నిజమైన ఖైదీలను కలిశాను!

Mon,October 21, 2019 12:06 AM

తమిళ చిత్రసీమలో కొత్తదనానికి చిరునామాగా నిలుస్తుంటారు కథానాయకుడు కార్తి. వాణిజ్య సూత్రాలు, ఇమేజ్‌ లెక్కలతో సంబంధం లేకుండా వైవిధ్యతను నమ్మి సినిమాలు చేస్తుంటారాయన. ప్రయోగాలకు ప్రాధాన్యతనిచ్చే ఆలోచన విధానమే ఆయనకు తమిళంతో పాటు తెలుగులో చక్కటి అభిమానగణాన్ని తెచ్చిపెట్టింది. కార్తి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖైదీ’ లోకేష్‌ కనకరాజ్‌ దర్శకుడు. ఈ నెల 25న ఈ చిత్రం విడుదలకానుంది. ఆదివారం హైదరాబాద్‌లో కార్తి పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..


‘ఖైదీ’లో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేవి?

దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ కథ చెప్పిన విధానం కొత్తగా అనిపించింది. నవ్యమైన ఆలోచనతో కూడిన చిన్న సినిమా ఇది.. నచ్చితే కలిసి చేద్దాం అంటూ నా దగ్గరకొచ్చారు. ఈ కథ నన్ను అమితంగా ఆకట్టుకున్నది. హాలీవుడ్‌ చిత్రం ‘డైహార్డ్‌' తరహాలో వినూత్నంగా ఉంటుంది. కథ విన్న తర్వాత ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగ్గర్‌ లాంటి నటుడు కూడా ఈ సినిమా చేయొచ్చనిపించింది.

ఈ సినిమా నేపథ్యమేమిటి?

మాస్‌ హంగులతో సాగే పూర్తిస్థాయి యాక్షన్‌ చిత్రమిది. ఒక రాత్రిలో నాలుగు గంటల వ్యవధిలో జరిగే సంఘటనల సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. ఓ ప్రయాణం కొందరి జీవితాల్ని ఎలాంటి మలుపులు తప్పిందన్నది తెరపై ఆసక్తిని పంచుతుంది.

టీజర్‌లో మీరు డీగ్లామర్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. మీ పాత్ర ఎలా ఉంటుంది?

పదేళ్లు శిక్షను పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైన ఖైదీగా కనిపిస్తాను. అతడికి ఓ కూతురు ఉంటుంది. పుట్టినప్పటినుంచి తన కూతురిని ఆ ఖైదీ చూడలేని పరిస్థితులు తలెత్తుతాయి. అలా ఎందుకు జరిగింది? తన కూతురిని ఆ ఖైదీ ఎలా కలుసుకున్నాడనేది భావోద్వేగభరితంగా ఉంటుంది. యాక్షన్‌, అభినయం కలబోతగా నా పాత్ర సాగుతుంది.

తండ్రి పాత్రలో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించిందా?

నిజజీవితంలో నాకు ఓ కూతురు ఉంది. తండ్రీకూతుళ్ల బంధం విలువ ఏమిటో అనుభవపూర్వకమే కాబట్టి సవాల్‌గా ఎప్పుడూ అనిపించలేదు.‘విక్రమార్కుడు’ రీమేక్‌ను నా పెళ్లికి ముందు చేశాను. ఆ సినిమాలో నాకు ఓ కూతురు ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటూ నటించాను. కానీ ఈ సినిమాకు అలా ఆలోచించాల్సిన అవసరం రాలేదు.

చిరంజీవి ‘ఖైదీ’ టైటిల్‌ను సినిమాకు పెట్టడానికి కారణం ఏమిటి?

చిరంజీవి సినిమా టైటిల్‌ పెట్టాలనే ఆలోచన మాకు లేదు. కథానుగుణంగానే ఆ పేరును నిర్ణయించాం.

కొత్త ప్రయోగాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారా?లేదా? అన్న భయం ఎప్పుడైనా కలిగిందా?

‘అర్జున్‌రెడి’్డ లాంటి సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అడివిశేష్‌లాంటి హీరోలు వినూత్న కథాంశాలతో సినిమాలు చేసి విజయాల్ని అందుకుంటున్నారు. ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్స్‌కు ఆదరణ పెరడగంతో అంతర్జాతీయ కథాంశాలు మన ప్రేక్షకులకు చేరువయ్యాయి. నవ్యతతో ప్రయత్నిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతోనే ఈ సినిమా చేశాం. కెరీర్‌లో ఎప్పుడో ఒకసారి ఇలాంటి అవకాశం వస్తుంది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసేటప్పుడు పాటలు, రొమాన్స్‌, కథానాయిక లేని సినిమా చేయాలని అనుకునేవాణ్ణి. ఆ కల ఈ సినిమాతో తీరింది. నటుడిగా నాకు కొత్త అనుభూతిని పంచింది.

పాటలు, హీరోయిన్‌ లేకుండా సినిమా చేయడం రిస్క్‌ అనిపించలేదా?

కేవలం నాలుగు గంటల్లో జరిగే కథ కావడంతో సినిమాలో పాటలు, రొమాన్స్‌కు చోటు కల్పించే అవకాశం రాలేదు. కామెడీ ట్రాక్‌లు పెట్టమని అడగాల్సిన అవసరమే లేకుండా పోయింది. యాక్షన్‌, విజువల్స్‌ కొత్త అనుభూతిని పంచుతాయి. సినిమా మొత్తం చీకట్లోనే సాగుతుంది. 60 రాత్రుళ్లు చిత్రీకరణం జరిపాం.

ఈ సినిమా కోసం మీరు ఎలాంటి పరిశోధన చేశారు?

వైవిధ్యత, ఛాలెంజింగ్‌ నిలిచే ఈ పాత్ర కోసం నిజమైన ఖైదీలను కలిశాను. పదేళ్లు జైలులో ఉండి బయటకువచ్చిన తర్వాత చిన్న చిన్న విషయాల్ని చూసి వారు పొందే అనుభూతిని ఈ సినిమాలో చూపించాం. ఈ పదేళ్లలో వారు ఏం కోల్పోయారు? విడుదల తర్వాత వారి ఉద్వేగాలు ఎలా ఉంటాయో చూపించాం.

విడుదల తర్వాత ఫలితం గురించి విశ్లేషించుకుంటారా?

‘మీ మనసుకు నచ్చిన సినిమాలు చేయండి. మాకు నచ్చుతాయా? లేదా ఆలోచించొద్దు’ అని గతంలో రిక్షాకార్మికుడైన అభిమాని చెప్పిన మాటలు నాలో ఆలోచనను రేకెత్తించాయి. కథ నాకు నచ్చితే అంగీకరిస్తాను. లేదంటే చేయను. విడుదల తర్వాత సినిమా గురించి అస్సలు ఆలోచించను.

తదుపరి సినిమా విశేషాలేమిటి?

‘దృశ్యం’ ఫేమ్‌ జీతుజోసఫ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాను. ఇందులో నాతో పాటు వదిన జ్యోతిక ఓ కీలక పాత్రను పోషించనున్నారు. ఫ్యామిలీ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కనున్నది.

910

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles