ఒకరిని ఫాలో కావడం నా నైజం కాదు!


Mon,May 20, 2019 04:22 AM

kajal aggarwals interview over Sita movie

వెండితెర నిండు చందమామ కాజల్. పుష్కరకాలంగా తనదైన సోయగంతో తళుకులీనుతోంది. వన్నెతరగని సౌందర్యం, చూడచక్కటి అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది. ఈ ప్రయాణాన్ని నేను పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నాను. నేను కోరుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాననే సంతృప్తి ఉంది అని తనకెరీర్ గురించి సంతోషాన్ని వ్యక్తం చేసింది కాజల్. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం సీత. తేజ దర్శకుడు. ఈ నెల 24న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ ఆదివారం పాత్రికేయులతో సంభాషించింది. ఆమె చెప్పిన ముచ్చట్లివి...

సినిమాలో మీరు పోషిస్తున్న పాత్రను అభినవ సీతగా అభివర్ణించవొచ్చా?

-నా పాత్రలో పౌరాణిక సీత లక్షణాలు ఏమీ కనిపించవు. లక్ష్యం కోసం తపించే ఓ ఆధునిక యువతి కథ ఇది. మానవ సంబంధాలు, వాటితో పెనవేసుకుపోయిన అహం సమస్యలు ప్రధానంగా సాగుతుంది. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత ప్రాధామ్యాలు ఉంటాయి. వాటిని సాధించడానికి ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటుంటారు. సీత తన కలల సాధనకు ఏం చేసిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది.

దర్శకుడు తేజతో కలిసి మూడో సినిమా చేయడం ఎలాంటి అనుభూతినిచ్చింది?

-తేజగారంటే నాకెంతో గౌరవం. ఈ సినిమా ఎప్పుడో చేయాల్సింది. అనుకోని కారణాల వల్ల కుదరలేదు.

సీత పాత్ర చిత్రణలో మీకు నచ్చిన అంశాలేమిటి?

-నేటి మహిళకు ప్రతినిధిగా నా పాత్ర చిత్రణ ఉంటుంది. సీత గీసిందే గీత.. అని సినిమాలో ఓ సంభాషణ ఉంటుంది. అందులోనే సీత వ్యక్తిత్వం మొత్తాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో తనదే పై చేయి కావాలనే మనస్తత్వమున్న యువతి ప్రయాణమిది. అయితే వ్యక్తిగతంగా సీతలోని కొన్ని లక్షణాల్ని నేను కూడా ఇష్టపడను (నవ్వుతూ).

మీ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయని అంటున్నారు?

-అలాంటిదేమి లేదు. అభిమానానికి, అహంకారానికి సన్నని విభజనరేఖ ఉంటుంది. సీత ఆ గీత దాటదు. ఎదుటివారికి నష్టం చేయకుండానే తన పంతాన్ని నెగ్గించుకుంటుంది. నా పాత్ర చిత్రణలో భిన్న పార్శాలు కనిపిస్తాయి. కథలో సంక్లిష్టత, అనూహ్య మలుపులు ఉంటాయి.

మీ సమకాలీన కథానాయికలు మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తున్నారు. మీరు అటువైపు దృష్టిపెట్టకపోవడానికి కారణమేమిటి?

-ఏ విషయంలోనైనా మరొకరితో పోల్చిచూడటం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎవరో ఏదో చేస్తున్నారని వారిని ఫాలో అయిపోవడం నా నైజం కాదు. కథ నచ్చితే మహిళా ప్రధాన చిత్రాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను నేను శక్తివంతమైన పాత్రల్లో ఆవిష్కరించుకోవాలనే తపనతో కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నాను.

మను చరిత్ర సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టే ఉద్ధేశ్యం ఉందా?

-ఓ బ్యానర్‌ను మొదలుపెడదామనే ఆలోచన ఉండేది. ప్రస్తుతం దానిని పక్కనపెట్టాను. సినిమాల మీదే దృష్టిపెడుతున్నాను. భవిష్యత్తులో నిర్మాణ బాధ్యతలు తీసుకునే అంశాన్ని తోసిపుచ్చలేం.

మీరు అరకులోయలో నడిపిస్తున్న స్కూల్ ఎలా పనిచేస్తున్నది?

-సీత షూటింగ్ సందర్భంగా జనవరిలో అరకులోని స్కూల్‌ను సందర్శించాను. అక్కడ విద్యతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలకు పెద్దపీట వేస్తున్నాం. ఆ పాఠశాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి కృషిచేస్తాను.

ఇండియన్-2 సినిమా ఎంతవరకు వచ్చింది?

-ప్రస్తుతం కమల్‌హాసన్‌గారు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దాంతో షూటింగ్‌కు విరామం వచ్చింది. వచ్చే నెలలో తిరిగి సెట్స్‌లోకి అడుగుపెడతాను. ఇక క్వీన్ తమిళ రీమేక్ పారిస్ పారిస్ చిత్రీకరణ పూర్తయింది. అందులో నా పాత్ర ఎంతగానో నచ్చింది. ఆ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. తమిళంలో జయం రవితో చేస్తున్న సినిమా కూడా చిత్రీకరణ పూర్తయింది.

-ఈ సినిమా కోసం ఎన్నో సాహసాలు చేశాను. ఓ సీన్‌లో దాదాపు 200 కేజిల బరువున్న మంచు ముక్కల్ని శరీరంపై వేసుకొని నటించాను. కొన్ని పోరాట ఘట్టాల్లో కూడా నటించాను. వాటివల్ల శరీరంపై కొన్ని గాయాలయ్యాయి. ఎంతో శ్రమతో సినిమా చేశాను.

3556

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles