రమిది. కథాపరంగా మీకు ఏ అంశాలు బాగా నచ్చాయి?

-నా గత సినిమాలకంటే పూర్తి భిన్నమైన చిత్రమిది. భారీ తారాగణంతో చక్కటి ఫ్యామిలీ నేపథ్యంలో కథ నడుస్తుంది. హేమాహేమీలైన సీనియర్ నటులతో తెరను పంచుకోవడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా నేను నటించిన తొలి మాస్ చిత్రమిది.

తొలి మాస్ చిత్రమంటున్నారు. మీ పాత్ర చిత్రణ ఎలా ఉంటుంది?

-సంప్రదాయం, ఆత్మవిశ్వాసం కలిగిన సీత అనే అమ్మాయిగా నా పాత్ర శక్తివంతంగా సాగుతుంది. కుటుంబ సభ్యుల చెంత మాత్రం రాముడే సర్వస్వం అన్నట్లు ప్రేమాభిమానాల్ని కనబరుస్తుంది. ఒంటరిగా ఉంటే రాముణ్ణి ఎప్పుడూ ఆటపట్టించే అల్లరి అమ్మాయిగా కనిపిస్తుంది.

కథల ఎంపికలో మీ ప్రాధాన్యతలు ఎలా ఉంటాయి?

-ఒకే రకమైన సినిమాలకు పరిమితమై పోకుండా విభిన్న కథాంశాల్ని ఎంపిక చేసుకోవాలనుకుంటున్నాను. పాత్రలపరంగా కూడా వైవిధ్యం చూపించాలని ప్రయత్నిస్తున్నాను. అప్పుడే నటిగా రాణించగలుగుతాను. నాకు స్వతహాగా డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు నృత్యంలో నా ప్రతిభను ప్రదర్శించడానికి సరైన ఛాన్స్ రాలేదు. వినయ విధేయ రామ ఆ కోరికను తీర్చింది. నేనే తన బెస్ట్ డ్యాన్స్ పార్ట్‌నర్ అని రామ్‌చరణ్ మెచ్చుకున్నారు. ఈ సినిమాలోని రామ్ లవ్ సీత అనే పాట బాగా నచ్చింది.

దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి పనిచేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

-ప్రతి సినిమా విషయంలో నేను దర్శకుల్ని పూర్తిగా విశ్వసిస్తాను. వారి సృజనకు విలువనిస్తాను. దర్శకుల విజన్‌ను తెరపై తీసుకురావడానికి వందశాతం కృషిచేస్తాను. బోయపాటి శ్రీనుగారు నా పాత్ర గురించి చెప్పేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సహా వివరించారు. అందుకే సీత పాత్ర గొప్పగా ఆవిష్కృతమైంది.

మీ పాత్ర విషయంలో ముందస్తుగా ఎలాంటి కసరత్తులు చేస్తారు?

-ముందస్తుగా ప్రిపేర్ కావడం నాకు ఇష్టం వుండదు. సీన్ చెప్పిన వెంటనే దానిని సంపూర్ణంగా అవగాహన చేసుకుంటాను. పాత్రలో ప్రవేశించడానికి ఎక్కువగా సమయం తీసుకోను. పాత్రకు అనుగుణంగా సహజంగా అభినయించడానికి ప్రయత్నిస్తాను. అయితే ఈ సినిమాలో తెలుగు డైలాగ్స్ కోసం మాత్రం కొంచెం ప్రాక్టీస్ చేశాను.

అనతికాలంలోనే అగ్ర తారగా ఎదిగారు. ఈ ప్రయాణం ఎలా అనిపిస్తున్నది?

-అవకాశాల్ని అందిపుచ్చుకునేందుకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలనే సిద్ధాంతాన్ని నేను బలంగా విశ్వసిస్తాను. ధోని చిత్రం నా సినీ కెరీర్‌ను మార్చివేసింది. ఆ సినిమా తర్వాత నేను బయట కనిపిస్తే సాక్షి అని నా పాత్ర పేరుతో పిలిచేవారు. ధోని సినిమాలో నా పర్‌ఫార్మెన్స్ నచ్చి భరత్ అనే నేనులో ఛాన్స్ ఇచ్చారు. మహేష్‌బాబు వంటి అగ్రహీరోతో తెలుగులో అరంగేట్రం చేయడం గొప్ప అనుభూతినిచ్చింది. ఈ సినిమాను నా కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా అభివర్ణించవొచ్చు.

తెలుగు పరిశ్రమలో మీకు స్నేహితులెక్కువని అంటుంటారు?

-భరత్ అనే నేను షూటింగ్ సమయంలో నమ్రత, చిన్నారి సితార చాలా సన్నిహితులయ్యారు. వినయ విధేయ రామ సినిమా ద్వారా చరణ్ సతీమణి ఉపాసన మంచి మిత్రురాలిగా మారింది. ఆమె నా కోసం ఎన్నోసార్లు ఇంటి నుంచి భోజనం పంపించారు. చరణ్, ఉపాసనతో ఉన్నప్పుడు ఓ కుటుంబంతో ఉన్నాననే భావన కలిగింది.

అర్జున్‌రెడ్డి హిందీ రీమేక్‌లో కథానాయికగా నటిస్తున్నారు. ఆ సినిమా గురించి..?

-అర్జున్‌రెడ్డి చిత్రం నాకెంతగానో నచ్చింది. విజయ్‌దేవరకొండ అద్భుతమైన ప్రతిభావంతుడు. అర్జున్‌రెడ్డి సినిమా చూసిన తర్వాత విజయ్‌కు పెద్ద అభిమానిగా మారిపోయాను. హిందీ రీమేక్‌లో నేటివిటీ పరంగా కొన్ని మార్పులు చేశారు. ఢిల్లీ నేపథ్యంలో కథ నడుస్తుంది.

2016

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles