పంచ్ పండాలంటే కాంబినేషన్ కుదరాలి!


Wed,September 5, 2018 11:16 PM

interview allari naresh im planning to direct a film

ఎన్ని చిత్రాలు చేశామనేది కాదు. ఎంత మంచి చిత్రాలు చేశామన్నదే ముఖ్యం. అందుకే ఇక సెలెక్టీవ్‌గా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను అన్నారు అల్లరి నరేష్. సునీల్‌తో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం సిల్లీఫెలోస్. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో హీరో అల్లరి నరేష్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

సిల్లీఫెలోస్ ఎలా వుంటారు. అందులో మీ పాత్ర ఎలా వుంటుంది?

-సినిమాలో నా పాత్ర పేరు వీరబాబు. లేడీస్ టైలర్‌గా పనిచేస్తుంటాను. ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలనేది వీరబాబు కోరిక. దాని కోసం ఎవరు దొరికితే వారిని వాడేసుకుంటుంటాడు. దాన్నుంచి పుట్ట్టే వినోదం ఆకట్టుకుంటుంది. సాధారణంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు తోడుగా వుండే ఫ్రెండ్‌ని సాయం అడుగుతుంటాం కానీ వీరబాబు అలా కాదు ప్రతి దానికి తన మిత్రుడిని బుక్ చేస్తుంటాడు. ఇందులో నాకు స్నేహితుడిగా సునీల్ కనిపిస్తాడు. మా ఇద్దరి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.

సునీల్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది?

-నేను వేసే పంచ్‌లకు అంతే స్థాయిలో ప్రతిస్పందన వుంటేనే అది పండుతుంది. కామెడీ పరంగా అది చాలా అవసరం. అలాంటి పాత్రల్లో బ్రహ్మానందం, సునీల్ లాంటి వాళ్లు వుంటే చాలా హెల్ప్ అవుతుంది. కాంబినేషన్ కరెక్ట్‌గా కుదిరితే ప్రేక్షకుల్ని మరింతంగా నవ్వించే అవకాశం వుంటుంది. అలాంటి కాంబినేషనే ఈ చిత్రానికి కుదిరింది. సినిమాలో సునీల్‌తో నా కాంబినేషన్ హీరో, హీరోయిన్‌ల తరహా వుంటుంది.

మీరు, సునీల్ కలిస్తే వినోదం పాళ్లు ఎక్కువగా వుంటుందని ప్రేక్షకులు ఊహిస్తారు. ఆ విషయంలో వారిని ఎంత వరకు సంతృప్తి పరుస్తుంది?

-భీమనేని శ్రీనివాస్‌తో చేసిన సుడిగాడు నా కెరీర్‌లోనే పెద్ద హిట్. దాని తరువాత మళ్లీ ఇద్దరం కలిసి సుడిగాడు-2 లేదా సూపర్‌హీరోస్ లాంటి సినిమా చేయాలనుకున్నాం. అయితే అందులో ఎలాంటి స్పూఫ్‌లు వుండకూడదని నిర్ణయించుకున్నాం. అనుకరించడం నా దృష్టిలో యాక్టింగ్ కాదు. యూట్యూబ్‌లో ప్రతీ ఒక్కరు స్పూఫ్ వీడియోలు పెట్టేస్తున్నారు. వాటిని దాటి కొత్తగా ఏదైనా చెయ్యాలనుకున్నాం. తమిళ వెర్షన్‌లో సూరి చేసిన పాత్రలో సునీల్ నటిస్తాడని చెప్పగానే సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. సునీల్, నేను కలిసి చేస్తున్నాం అనగానే సంచులకొద్దీ పంచులు వుంటాయనుకుంటారు. అలా కాకుండా కొత్తగా నవ్వించే ప్రయత్నం చేశాం.

యాభై సినిమాలు పూర్తిచేసిన తరువాత వేగం తగ్గించినట్లున్నారు?

-ఈ మధ్య కాలంలో నా దగ్గరికి చాలా స్క్రిప్ట్‌లు వచ్చాయి. కానీ అందులో ఏదీ నాకు నచ్చలేదు. అందుకే వాటిని పక్కన పెట్టేశాను. రాసి కంటే వాసి ముఖ్యం. ఎన్ని చిత్రాలు చేశామనేది కాదు ఎంత మంచి చిత్రాలు చేశామన్నదే ముఖ్యం. అందుకే సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నాను.

మహేష్‌తో కలిసి మహార్షి చిత్రంలో నటిస్తున్నారు. ఆ పాత్ర ఎలా వుంటుంది?

-మా పాప పుట్టిన తరువాత నేను అంగీకరించిన తొలి చిత్రమిది. పాత్ర నచ్చడంతో మరో ఆలోచన చేయకుండా అంగీకరించాను. నా కెరీర్‌లో ఒక గాలిశీను (గమ్యం), ఒక మల్లీ(శంభో శివ శంభో) తరహాలో గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. దీనికి మించి ఈ సినిమా గురించి ఏం చెప్పను. చెప్పొద్దని దర్శకుడు వార్నింగ్ ఇచ్చాడు (నవ్వుతూ). ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది.

సెట్‌లో మహేష్‌తో ఎలా అనిపించింది?

-మహేష్‌లో సెన్సాఫ్‌హ్యూమర్ ఎక్కువ. సెట్‌లో ఏ చిన్న జోక్ వేసినా ఆయన చాలా ఎంజాయ్ చేస్తుంటారు. నాతో చాలా స్నేహపూర్వకంగా వున్నారు. ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా వుంది.

ప్రస్తుతం వాస్తవికత నేపథ్యంలో చాలా చిత్రాలు వస్తున్నాయి. మీ నుంచి ఆ తరహా సినిమా ఆశించొచ్చా?

-గతంలో వాస్తవికతకు దగ్గరగా నేను చేసిన కొన్ని ప్రయోగాలు ఫలించాయి. కొన్ని ఆశించిన ఫలితాల్ని అందించలేదు. నా కెరీర్‌లో అమితంగా ఇష్టపడి చేసిన చిత్రం లడ్డుబాబు. ఈ చిత్రానికి శ్రమించినంతగా ఏ చిత్రానికి శ్రమించలేదు. ఈ సినిమా ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని ఇకపై కొత్త తరహా సినిమాలు చేస్తే నా మార్కు అంశాలతో పాటు భావోద్వేగాలు కూడా సమాన స్థాయిలో వుండేలా చూసుకుంటాను. అలా రెండూ కుదిరినప్పుడే ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తాను.

మీ సంస్థలో మారుతితో కలిసి ఓ సినిమా వుంటుందని తెలిసింది?

-చాలా ఏళ్ల నుంచి మారుతి, నేను కలిసి సినిమా చేయాలని అనుకుంటున్నాం. ఎవడిగోల వాడిది, జంబలకిడి పంబ తరహాలో నాన్నగారి ైస్టెల్లో సినిమా వుండాలని చాలా కథలు అనుకుంటున్నాం. అన్నీ కుదిరితే వెంటనే సినిమా పట్టాలెక్కిస్తాం.

తదుపరి చిత్రం గురించి?

-పి.వి. గిరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం చిత్రీరరణ దశలో వుంది.

2232

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles