బాహుబలి నచ్చని వాళ్లున్నారు!


Mon,November 13, 2017 10:59 PM

Karthi interview about Khakee Movie release on Nov 17th

Karthi
కమర్షియల్ సినిమాల్లో ప్రయోగాలు చేయడంలో దిట్ట హీరో కార్తి. ప్రతి సినిమాలో నటుడిగా తనని తాను కొత్త పంథాలో ఆవిష్కరించుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. ఆ నైజమే అతన్ని విలక్షణ కథానాయకుడిగా నిలబెట్టింది. తెలుగులోను ఆయనకు మంచి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. కార్తి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఖాకీ ఈ నెల 17నవిడుదలకానున్నది. సోమవారం హైదరాబాద్‌లో కార్తి పాత్రికేయులతో పంచుకున్న చిత్ర విశేషాలివి...

ఖాకీలో పోలీస్ గురించి ఏం చెప్పబోతున్నారు?

-తమిళనాడులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమిది. 1995 సమయంలో జరిగిన ఓ పెద్ద నేరం వెనకున్న రహస్యాన్ని ఛేదించడానికి పోలీసులకు పదేళ్లు పట్టింది. ఓ డీఎస్‌పీ తన బృందంతో కలిసి ఆ కేసు చిక్కుముడిని ఎలా విప్పాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. ఆ నేరం వెనకున్న కథేమిటి? అలాంటి క్రైమ్స్ ఎందుకు ఇంకా జరుగుతున్నాయనే అంశాన్ని క్షణ్ణంగా సినిమాలో చూపించాం.

యాక్టర్స్ అసోసియేషన్ కోసం ప్రత్యేకంగా ఓ భవంతిని నిర్మించాలన్నది తమిళ నవతరం హీరోలందరి కల. ప్రస్తుతం ఆ కలను నెరవేర్చుకునే పనిలో ఉన్నాం. ప్రకృతి విపత్తులు ఎదురైనప్పుడు ఇండస్ట్రీలో ఉన్న ఒక్కో హీరో సహాయాన్ని అర్థించడం కష్టమవుతున్నది. అందుకోసం ప్రత్యేకంగా ఓ ఫండ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం. గత ఏడాది కడలూరు ప్రాంతంలో తుఫాను వచ్చినప్పుడు ప్రభాస్ 75 లక్షలు సహాయం చేశారు. ఆ డబ్బుతో ముప్ఫై గ్రామాల్లో విద్యార్థులకు ప్రత్యేకంగా చదువు, క్రీడల్లో శిక్షణ కార్యక్రమాల్ని చేపడుతున్నాం. మేము చేపట్టిన పనుల గురించి ప్రభాస్‌కు చెబితే ఆయన సంతోషించారు.


పోలీస్ కథలతో మీ అన్నయ్య సూర్య చాలా సినిమాలు చేశారు. వాటితో పోలిస్తే ఈ సినిమా ఎంతవరకు భిన్నంగా ఉంటుంది.

-సింగం సిరీస్ సినిమాలన్ని పూర్తిగా కమర్షియల్ హంగులతో సాగుతాయి. ఆ సిరీస్ చిత్రాలకు భిన్నంగా సహజత్వానికి ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. రెగ్యులర్ పోలీస్ స్టోరీలతో పోలిస్తే వైవిధ్యంగా అనిపిస్తుంది.

ఈ సినిమా తర్వాత పోలీసుల పట్ల మీ ఆలోచన విధానంలో ఏమైనా మార్పులు వచ్చాయా?

-ఈ సినిమాతో పోలీసుల పట్ల నాకున్న అభిప్రాయం పూర్తిగా మారింది. ప్రజారక్షణే ధ్యేయంగా రేయింబవళ్లు ఉద్యోగబాధ్యతల్ని నిర్వర్తించే పోలీసులపై అపారమైన గౌరవం పెరిగింది. పోలీసు జీవితాల్లో ఉండే కష్టాలు ఈ సినిమాతో పూర్తిగా తెలిశాయి. పోలీసుల గురించి పత్రికల్లో , సామాజిక మాధ్యమాల్లో వచ్చే కథనాలు పూర్తిగా నిజం కావు. అలాంటి వాటిలో తెలియని మరో కోణం ఉంటుంది. నిజాయితీపరులైన పోలీసులు చాలా మంది ఉన్నారని అర్థమైంది.

పరాజయాల్ని మీరు ఎలా స్వీకరిస్తారు?

-పరాజయాలు వచ్చినప్పుడు బాధ ఉంటుంది. కాట్రూ వెళియిదై (తెలుగులో చెలియా) కథ చెబుతున్పప్పుడే రెగ్యులర్ కమర్షియల్ లవ్‌స్టోరీ కాదని, కొత్త తరహా ప్రయోగాత్మక చిత్రమిదని మణిరత్నం అన్నారు. నేను అంగీకరించిన తర్వాతే సినిమా మొదలుపెట్టారు. నటుడిగా సవాలుగా భావించి ఆ సినిమా చేశాను. మణిరత్నంతో పనిచేయడం ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఆ ఆలోచనతోనే ఆయనతో సినిమా చేశాను. పరాజయాలు ప్రతి నటుడి జీవితంలో సహజం. ఓ సినిమా అందరికి నచ్చాలని లేదు. బాహుబలి నచ్చని వాళ్లు ఉన్నారు. రెండేళ్ల పాటు పడిన శ్రమకు ఫలితం దక్కకపోయినా బాధపడాల్సింది లేదు. గత సినిమాల్లో చేసిన తప్పులను పునరావృతం కాకుండా మంచి సినిమాను అందించడానికే కృషిచేయాలి. గెలుపోటములను ఒకేలా స్వీకరించినప్పుడే సంతోషంగా ఉండగలం.

ఒకవేళ కమల్‌హాసన్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు మద్దతు ఇవ్వడానికి సిద్ధమేనా?

-కమల్‌హాసన్ రాజకీయాల్లోకి రావడం ఆనందమే. ఇప్పటివరకు తాను అడుగుపెట్టిన ప్రతి రంగంపై అవగాహన పెంచుకుని తదనుగుణంగా ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం రాజకీయాలపై అవగాహన పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తెలివిపరులు, చదువుకున్నవారు రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. అలాగే రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. కానీ ఇప్పటివరకు ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.

తదుపరి సినిమా విశేషాలేమిటి?

-ప్రస్తుతం చాలా మంది రాజకీయకథలనే వినిపిస్తున్నారు(నవ్వుతూ). అలాంటి సినిమాలు ఇప్పుడే చేయను. గ్రామీణ నేపథ్యంలో త్వరలో సినిమా చేస్తున్నాను. ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకుడు. అన్నయ్య సూర్య నిర్మిస్తున్నారు. అలాగే రకుల్‌ప్రీత్‌సింగ్‌తో కలిసి మరో ప్రేమకథా చిత్రంలో నటించనున్నాను.

2768

More News

VIRAL NEWS