పొగరు అనుకున్నా పట్టించుకోను!


Fri,January 4, 2019 12:39 AM

Kalyan Ram talk about hari krishna character in ntr biopic

తండ్రి పాత్రను వెండితెరపై ఆవిష్కరించే అరుదైన అవకాశం చాలా తక్కువ మందికి లభిస్తుంది. ఆ విషయంలో కల్యాణ్‌రామ్ అదృష్టవంతుడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఎన్‌టిఆర్. నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన తన తండ్రి నందమూరి హరికృష్ణ పాత్రలో కనిపించనున్నారు. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్‌టిఆర్ కథానాయకుడు, ఎన్‌టిఆర్ మహానాయకుడు పేర్లతో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇందులో ఎన్‌టిఆర్ కథానాయకుడు ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో నందమూరి కల్యాణ్‌రామ్ వెల్లడించిన విశేషాలివి.

ఇటీవల ఎన్నికల్లో మీ సోదరికి సపోర్ట్‌గా ప్రచారానికి రాకపోవడానికి కారణం?

నాకు రాజకీయాలంటే పెద్దగా ఇష్టం వుండదు. వాటికి ఎప్పుడూ నేను దూరంగానే వుంటాను. నాకు పెద్దగా ఆసక్తి కూడా వుండదు. ఆ టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా మాట్లాడతాను. రాజకీయాల గురించి మాట్లాడాలంటే మంచి టైమ్ రావాలి. ప్రచారానికి ఎవరొచ్చినా రాకపోయినా ఏమీ జరగదు అందుకే రాలేదు.

తండ్రి పాత్రని వెండితెరపై పోషించే అవకాశం చాలా అరుదుగా వస్తుంటుంది. అలాంటి అవకాశం మీకు దక్కడం ఎలా అనిపిస్తోంది?

నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజు ప్రజల్లో మాకు ఎంతో కొంత ఆదరాభిమానాలు వున్నాయంటే దానికి ప్రధాన కారణం మా తాత ఎన్.టి.ఆర్‌గారే. ఆ మూడు అక్షరాలకు ఎంతో విలువ వుంది. ఆయన లేకపోతే నేను అనేవాడిని వుండేవాడిని కాదు. మాకంటూ ఓ ట్యాగ్‌లైన్‌ని ఏర్పాటు చేసింది ఆయనే. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రలో నేనూ ఓ భాగం కావడం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. నాన్నగారు ఈ రోజు వుండి వుంటే చాలా ఆనందించి వుండేవారు. తాతగారి బయోపిక్‌లో నటిస్తున్నందుకు ఒక తెలుగువాడిగా గర్విస్తున్నాను.

తొలుత ఈ పాత్ర కోసం మిమ్మల్నే అనుకున్నారా?

బాబాయ్ ఫోన్ చేసి నాన్న మీ నాన్నగారి పాత్ర నువ్వే వెయ్యాలి. క్రిష్‌గారు కథ చెబుతారు. అయితే ఈ పాత్రను నువ్వు చెయ్యడం కరెక్టో కాదో ఒకసారి ఆలోచించుకొని ఏ విషయమైనా నాకు చెప్పు అన్నారు.అడిగిన వెంటనే మరో ఆలోచన లేకుండా అంగీకరించాను.

నాన్నగారి పాత్రకు మీరే ఫైనల్ అన్నప్పుడు భయపడ్డారా?

అలాంటి వ్యక్తి జీవిత కథలో నటిస్తున్నాను అని అనుకున్నప్పుడు అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాను. అది ఒక్క రోజు పాత్రనా, సినిమా అంతా వుంటుందా అని ఆలోచించలేదు. నిజాయితీగా మీకో విషయం చెప్పాలి. నేను ఎక్కడా మా నాన్నగారి పోలికలతో కనిపించను. అయితే నాన్నలా కనిపించడానికి పది కేజీల బరువు పెరిగాను. నాలో వున్న భయాన్ని పోగొట్టిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు బాబాయ్ అయితే మరొకరు దర్శకుడు క్రిష్.

మీకు తెలిసిన నాన్నగారు వేరు. మీ తాతగారికి తెలిసిన నాన్నగారు వేరు ఈ విషయంలో ఎలాంటి హోమ్‌వర్క్ చేశారు?

ఈ విషయంలో బాబాయ్ నాకు సహకారాన్ని అందించారు. తాతగారి సమయంలో నాన్న ఎలా వుండేవారు. ఆయనతో ఎలా మాట్లాడేవారు...ఇలాంటి విషయాలన్నింటి గురించి బాబాయ్‌కి బాగా తెలుసు. అందుకే సెట్‌లో ఆయనే నన్ను ఎక్కువగా గైడ్ చేశారు. ఆయన వల్లే నాన్నలా నటించగలిగాను. నా గెటప్ ఫైనల్ చేయడానికి ఐదారు సార్లు ఆలోచించాల్సి వచ్చింది.

క్రిష్ విషయంలో సంతృప్తిగా వున్నారా?

ఇదొక ఎమోషనల్ జర్నీ. భార్య భర్తల మధ్య సాగే భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రాన్ని క్రిష్ మలిచారు. అది నాకు బాగా నచ్చింది. అందుకే ఆయనే ఈ చిత్రానికి కరెక్ట్ అని చెప్పాను. సినిమా విషయంలో రెట్టింపు సంతృప్తితో వున్నాను. ఆర్టిస్ట్‌ల గెటప్‌ల విషయంలో, సెట్‌ల విషయంలో క్రిష్ చాలా కేర్ తీసుకున్నారు. ఇదొక వింటేజ్ ఫిల్మ్. సినిమాకు ఆ లుక్‌ని తీసుకురావడం కోసం దర్శకుడు చాలా శ్రమించారు.

30 ఏళ్ల తరువాత మళ్లీ బాలకృష్ణతో కలిసి నటించడం ఎలా వుంది?

బాబాయ్‌ది అందరితో కలిపోయే తత్వం కాబట్టి నాకు కష్టంగా అనిపించలేదు. మిగతా వారితో కలిసి నటిస్తే ఏంటీ వీడు మనకంటే ఎక్కువ చేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ బాబాయ్ మాత్రం అలా ఎప్పుడూ ఆలోచించరు. బాబాయ్‌తో 30 ఏళ్ల తరువాత కలిసి నటించడం మర్చిపోలేని అనుభూతినిచ్చింది.

సినిమాలో మీ పాత్ర నిడివి ఎంత?

ఎన్టీఆర్ చాలా మందిని ప్రభావితం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి కథ అంటే చాలా మంది కనిపించాలి. అలా చేస్తే ఒక భాగం సరిపోదు. అందుకే రెండు భాగాలుగా నిర్మించాం. సినిమాలో నాది ముఖ్యపాత్ర కాకపోయినా కీలక సన్నివేశాల్లో మాత్రం కనిపిస్తుంటాను. ఇంకో విషయం ఏంటంటే ఇందులో నేను ఓ సన్నివేశంలో అర్జునుడి గెటప్‌లో కనిపిస్తాను. దీనికి సంబంధించిన స్టిల్స్ త్వరలోనే విడుదల చేస్తాం. అర్జునుడి గెటప్‌లో నన్ను చూసిన బాబాయ్ ఈ గెటప్‌లో ఇంత బాగుంటావని ఊహించలేదు అన్నారు. నా కెరీర్‌లో తొలిసారి పౌరాణిక గెటప్‌లో కనిపించిన సినిమా ఇదే.

ఈ బయోపిక్ మొదలైన దగ్గరి నుంచి దీనికి సమాంతరంగా రామ్‌గోపాల్‌వర్మ ఓ సినిమాను తెరపైకి తీసుకొచ్చారు?. వరుసగా టీజర్‌లు విడుదల చేస్తున్నారు. దీనిపై ఓ మనవడిగా మీ కామెంట్?

ఇలాంటి వాటి గురించి నేను పెద్దగా పట్టించుకోను. నేను ఎలాంటి వ్యక్తినో చాలా మందికి తెలుసు. వివాదాలకి దూరంగా వుంటాను. నేను కలవాలి, స్పందించాలి అని అనుకున్నప్పుడు మాత్రమే స్పందిస్తుంటాను. అది నా నైజం. వేరే వాళ్లు దాన్ని పొగరు అనుకున్నా పట్టించుకోను. ఈ సినిమా జర్నీలో నాకు తెలియని చాలా విషయాలు తెలుసుకున్నాను. అవన్నీ రేపు సినిమాలో చూస్తే మీకే అర్థమవుతాయి.

తొలిసారి థ్రిల్లర్ సినిమా చేస్తున్నట్టున్నారు?

గుహన్ చెప్పిన కథ నన్నెంతగానో ఆకట్టుకుంది. అందుకే అంగీకరించాను. కొత్తగా ఏదైనా ప్రయత్నించాలని తొలిసారి థ్రిల్లర్ సినిమా చేస్తున్నాను. మంచి ఎమోషన్‌తో సాగుతుంది. నా నువ్వే కొత్తగా వుంటుందని ప్రయత్నించాను. అది వర్కవుట్ కాలేదు. అలా అని ప్రయత్నించకుండా వుండలేం కదా? ఏదైనా ప్రయత్నిస్తేనే కదా అది మనకు సూటవుతుందా? లేదా? అనేది తెలిసేది. కొత్తగా ఏదీ చేయకుండా మనవల్ల కాదేమో అనుకుంటే అక్కడే వుండిపోతాం కదా. అది నాకు ఇష్టం వుండదు. ఈ చిత్రానికి రక్షణ, అన్వేషణ అని చాలా టైటిల్స్ అనుకుని చివరికి 118ని ఫైనల్ చేశాం.

ఎన్టీఆర్ సినిమా విషయంలో ప్రేక్షకులు మీరు చెప్పేమాట?

నందమూరి అభిమానులకు, తాతగారిని అభిమానించే ప్రతి ఒక్కరికి పండగకు మూడు రోజుల ముందే పండగ సంబరాలు మొదలవుతాయి.

2151

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles