నాకు పెళ్లవలేదు!


Sun,November 11, 2018 11:15 PM

interview ileana i felt Amar Akbar Antony is the right film to come back to tollywood

స్టార్‌డమ్, సెలబ్రిటీ హోదాలపై నాకు నమ్మకం లేదు. నేనొక సాధారణ నటిని. నాకు నచ్చినట్లుగా జీవించడమే ఇష్టం అని చెప్పింది ఇలియానా. ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయికగా పేరుతెచుకున్న ఈ గోవా సోయగం దాదాపు ఆరేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంది. అమర్ అక్బర్ ఆంటోని చిత్రం ద్వారా తెలుగులో పునరాగమనం చేస్తున్నది. ఈ నెల 16న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం ఇలియానా పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..తాము ఎదుర్కొన్న వేధింపులను గురించి చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. తమకు జరిగిన అన్యాయాల్ని చెప్పినప్పుడు తప్పు చేసిన వారు పశ్చాత్తపపడే ఆస్కారం ఉంటుంది. ఈ వేధింపులు ఆగిపోవాలి. నేనెప్పుడూ పరిశ్రమలో వేధింపులను ఎదుర్కొలేదు.

తెలుగులో పునరాగమనం కోసం అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాను ఎంచుకోవడానికి కారణమేమిటి? ఇందులో మీ పాత్ర ఎలా ఉంటుంది?

-కథలోని వైవిధ్యత నచ్చి ఈ సినిమాను అంగీకరించాను. ఇందులో అభినయానికి ప్రాధాన్యమున్న పాత్ర చేశాను. భిన్న పార్శాలతో నా పాత్ర సాగుతుంది. అమర్ అక్బర్ ఆంటోనీలతో నా పాత్రకున్న సంబంధం ఏమిటన్నది ఆసక్తిని పంచుతుంది.

తెలుగులో అగ్ర నటిగా ఉన్న సమయంలో బాలీవుడ్‌కు వెళ్లిపోయారెందుకని?

-జులాయి సినిమాలో నటిస్తునప్పుడు బాలీవుడ్ చిత్రం బర్ఫీలో అవకాశం వచ్చింది. ఆ సినిమా చేయాలా వద్దా అన్న సంశయంలో త్రివిక్రమ్‌ను సలహా అడిగాను. కథ బాగుంది కాబట్టి సినిమా చేయమని చెప్పారాయన. ఆ సినిమా తర్వాత కథాబలమున్న మంచి చిత్రాల్లో అవకాశం రావడంతో బాలీవుడ్ సినిమాలు చేశాను. దాంతో హిందీకే ప్రాధాన్యతనిస్తున్నానని, తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపడం లేదనే ఊహగానాలు వెలువడ్డాయి. దాంతో ఆరేళ్ల పాటు తెలుగు సినిమాలకు దూరమవ్వాల్సివచ్చింది. ఆ పుకార్లు ఎలా వచ్చాయో అర్థం కాలేదు.

ఈ ఆరేళ్లలో తెలుగు కథలు ఏమైనా విన్నారా?

-కొన్ని కథలు విన్నాను. నా పాత్రలు నచ్చక వాటిని తిరస్కరించాను.

తొలినాళ్లతో పోలిస్తే కథల ఎంపికలో మీ ప్రాధామ్యాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి.?

-ఇరవై ఏళ్ల వయసులో నా కెరీర్ ప్రారంభమైంది. ప్రస్తుతం నా వయసు 32. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన సినిమాలన్నీ చేసుకుంటూ వెళ్లిపోయాను. పెరుగుతున్న వయసుతో పాటే మన ఆలోచన విధానంలో పరిణితి వస్తుంది. ప్రస్తుతం వృత్తిపట్ల గౌరవం పెరిగింది. మంచి పాత్రలు చేయాలనే తపన మరింత ఎక్కువైంది.

బాలీవుడ్ కెరీర్ విషయంలో సంతృప్తిగా ఉన్నారా?

-కెరీర్ విషయంలో నేను కొన్ని తప్పులు చేశాను. వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నాను. కొన్ని సినిమాలు అంగీకరించేటప్పుడు ఫలితం ఎలా ఉంటుందో ముందుగా ఊహించలేం. తెలుగులో పోకిరి విషయంలో అదే జరిగింది. తొలుత ఆ సినిమా చేయకూడదని అనుకున్నాను. మహేష్‌బాబు సోదరి మంజుల నా కెరీర్‌కు మంచి సినిమా అవుతుందని సూచించడంతో అంగీకరించాను. నా మనసు మాత్రం వేరే సినిమా చేయమని చెప్పింది. అన్యమస్కంగానే ఆ సినిమా చేశాను. కానీ అంతిమంగా నా కెరీర్‌లోనే పెద్ద విజయంగా నిలిచింది. అలా మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు జీవితాలపై ప్రభావం చూపుతుంటాయి.

ప్రస్తుతం మీరు సింగిల్‌గా ఉన్నారా?మీ వివాహం గురించి సోషల్‌మీడియాలో చాలా వార్తలు వినిపించాయి. ?

-నాకు పెళ్లి కాలేదు. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను. నాకు నచ్చినవే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నాను. నేను ప్రెగ్నెంట్‌నని, పెళ్లయిందని ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు. వాటిలో ఏ మాత్రం నిజంలేదు. వాటి గురించి చెప్పాల్సిందంతా సోషల్‌మీడియాలో ఇదివరకే చెప్పాను.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలేవి?

-తెలుగులో మంచి కథల కోసం ఎదురుచూస్తున్నాను. కొన్ని కథలు విన్నాను. అన్ని ఒకే అయిన తర్వాత ఆ సినిమాల గురించి చెబుతాను.

6114

More News

VIRAL NEWS