బాల్కనీవాళ్లకూ నచ్చుతుంది!


Sat,May 19, 2018 10:45 PM

Kalyan Krishna Interview About Nela Ticket Movie

కథలోని భావోద్వేగాలతో ప్రేక్షకులు సహానుభూతి చెందినప్పుడే సినిమా విజయవంతమవుతుంది . కుటుంబ ప్రేక్షకులందరూ కలిసి ఆనందించే సినిమాలు తీయాలన్నదే నా అభిమతం అన్నారు కల్యాణ్‌కృష్ణ కురసాల. సోగ్గాడే చిన్నినాయనా రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాల ద్వారా ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారాయన. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం నేలటిక్కెట్టు ఈ నెల 25న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కురసాల పాత్రికేయులతో ముచ్చటించారు.
Kalyankrishna
చిన్నతనంలో మా ఊరిలో ఎక్కువగా బెంచ్ మీద కూర్చుని సినిమాలు చూసేవాణ్ణి. హైదరాబాద్ వచ్చి సహాయదర్శకుడిగా పనిచేస్తున్న సమయంలో నేను ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో వుండేవాడిని. అప్పుడు ప్రతి సినిమాను ఓ సారి బాల్కనీలో, మరోసారి నేలటిక్కెట్టులో చూసేవాణ్ణి. అలా ఎన్నో సినిమాలు చూసిన అనుభవాలు నాకు వున్నాయి. నా దృష్టిలో నేలటిక్కెట్టు ప్రేక్షకులు లాజిక్‌ను పట్టించుకోరు. సినిమా నచ్చితే బాగుందంటారు. అంతేకాని బాల్కనీ ప్రేక్షకుల మాదిరిగా సినిమా ఎందుకు బాగా లేదో విశ్లేషణ చేయరు.

మాస్ కాదు ఫ్యామిలీ సినిమా..

పూర్తిగా మాస్ అంశాలు మేళవించిన చిత్రం కాదిది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో కథ సాగుతుంది. కేవలం నేలటిక్కెట్టు వారికి మాత్రమే కాదు బాల్కనీ వాళ్లకు కూడా నచ్చుతుంది. సెన్సార్ సభ్యులు సినిమా చూసి చాలా బాగుందని ప్రశంసించారు. ఇందులో రవితేజ ఆవారాగా కనిపిస్తారు. అయితే అతనిలో జనం కోరుకునే లక్షణాలు ఉంటాయి. తన ప్రయాణంలో ఎంతమంది ఆత్మీయుల్ని సంపాదించుకున్నాడు? అందరిని తన కుటుంబంలా భావించి వారి శ్రేయస్సు కోసం ఏం చేశాడన్నదే చిత్ర ఇతివృత్తం. వినోదం, భావోద్వేగాల మేళవింపుతో రవితేజ పాత్ర ఆసక్తికరంగా సాగుతుంది.

అందరికి నచ్చేదే కమర్షియల్ సినిమా..

సినిమాలపరంగా ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఒక సినిమా చుట్టూ ఎన్నో అంశాలు ముడిపడివుంటాయి. నా ఇష్టం మేరకు ప్రయోగాలు చేస్తానంటే కుదరదు. నిర్మాతలకు ఎలాంటి సమస్యరాదని అనుకున్నప్పుడు మాత్రమే ప్రయోగాలు చేస్తాను. నా గత రెండు చిత్రాల్ని కూడా అన్ని వర్గాల్ని మెప్పించే అంశాలతో తీర్చిదిద్దాను. నేల టిక్కెట్టు కూడా అదే తరహాలో ఉంటుంది. ఈ సినిమా కోసం రవితేజతో కలిసి చాలా రోజులు ప్రయాణం చేశాను. అందుకే మంచి అవుట్‌పుట్ వచ్చింది. 90రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశాం.

వినోదాన్నే ఆశిస్తారు..

రవితేజ సినిమా అనగానే ప్రేక్షకుల తొలుత వినోదాన్నే ఆశిస్తారు. ఈ సినిమా ఆద్యంతం చక్కటి వినోదంతో సాగుతుంది. మనిషిని, మంచితనాన్ని ప్రేమించాలనే సందేశం ఉంటుంది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్‌లోనే సినిమా ఆత్మ ఏమిటో తెలియజెప్పాం. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే సినిమాలు తీయాలన్నదే నా లక్ష్యం. నా సొంత కథలతోనే సినిమాలు చేయడానికి ప్రాధాన్యతనిస్తాను.

బంగార్రాజు కోసం సిద్ధం..

నాగార్జునగారితో నా తొలి చిత్రం సోగ్గాడే చిన్నినాయనా చేయడం గొప్ప అనుభూతినిచ్చింది. ఈ సినిమాకు బంగార్రాజు పేరుతో త్వరలో సీక్వెల్‌ను చేసే ఆలోచన ఉంది. నేల టిక్కెట్టు విడుదలైన తర్వాత నాగార్జునగారిని కలిసి కథ చెబుతాను.

3116

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles