25ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు!

Tue,September 17, 2019 11:35 PM

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్మీకి’. హరీష్‌శంకర్‌ దర్శకుడు. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. ఈ నెల 20న ప్రేక్షకులముందుకురానుంది. రాఘవేంద్రరావు డైరెక్ట్‌ చేసిన ‘దేవత’ (1982) చిత్రంలోని ‘ఎల్లువచ్చి గోదారమ్మా’ గీతాన్ని ఈ సినిమాలో రీమిక్స్‌ చేసిన విషయం తెలిసిందే. మిక్కీ జే మేయర్‌ స్వరకర్త. ఈ పాట వీడియో ప్రోమోను మంగళవారం ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఆ రోజుల్లో ఇసుకలో చాలా కష్టాలు పడి ఈ పాటను తీశాం. ఈ పాటతో నన్ను పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లారు. షూటింగ్‌ లొకేషన్ల కోసం అన్వేషణలో రాజమండ్రి దగ్గరలోని ఉండ్రాజవరం వెళ్లాం. అక్కడ బిందెల తయారి టైంలో వస్తున్న శబ్ధాలు పాట చేయడానికి ప్రేరణనిచ్చాయి. దాంతో బిందెలను అద్దెకు తీసుకొని పాట పూర్తిచేశాం. చక్కటి ప్రజాదరణ పొందిన పాటను రీమేక్‌ చేయడం ఆనందంగా ఉంది. ‘దేవత’ సినిమా 25 వారాలు ప్రదర్శింపబడింది. ఈ సినిమా కూడా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. హరీష్‌శంకర్‌ మాట్లాడుతూ ‘ఈ పాట తీయాలన్నది నా ఎనిమిదేళ్ల కల. అయితే సరైన సమయం కోసం ఎదురుచూశాను. ఎనభైల్లో డ్యాన్స్‌మాస్టర్‌ సలీమ్‌ కంపోజ్‌ చేసిన శైలిలోనే నృత్యాలు ఉండాలని శేఖర్‌మాస్టర్‌కు సూచించాను. యానాంలో చిత్రీకరణ జరుపుతున్నప్పుడు పాట విని ఆనందబాష్పాలు వచ్చాయి. ఈ పాటకు పూజాహెగ్డే పరిపూర్ణంగా న్యాయం చేసింది. ఆమె తప్ప ఈ పాటలో మరెవరూ నర్తించలేరు.


వరుణ్‌తేజ్‌ డ్యాన్స్‌ అద్భుతంగా చేశాడు. కొన్ని చోట్ల శోభన్‌బాబుగారిని గుర్తుచేశాడు. పాటలో ఉపయోగించిన బిందెల ఆకృతి కూడా అలనాడు రాఘవేంద్రరావు శైలిలోనే ఉండేలా చూసుకున్నాం. గురువుకు శిష్యుడు ఇచ్చే పువ్వులాంటిది ఈ పాట’ అన్నారు. పూజాహేగ్డే మాట్లాడుతూ ‘ఈ పాటకోసం దాదాపు 1500 బిందెలు సమకూర్చిన నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీదేవి వంటి లెజెండరీ నటి చేసిన గీతంలో నర్తించాలంటే తొలుత భయమేసింది. ఎంతో ఒత్తిడికి గురయ్యాను. చాలాసార్లు ఆ పాటను పరిశీలించి స్టెప్స్‌ ప్రాక్టీస్‌ చేశాను. చివరకు ఆ గీతం మ్యాజిక్‌ను పునరావృతం చేయడానికి ప్రయత్నించాం’ అని చెప్పింది. ‘తొలుత రీమిక్స్‌ అనగానే చిరంజీవి లేదా పవన్‌కల్యాణ్‌ పాట అనుకున్నాను. శ్రీదేవిగారి పాట చేస్తున్నారని తెలియగానే ఉద్వేగంగా అనిపించింది. వాస్తవానికి పాటలు, డ్యాన్సులు నాకంత సౌకర్యంగా అనిపించవు. కానీ ఆ పాట మ్యాజిక్‌ను తిరిగి సృష్టించడానికి ప్రయత్నించిన చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు. బాలుగారి స్వరానికి నేను వీరాభిమానిని. ఆయన వాయిస్‌కి నేను నర్తించడం గొప్ప అనుభూతినిచ్చింది’ అని వరుణ్‌తేజ్‌ తెలిపారు. ‘రాఘవేంద్రరావుగారితో పనిచేయలేకపోయాననే సంతృప్తిని ఈ పాట తీర్చింది. వరుణ్‌తేజ్‌, పూజాహెగ్డే ఈ పాటకు చక్కగ న్యాయం చేశారు’ అని నృత్యదర్శకుడు శేఖర్‌ మాస్టర్‌ చెప్పారు.

1132

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles