సమంత భార్యగా దొరకడం నా అదృష్టం!


Mon,April 8, 2019 12:09 AM

i have felt satisfied as an actor after a long time naga chaitanya

మజిలీ చిత్రానికి నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. కథలోని భార్యాభర్తల అనుబంధం, మధ్యతరగతి సంఘర్షణతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. అందుకే సినిమాకు అద్భుతమైన ఆదరణ లభిస్తున్నది అన్నారు నాగచైతన్య. సతీమణి సమంతతో కలిసి ఆయన నటించిన తాజా చిత్రం మజిలీ. శివ నిర్వాణ దర్శకుడు. సాహు గారపాటి, హరీష్‌పెద్ది నిర్మాతలు. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. నాగచైతన్య మాట్లాడుతూ అందరి హృదయాల్ని స్పృశిస్తున్న కథాంశం ఇది. ఈ సినిమా చూసిన వారు మాకు శ్రావణిలాంటి భార్య కావాలంటున్నారు. సమంత పాత్ర అంతలా మెప్పిస్తున్నది. అదృష్టం కొద్ది నాకు భార్యగా సమంత దొరికింది అన్నారు.

సినిమా రిలీజ్ రోజు ఉదయం 3గంటలకే లేచి దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండిపోయాను. చైతన్య సినీ ప్రయాణంలో చాలా ముఖ్యమైన చిత్రమిది. అందుకే విడుదలకు ముందు చాలా టెన్షన్ పడ్డాను. అంతటా పాజిటివ్ టాక్ వస్తుందని తెలుసుకొని ఉద్వేగాన్ని ఆపుకోలేక అర్ధగంట పాటు ఏడ్చాను. ఏ మాయ చేశావె తర్వాత చైతూ, నేను నటించిన గొప్ప చిత్రమిది. భర్తగా నాగచైతన్యను చూసి గర్విస్తున్నాను అని సమంత చెప్పింది. దర్శకుడు మాట్లాడుతూ కథలోని భావోద్వేగాలతో ప్రేక్షకులు సహానుభూతి చెందుతున్నారు. నటీనటులందరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇదే సంస్థలో మరో చిత్రాన్ని చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.

విడుదలైన అన్ని కేంద్రాల నుంచి సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని నిర్మాతలు తెలిపారు. నాగచైతన్య చాలా మంచివాడని నాకు తెలుసు. కానీ ఈ సినిమాతో గొప్ప నటుడని నిరూపించుకున్నాడు అని పోసాని కృష్ణమురళి చెప్పారు. రావు రమేష్ మాట్లాడుతూ నటుడిగా చైతూ ఈ సినిమాతో మరో మెట్టు ఎదిగారు. భావోద్వేగభరితమైన ఈ కథకు కమర్షియల్ హంగులు మేళవించి చెప్పడం మామూలు విషయం కాదు. దర్శకుడు శివ నిర్వాణ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

2795

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles