అర్జున్‌రెడ్డితో పోల్చుతారేమోనని భయపడ్డా!


Tue,May 14, 2019 01:14 AM

Kabir Singh Shahid Kapoor Explains Smoking And Drinking Scenes In Film

తెలుగులో అర్జున్‌రెడ్డి చిత్రం సంచలనాల్ని సృష్టించింది. కథానాయకుడి పాత్ర చిత్రణలో కొత్త ఒరవడికి నాందిపలికి కల్ట్‌మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాను హిందీలో కబీర్‌సింగ్ పేరుతో పునర్నిర్మిస్తున్నారు.షాహిద్‌కపూర్ కథానాయకుడు. తెలుగు మాతృకకు దర్శకత్వం వహించిన సందీప్‌రెడ్డి వంగా హిందీ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. కియారా అద్వాణీ కథానాయిక. సోమవారం విడుదల చేసిన ట్రైలర్ అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నది.ఈ చిత్రం జూన్ 21 న విడుదలకానుంది. ఇటీవల షాహిద్‌కపూర్ ముంబయిలో మీడియాతో ముచ్చటిస్తూ కబీర్‌సింగ్ గురించిన ఆసక్తికరమైన అంశాల్ని వెల్లడించారు.

-ఇప్పటివరకు నా కెరీర్‌లో పోషించిన అత్యంత ప్రభావశీలమైన పాత్ర ఇది. కబీర్‌సింగ్ స్వీయ విధ్వంసకారుడు. ఓ ధిక్కారస్వభావి. విఫల ప్రేమజ్ఞాపకాల్లో బ్రతుకుతూ వ్యసనాలకు బానిస అవుతాడు. ఓరకంగా స్క్రీజోఫ్రెనిక్‌లా కనిపిస్తాడు. ఇంతటి ఇంటెన్సిటీ ఉన్న పాత్రను చేయడం ఏ నటుడికైనా పరీక్షలాంటిది.

-షూటింగ్ పూర్తిచేసుకున్న తర్వాత కూడా కబీర్‌సింగ్ పాత్ర నన్ను వెంటాడింది. ఒకవేళ పెళ్లికి పూర్వం ఈ సినిమా అవకాశం వచ్చిఉంటే అంతగా కష్టపడేవాడిని కాదు. ఇప్పుడు నేను ఇద్దరు పిల్లల తండ్రిని. షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్లిన ప్రతిసారి కబీర్‌సింగ్ ఛాయలు నాలో కనిపించకుండా జాగ్రత్తపడేవాడిని. ఆ పాత్రలోని నెగెటివ్ ఎనర్జీ చూస్తే పిల్లలు డిస్ట్రబ్ అవుతారేమో అని లోలోన భయం ఉండేది.

-శారీరకంగా, మానసికంగా కబీర్‌సింగ్ పాత్రకోసం చాలా కసరత్తులు చేయాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం నేను దాదాపు 7 కిలోల బరువు పెరిగాను. ప్రియురాలి ఎడబాటుతో ఒంటరిగా ఫీలవుతుంటాడు కబీర్‌సింగ్. ఆ పాత్రలోని విషాదాన్ని పలికించడం పెద్ద సవాలు అనిపించింది. తెలుగు అర్జున్‌రెడ్డి చూసినప్పుడు విజయ్ దేవరకొండ ఆ పాత్రలో ఇన్‌వాల్వ్ అయిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.

-కబీర్‌సింగ్ ఆల్కాహాలిక్. నిజ జీవితంలో నాకు మద్యపానం, మాంసాహారం, ధూమపానం వంటి అలవాట్లు లేవు. సినిమాలోని చాలా సన్నివేశాల్లో నేను మద్యం, సిగరెట్ తాగుతూ కనిపిస్తాను. ఎలాంటి పాత్ర చేసినా దాని తాలూకు లక్షణాల్ని పూర్తిగా ఆకళింపు చేసుకోవాలన్నది నా సిద్ధాంతం. సినిమాలో నేను ఆల్కాహాలిక్‌గా కనిపించే సన్నివేశాలన్ని సహజంగా వచ్చాయని మా టీమ్‌వాళ్లు మెచ్చుకున్నారు. ఉడ్తా పంజాబ్ చిత్రంలో కూడా నేను డ్రగ్ ఎడిక్ట్‌గా కనిపించాను. అయితే కబీర్‌సింగ్ కోపాన్ని ఏమాత్రం నియంత్రించుకోలేని, తీవ్ర భావోద్వేగాలున్న ప్రేమికుడు. ఉడ్తా పంజాబ్‌లో నేను పోషించిన టామ్మీ పాత్ర కన్నా కబీర్‌సింగ్‌లోనే భిన్న పార్శాలు ఉన్నాయనిపించింది.

-కబీర్‌సింగ్ చిత్రంలో నేను పంజాబీ యువకుడిగా కనిపిస్తాను. ముంబయిలో నివసించే అతను మెడిసిన్ చదవడానికి ఢిల్లీ వెళతాడు. నేను ఢిల్లీలో పుట్టి పెరిగాను. కబీర్‌సింగ్ వంటి అహంభావ మనస్తత్వమున్న ఉన్నత కుటుంబాల యువకుల్ని చాలా మందిని చూశాను. ఆ నేపథ్యం కూడా కబీర్‌సింగ్ పాత్ర మీద ఇష్టం పెరగడానికి కారణమైంది.

-తెలుగులో అర్జున్‌రెడ్డి ఓ కల్ట్‌మూవీ. విజయ్ దేవరకొండ అద్భుతమైన అభినయాన్ని కనబరిచాడు. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు తెలుగు, హిందీ మధ్య పోల్చి చూస్తారేమో అని భయపడ్డాను. హిందీ ప్రేక్షకుల్లో చాలా మంది తెలుగు వెర్షన్‌ను చూడలేదు కాబట్టి పోల్చి చూసే అవకాశం ఉండదనిపించింది. మరోవిషయం ఏమిటంటే.. దర్శకుడు సందీప్‌రెడ్డి హిందీ వెర్షన్ కోసం ఎన్నో మార్పులు చేశాడు. ఇక్కడి నేటివిటీ ప్రతిబింబించేలా కథను తీర్చిదిద్దాడు.

2726

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles