చంద్రబోస్ పాటలు స్ఫూర్తిదాయకం


Mon,September 18, 2017 10:54 PM

chandrabose
కవులు, కళాకారులు, రచయితలు ఎక్కడైతే ఆదరింపబడతారో ఆ రాజ్యాలు ప్రజల ఆశీస్సులతో సుభిక్షంగా వుంటాయి అన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి. భారత్ కల్చరల్ అకాడమి, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో మహాకవి కాళోజీ నారాయణరావు పురస్కార ప్రదానోత్సవం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. 2016 సంవత్సరానికిగాను గీత రచయిత చంద్రబోస్, 2017 సంవత్సరానికి సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కె.వి.రమణాచారి మాట్లాడుతూ మహాకవి కాళోజీగారు ఏం మాట్లాడినా అది కవితలా మారిపోయేది. అలాంటి గొప్ప వ్యక్తి పేరు మీద పురస్కారాన్ని అందుకున్న చంద్రబోస్, వందేమాతరం శ్రీనివాస్‌లకు అభినందనలు. చంద్రబోస్ రచనలు నేటి యువతరంలో స్ఫూర్తినింపుతూ ఉత్తేజపరుస్తున్నాయి. టెలివిజన్ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తాను అన్నారు. కాళోజీ రచనల్ని తాను ఎంతగానో ఇష్టపడతానని, తెలుగుదనంతో కూడిన పాటల్ని రాయడానికి ఆయన మాటలే ప్రేరణనిచ్చాయని చంద్రబోస్ చెప్పారు. మహాకవి కాళోజీ పేరిట అవార్డును అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని వందేమాతరం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు టెలివిజన్ రచయితల సంఘం అధ్యక్షుడు నాగబాల సురేష్‌కుమార్, సాయివెంకట్ తదితరులు పాల్గొన్నారు.

420

More News

VIRAL NEWS